Homeదీపావళికీ నిరాశే

దీపావళికీ నిరాశే

- Advertisement -

. నాలుగు డీఏలు పెండిరగ్‌
. పీఆర్సీ, ఐఆర్‌, పెండిరగ్‌ సమస్యలనేకం
. 17 నెలలుగా కనీసం చర్చించని సర్కార్‌
. ప్రభుత్వ ఉద్యోగుల తీవ్ర అసహనం
. పోరాటం తప్పదంటున్న సంఘం నేతలు

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: దీపావళి పండుగ సమీపిస్తున్నా కరువు భత్యం(డీఏ) చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఉద్యోగులలో అసహనం వ్యక్తమవుతోంది. ప్రతి ఆరునెలలకు డీఏ విడుదల చేయడం సాధారణ పద్ధతి అయినా… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు దాటుతున్నా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు డీఏలు పెండిరగ్‌లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తమ ఉద్యోగులకు డీఏ పెంపు అమలు చేసిన నేపథ్యంలో రాష్ట్ర ఉద్యోగులు కూడా దీపావళి ముందు ప్రభుత్వం శుభవార్త చెబుతుందని ఆశించారు. మంత్రివర్గ సమావేశానికి ముందు డీఏపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ప్రచారం జరిగింది. దీంతో ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి. కానీ మంత్రివర్గంలో ఉద్యోగుల డీఏకి సంబంధించి చర్చే జరగలేదని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన వెలువడకపోవడంతో నిరాశ వ్యక్తమవుతోంది. జీవన వ్యయం పెరుగుతున్న తరుణంలో డీఏలు ఆలస్యం కావడం ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. పండుగ రోజుల్లోనైనా ప్రభుత్వం స్పందించి పెండిరగ్‌ డీఏలు విడుదల చేయాలని ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. ఆర్థిక పరిస్థితులను సాకుగా చూపిస్తూ ప్రభుత్వం డీఏ చెల్లింపును వాయిదా వేస్తోందని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. పండుగ వేళలోనైనా ఉపశమనం కలిగించాలని, తక్షణమే నిర్ణయం ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి నేతలు అనేక హామీలు ఇచ్చారు. కరువు భత్యం (డీఏ) విడుదల, వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ), ఐఆర్‌, పెండిరగ్‌ బిల్లులు సకాలంలో చెల్లింపు, పాత పింఛన్‌ విధానం అమలు వంటి అనేక హామీలను కూటమి నేతలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేపడుతున్నా… ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటుతున్నా ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క ఆర్థిక ఇబ్బందులు ఉన్నా… ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం… ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల విషయంలో కనికరం చూపకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత గత 17 నెలల్లో ఒక్క రోజు అయినా ఉద్యోగుల సమస్యలు విన్నారా లేక చర్చించారా అని ఉద్యోగసంఘ నేతలు ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే తమ పట్ల ప్రభుత్వం ఇంత నిర్లక్ష్య ధోరణి అవలంబించడం ఏమిటని నిలదీస్తున్నారు. ఉద్యోగ సంఘాలతో నేరుగా ముఖ్యమంత్రి మాట్లాడకపోయినా… ఉద్యోగులకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరించి ఫలానా సమయానికి సమస్యలు పరిష్కరిస్తామని కనీసం ప్రకటన అయినా చేయాలని నేతలు కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన లేకపోవడంతో ఉద్యోగులు తమ నాయకత్వాన్ని విమర్శించే పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం సాచివేత ధోరణి కొనసాగిస్తే ఆందోళన బాట పట్టేందుకు ఉద్యోగ సంఘాలు సన్నద్ధమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు రెండు రోజుల్లో దీపావళి పండుగ రానున్న తరుణంలో సోషల్‌ మీడియాలో ఈలలు వేస్తూ… పళ్లాలు మోగిస్తూ…‘ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఖర్చులేని దీపావళి సంబరాలు’ ఇవేనంటూ వ్యంగ్యంగా రూపొందించిన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు