— మంత్రి కందుల దుర్గేష్.
విశాలాంధ్ర – కడియం : పచ్చదనం పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ, వాతావరణ కాలుష్యాన్ని నివారించే చర్యలలో భాగంగా, వాడవాడలా మొక్కలు నాటే కార్యక్రమాన్ని, రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కడియం మండలం, కడియపులంక గ్రామంలో ఈలి గంగారావు నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ సత్యదేవ నర్సరీ అధినేత పుల్లా వీర వెంకట్రావు దుర్గేష్ ను కలిసి కడియపులంక నర్సరీలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా ఎగుమతులు లేక అనేక ఇబ్బందులు పడుతున్న నర్సరీ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాలకు ఎగుమతులు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. దీనికి మంత్రి దుర్గేష్ స్పందిస్తూ ప్రపంచవ్యాప్తంగా కడియపులంక నర్సరీ రంగానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని, అటువంటి నర్సరీ రంగానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని, నర్సరీరంగం అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు.


