Homeవిశ్లేషణనవ్విపోదురుగాక నాకేటి

నవ్విపోదురుగాక నాకేటి

- Advertisement -

ఏలేవారి చేతికి ఎముకలు లేవనుకుంట బావ హద్దు అదుపు లేకుండా ప్రజాధనం మంచినీళ్లలా ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడేమయిందయ్యా ఎవరు ఖర్చు పెడుతున్నారు ఏంటి కథ. ఎవరని నిదానంగా అడుగుతావేంటి. అసలు పార్టీలో పనిచేసే వారికి పదవులివ్వకపోతే పని చేయరా. ప్రతి కార్యకర్తను ఏదో ఒక కమిటీలో మెంబరు వేసి ఎంతో కొంత జీతం ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులు ఎవరికి అందినకాడికి వారు ప్రజాధనం దోచుకుంటున్నారేగాని ప్రజల సమస్యలు పరిష్కారంపై దృష్టిపెట్టడంలేదు. ఒకరు లండను వెడితే మరొకరు అమెరికా ఇలా ఇతర దేశాల యాత్రలకు వేలాది కోట్లు ప్రజాధనం ఖర్చు చేస్తున్నారు. ఎవరేమనుకుంటే నాకేంటి అన్నట్లు వ్యవహరించడం శోచనీయం. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి దేశాలు తిరిగి ఎన్ని పరిశ్రమలు తెచ్చారో ప్రజలు చూస్తున్నారు. పరిశ్రమల కోసం ప్రజలకు చెందిన భూములు వందల ఎకరాలు వారికి ధారాదత్తం చేస్తున్నారు. వారు పరిశ్రమలు ఎప్పుడు పెడతారో ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలిస్తారో వేచి చూడటం ప్రజల వంతుగా మారింది. రాచరికానికి ప్రజాస్వామ్యానికి మధ్యనున్న విభజనరేఖ చెరిపివేసి రాచరిక పాలనలాగ ప్రస్తుతం నాయకులు పాలన సాగిస్తున్నారు. నాయకులు తమ బంధువులకు, అనుకూలురుకు సాయపడుతున్నారు. కాంట్రాక్టుల దగ్గర నుంచి ప్రభుత్వం వల్ల ఏ లబ్ధి చేకూరినా వారికే దక్కుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి పూర్తి వ్యతిరేక చర్య.
తెలుగు రాష్ట్రాలలో దాదాపు 80 వేల కోట్లు ఖర్చుచేసి 80 వేల హెక్టార్ల భూమిని కూడా సాగులోకి తేలేకపోయారని ఒక రిటైర్డు కలెక్టరు వ్యాఖ్యానించారు. అధికార కేంద్రాలు వ్యక్తిగత ప్రయోజనాలు తీర్చుకునేవిగా మారిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రులు, ఉన్నతాధికారులలో కొందరు ప్రజల సొమ్ము బంధువుల ఖాతాల్లోకి ఎలా మళ్లిస్తారనే సంగతి ప్రజలందరు గుర్తించారు. అధికారంలోకి వచ్చాక వారి ఆస్తులు ఎలా పెరిగాయనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఏడాదికి 30 రోజులు మించి జరగకపోయినా సభలో పాల్గొని సమస్యలు చర్చించే ఆసక్తి శాసనసభ్యులలో తగ్గిపోయింది. శాసనసభకు, నిర్వహించే వారికి విభజన రేఖ చెరిగిపోవడంతో చివరకు శాసనసభ్యుల పెత్తనం సాగుతోంది. వారు చెప్పింది చేయడానికి అధికారులు అలవాటుపడ్డారు.
ఒక శాసనసభ్యుడు రాష్ట్రం మొత్తానికి, ఒక పార్లమెంటు సభ్యుడు దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహించాలి. కాని ప్రస్తుతం ప్రతి సభ్యుడు వారి నియోజక వర్గానికి పరిమితమైపోయారు. ఉద్యోగులు తమ బదిలీ కోసం శాసనసభ్యులకు, మంత్రులకు నిధులు చెల్లించి ఆ తర్వాత దానికి రెట్టింపు ప్రజల నుంచి పిండుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఒక ఉద్యోగిని నియమించాలన్న, బదిలీ చేయాలన్నా తమతో సంప్రదించాలన్నది శాసనసభ్యులు తమ హక్కుగా భావిస్తున్నారు. గ్రామ పంచాయితీలకు అందవలసిన నిధులు డైరెక్టుగా పంచాయితీలకు అందటం లేదు. మధ్యలో నిధుల్లో కోత పడుతోందని కేరళ రాష్ట్ర తరహాలో అవి అందాలని పంచాయితీలు కోరుతున్నాయి. దేశానికి రౖెెతు వెన్నెముకని ఉపన్యాసాలు దంచే నాయకులు కళ్లు తెరిచి చూడాలి. గత 11 సంవత్సరాలలో 72 శాతం ఆత్మహత్యలు పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. రైతులను చైతన్యవంతులను చేయడం కోసం ప్రభుత్వం తరపున ఒక ఛానల్‌ నడపకపోవడం దురదృష్టం. రోజువారి మార్కెట్ల గురించి, తెగుళ్ల గురించి రైతులకు సంబంధించిన అన్ని వివరాలు వారికి అందించడం ప్రభుత్వం బాధ్యతగా భావించాలి. ముఖ్యంగా విద్యుత్‌ రేట్లు తగ్గించకపోవడం ప్రభుత్వం అసమర్థతగా భావించాలి. పరిశ్రమలుపెట్టి వారికి రాయితీలు ఇవ్వడం, వారు ఫెయిలైతే ఆ భారం ప్రజలపైనే పడుతుంది. పార్టీ చేసే తప్పుల్ని విమర్శించే వారిని దూరంపెట్టి నాయకులను నిత్యం పొగడ్తలతో ముంచెత్త్తే వారిని అక్కున చేర్చుకునే పద్ధతి ప్రస్తుతం నడుస్తోంది. ప్రజలను సమీకరించి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి ఒక భావ విప్లవం అవసరం. ఎటువంటి ప్రయోజనాలు కల్పించకపోయినా ఎర్రదండు రోడ్డుపైకి వచ్చే కమ్యూనిస్టులను గమనించాలి. అధికారంలో ఉన్న నాయకులు కులమతాలకు సంబంధించిన సమావేశాలకు దూరంగా ఉండాలి. కాని వాటిని ప్రస్తుత నేతలు ప్రోత్సహించడం గర్హనీయం.
ప్రజల సొమ్ముతో ఎటువంటి ఆదాయం రాని భారీ కట్టడాలు ఆపడం మంచిది. విలాసవంతమైన కట్టడాలపై వందల కోట్లు ఖర్చు చేయడం తగని పని. ప్రస్తుతం నేతలు రెగ్యులర్‌ ఫ్లైట్లు ఉన్నా ప్రత్యేక విమానాల్లో తిరిగి ప్రజల సొమ్ము ఖర్చు చేయడం చూసి పాత తరం నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నేతలు తమ అధికార కార్యాలయాలను సొంత పనులకు వాడుకోవడం పార్టీ కార్యకలాపాలకు వినియోగించడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. ఇది మన ఖర్మ అనుకునే రోజులు గతించాయి. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడం తమ హక్కుగా భావించాలి. రాజకీయ పార్టీలకు, కులమతాలకు అతీతంగా ప్రజలు చేతులు కలిపి తమ సమస్యల పరిష్కారానికి చేసే పోరాటానికి మద్ధతిచ్చే కమ్యూనిస్టులను కలుపుకుని పోరాటానికి సిద్ధం కావాలి. అది తమ బాధ్యతగా, ప్రథమ కర్తవ్యంగా భావించి ముందుకు సాగాలి.
సెల్‌: 9885569394

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు