Homeసీజేఐపై దాడి హేయం

సీజేఐపై దాడి హేయం

- Advertisement -

మతోన్మాద న్యాయవాదిని కఠినంగా శిక్షించాలి

. మనువాదులను పెంచి పోషిస్తున్న మోదీ
. సనాతన సేనాని ఇప్పటికైనా కళ్లు తెరవాలి
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
. రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు

విశాలాంధ్ర – విజయవాడ:సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌పై బూటు దాడిని నిరసిస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. వామపక్షాలు, దళిత, గిరిజన, ప్రజాసంఘాలు నిరసనకు దిగాయి. జస్టిస్‌ గవాయ్‌పై సనాతన ధర్మం పేరుతో ఓ న్యాయవాది బూటు విసరడానికి ప్రయత్నించడం దుర్మార్గమని మండిపడ్డాయి. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాద చర్యలను తీవ్రంగా నిరసించాయి. జస్టిస్‌ గవాయ్‌పై దాడిని నిరసిస్తూ గిరిజన, దళిత, మైనార్టీ ఐక్య సంఘాల అధ్వర్యంలో విజయవాడలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్మృతివనం ఎదుట మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ అధ్యక్షతన పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. జస్టిస్‌ గవాయ్‌పై దాడిచేసిన కిషోర్‌ను తక్షణమే శిక్షించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, మతోన్మాద చర్యలకు చరమగీతం పాడాలని…సనాతన పేరుతో దాడులు చేస్తున్నవారిని కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ జస్టిస్‌ గవాయ్‌పై జరిగిన దాడి జాతి యావత్తు తలదించుకునే హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజేఐపై బూటుతో దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సానుభూతిపరుడు మత ఉన్మాదంతో చేసిన ఈ చర్యపై దేశవ్యాప్తంగా ప్రజలు మండిపడుతున్నారని తెలిపారు. పథకం ప్రకారం అణగారినవర్గాలపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. దేశంలో, రాష్ట్రంలో సనాతన పేరుతో పెద్దఎత్తున జరగుతున్న దాడులపై రాష్ట్రంలో కొత్తగా వచ్చిన సనాతన సేనాని ఇప్పటికైనా కళ్లు తెరవాలని, సమాజంలో అసమానతలను పెంచిపోషిస్తున్న బీజేపీ పాలకవర్గాలను ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించాలని హితవు పలికారు. కేవలం అధికారం కోసం విధానాలు మార్చుకోవడం సరికాదని, అన్ని వర్గాల ప్రజల పక్షంగా నిలబడాల్సిన అవసరం ఉందని సనాతన సేనానికి సూచించారు. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ పెద్దలు అన్ని వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని భ్రస్టుపట్టిస్తున్నారని, ఈ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్దిచెప్పక తప్పదని హెచ్చరించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అందించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడవల్సిన అవసరం ఏర్పడిరదని రామకృష్ణ పిలుపునిచ్చారు.
మాజీ ఎమ్మెల్సీ జల్సి విల్సన్‌ మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి రక్షకుడుగా ఉంటానని దేశ ప్రజలకు భరోసా కల్పించిన సీజేఐ గవాయ్‌పై ఉద్ధేశపూర్వకంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం పద్ధతిలో న్యాయవ్యవస్థను సక్రమమైన విధానంలో నిర్వహించే రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్నవారిపై అవమానకరమైన చర్యకు పాల్పడటం దుర్మార్గమన్నారు. ప్రజాస్వామ్య రాజ్యాంగ విలువలకు లోబడి ఉన్న దేశంలో ఉద్ధేశపూర్వకంగా ప్రధాని మోదీ నాయకత్వంలో కొందమంది వ్యక్తులు మనువాదాన్ని తీసుకువచ్చేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. కులాలు, మతాల వారీగా ప్రజలను విడదీయడమే సనాతన ధర్మమని, దీనిని అమలు చేసి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు పెద్దఎత్తున కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. గ్రామాల్లో ఎవరికైనా కోపం వస్తే గతంలో చెప్పుతో కొడతాను అనే నానుడి ఉందని, అలాంటి సనాతన సంప్రదాయాన్ని బీజేపీ పాలకులు పెంచిపోషించడం పనికి మాలిన చర్య అని అన్నారు. భారతీయులందరు ఒక్కటేన, ప్రజాస్వామ్య, లౌకికవాదాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, శాంతియుత పద్ధతిలో దేశ ఐక్యతను చాటిచెప్పాల్సిన అవసరం ఏర్పడిరదన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ పట్టపగలు సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిపై మతోన్మాద, సనాతన ధర్మం పేరుతో చెప్పుతో దాడిచేయడం జాతియావత్తు సిగ్గుతో తలదించుకునేలా ఉందని, ఈ చర్యను తీవ్రంగా పరిగణించవలసిన అవసరం ఉందన్నారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ఈ దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. మోదీ ప్రభుత్వం మనువాద, మతోన్మాద భావజాలాన్ని ప్రజలపై రుద్దేందుకు ఈ విధమైన చర్యలను ప్రోత్సహించడం దారుణమని మండిపడ్డారు. నిరసనలో సీపీఐ సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ కోటేశ్వరరావు, డీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బుట్టి రాయప్ప, ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రనాయక్‌, కోశాధికారి ఆర్‌.పిచ్చియ్య, వైసీపీ మైనార్టీ సెల్‌ విభాగం నాయకులు మునీర్‌ అహ్మద్‌, కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ నాయకులు కె.వినయ్‌కుమార్‌, ఇన్సాఫ్‌ నాయకులు అఫ్సర్‌, అలీ, సీపీఐ నాయకులు సంగుల పేరయ్య, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఉప్పె నరసింహారావు, కేవీపీయస్‌ నాయకులు నటరాజ్‌, క్రాంతికుమార్‌, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యానికి అవమానం: జగదీష్‌
సీజేఐ బీఆర్‌ గవాయ్‌పై దాడి ప్రజాస్వామ్యానికే అవమానమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్‌ మండిపడ్డారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఉన్నత పదవులు పొందవచ్చన్న దుర్బిద్ధితో ఓ న్యాయవాది సీజేఐపై దాడికి పాల్పడ్డాడని, ఆ న్యాయవాది పట్టాను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌పై దాడికి నిరసనగా మంగళవారం స్థానిక అంబేద్కర్‌ విగ్రహం దగ్గర సీపీఐ నిరసన కార్యక్రమం చేపట్టింది. సీపీఐ పట్టణ కార్యదర్శి ఎస్‌.గోపీనాథ్‌ అధ్యక్షత వహించారు. సీపీఐ నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలో పాల్గొన్నారు. జగదీష్‌ మాట్లాడుతూ సీజేఐపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. గాంధీ హంతకుడు గాడ్సేకు దేవాలయం కట్టాలని బీజేపీ ఎంపీ స్వయాన పార్లమెంటులో మాట్లాడితే కనీస చర్యలు లేవని, దీని ఫలితంగానే సీజేఐ గవాయ్‌పై దాడి జరిగిందన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ తమను రక్షిస్తాయనే నమ్మకంతో సనాతనం పేరుతో మతోన్మాదులు ఇలాంటి దాడులకు తెగబడుతున్నారని జగదీష్‌ విమర్శించారు. సీజేఐ గవాయ్‌ రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉన్న న్యాయవేత్త అని, అంబేద్కర్‌ చూపిన మార్గంలో నడుస్తున్న ఆయనపై మతోన్మాదుల దాడి దళితులు, వెనుకబడిన వర్గాలపై గల ద్వేషానికి ప్రతీక అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని, చట్టాలను కాపాడాల్సిన సుప్రీం కోర్టులో వర్ణ, కుల వివక్ష చూపుతూ భారత ప్రధాన న్యాయమూర్తిపైనే బూటు విసరడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. నాయకులు ఎస్‌ఎండీ గౌస్‌, రాము రాయల్‌, ఈశ్వరయ్య, దేవేంద్ర, దాసరి శ్రీనివాసులు, చిదంబరం, పుల్లయ్య, అంజి, సూర్యనారాయణ, నందు, రోహిత్‌, చిన్ని, మధుబాబు తదితరులు పాల్గొన్నారు.
సీజేఐపై దాడి దుర్మార్గం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గవాయ్‌పై సనాతన ధర్మం పేరుతో దాడికి యత్నించడం దేశ ప్రతిష్టను దెబ్బ తీయడమేనని ప్రజాసంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జస్టిస్‌ గవాయ్‌పై దాడికి నిరసనగా రాజోలు తహసీల్దారు కార్యాలయం ఎదుట సీపీఐ, దళిత చైతన్య వేదిక అధ్వర్యంలో నిరసనకు దిగారు. సీపీఐ జిల్లా కార్యదర్శి దేవ రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ జస్టిస్‌ గవాయ్‌పై దాడికి యత్నించడం ప్రజాస్వామ్య విలువలకు, న్యాయప్రస్థానానికి, రాజ్యాంగ స్ఫూర్తికి తిలోదాకాలు ఇవ్వడమేనన్నారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయ ఇంచార్జి కుమారికి వినతిపత్రం అందజేశారు. దీపాటి శివప్రసాద్‌, బత్తుల మురళీకృష్ణ, కొల్లాబత్తుల సతీష్‌, చిలకపాటి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు