డాక్టర్ సి.ఎస్ క్షేత్రపాల్‌రెడ్డి
ఉత్తరాంధ్రలో ప్రజా ఉద్యమాలు రగులుతున్నాయి. వెనుకబడ్డ ఉత్తరాంధ్రను అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్న పాలకులు తమ ఉసురు తీసేలా చేస్తున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాలకుల మాటల్లో కనిపించే అభివృద్ధి మంత్రం చేతల్లో తమ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నదని గ్రహించిన ఉత్తరాంధ్ర ప్రజానీకం పాలకుల కుటిల నీతిపై తిరగబడిరది. విప్లవోద్యమ చరిత్ర ఉన్న శ్రీకాకుళంలోని ఉద్దానం ప్రాంత రైతాంగం కార్గో ఎయిర్‌పోర్టు నిర్మాణం పేరుతో తమ పచ్చని భూములను లాగేసుకోవాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించింది. మందస మండలంలో కార్గో ఎయిర్ పోర్టు ప్రతిపాదనకు వ్యతిరేకంగా పోరాట కమిటీగా ఏర్పాటై ఉద్యమ శంఖం పూరించింది. సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న ఉద్దానం ప్రాంతాన్ని శ్మశానవాటిక చేయడానికే కార్గో ఏయిర్ పోర్టు అనేది అక్కడి ప్రజల వాదన. ఈ నిర్ణయం తమ సంక్షేమం కోసం కాదని తమ భూములని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం కోసమే అని స్థానిక ప్రజల్లో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తమౌతున్నది. కార్గో ఎయిర్‌పోర్టు కోసం 1394 ఎకరాలు మాత్రమే సేకరిస్తామని ప్రభుత్వం చెబుతున్నా వారి చర్యలు మాత్రం 6000 ఎకరాల్లో గల జీడి, కొబ్బరి తోటలను ధ్వంసం అయ్యేలా ఉండడంతో అభివృద్ధికి, ఉపాధి కల్పనకు తాము వ్యతిరేకం కానప్పటికీ కార్గో ఎయిర్‌పోర్టుకు వ్యతిరేకంగా స్థానికులు, రైతులు ఏకతాటిపైకి వచ్చి పోరాడుతున్నారు. సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస గ్రామం వద్ద థర్మల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదనతో ఆ ప్రాంతంలో అలజడి నెలకొంది. ఏపీ జెన్కో ప్రతిపాదించిన ఈ ప్లాంట్ 3200 మెగావాట్ల సామర్థ్యంతో రూ. 30,000 కోట్ల వ్యయం కానున్నది. ఒక్కో యూనిట్లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా మొత్తం నాలుగు యూనిట్లను ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. దీని నిర్మాణానికి సుమారు 2,000 ఎకరాల భూమిని సమీకరించాలని ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టీపెట్టగానే ఆ ప్రాంత ప్రజలు తిరుగుబాటు చేశారు. ఈ ప్రతిపాదనతో తమ ప్రాంతంలో పర్యావరణ సమస్యలు తప్పవని, తాగు, సాగునీటి కొరత తప్పదనే భయంతో స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ప్లాంటు ఏర్పాటు అయితే అందుకు ప్రధాన నీటి వనరు హిర మండలం రిజర్వాయర్ నుంచి నీటి సరఫరా జరిగితే వంశధార ప్రాజెక్టు కింద ఉన్న చివరి భూములకు సాగునీరు అందదని స్థానిక రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది తమ పోడు భూములకు ఇబ్బందే అని ఆదివాసులు కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ధర్మల్ ప్లాంట్ వెదజల్లే కార్బన్ ఉద్గారాల వల్ల పర్యావరణానికి ప్రమాదం వాటిల్లుతుందనే ఆందోళనల నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా థర్మల్ పవర్ ప్లాంట్‌కి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు.
విశాఖ నగరానికి తలమానికమైన ప్రభుత్వరంగ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు పావులు కదుపుతూనే ప్రపంచ స్థాయి నగరంగా మార్చే క్రమంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటని ప్రభుత్వం ప్రకటించింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.80 లక్షల మందికి ఉపాధి అని పేర్కొంది. అయితే ఈ నిర్ణయం వెనక ఉన్న అసలు నిజాలు బహిర్గతమయ్యాయి. లక్షల ఉద్యోగాల కల్పన డేటా సెంటర్ల ద్వారా ఉండదనే వాస్తవం వెలుగు చేసింది. ఈ విషయమై కర్నాటక మంత్రి ప్రియాంక్ ఖడ్గే చేసిన వ్యాఖ్యలు వాస్తవాలను బయటపెట్టాయి. కూటమి భాగస్వామి బీజేపీ నేతలు కూడా పెద్ద ఎత్తున ఉపాధి ఉండదని అంగీకరించారు. డేటా సెంటర్ల ఒప్పందాల్లోనూ ఎంత మందికి ఉపాధి లభిస్తుందో స్పష్టం చేయలేదు. వేల కోట్ల ప్రజాధనాన్ని కార్పొరేట్ వర్గాలకు దోచి పెట్టడమనే అజండాకే డేటా సెంటర్ల ఏర్పాటు పేరు పెట్టినట్టు పౌర సమాజంలో చర్చ నడుస్తున్నది. అత్యంత ఖరీదైన 480 ఎకరాల భూములను ఆ డేటా సెంటర్లకి ఇవ్వాలనే నిర్ణయం వెనక భారీ అవినీతి ఉందనే ప్రచారమూ నడుస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ డేటా సెంటర్ల నిర్మాణంపై వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంటే విశాఖ నెత్తిన ఒక గిగాబైట్ సామర్థ్యంతో డేటా సెంటర్ల నిర్మాణం నగరాన్ని ప్రమాదంలోకి నెట్టడమే అవుతుందనేది విజ్ఞుల వాదన.
లూలు వ్యాపార సంస్థకు బీచ్ రోడ్డులోని 14 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పనంగా అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ నగరంలో ఉద్యమాలు సాగుతుండగానే గాజువాక, పెదగంట్యాడ గ్రామాలకు దగ్గరలో అదానీ నిర్మించాలని చూస్తున్న అంబుజా సిమెంట్ గ్రైండిరగ్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా జనం తిరగబడ్దారు. గంగవరం పోర్టును స్వాధీనం చేసుకున్న కార్పొరేట్ దిగ్గజం ఆ భూముల్లో అంబుజా సిమెంటు నిర్మాణం అనే కుట్రకు తెరలేపారు. ఐదు లక్షల మంది నివాసమున్న ప్రాంతంలో 20 ఎకరాల స్థలంలో ఏడాదికి 4 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఈ సిమెంటు ప్యాక్టరీ నిర్మించడానికి పావులు కదిపారు. ధనబలం, అధికార బలంతో ప్రజాభిప్రాయ సేకరణ వరకూ తేవడం స్థానికుల్లో అగ్రహ జ్వాలలకు కారణం అయింది. సల్పర్డైయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి ప్రమాదకర రసాయనాలు అత్యంత ప్రమాదకరమైన అణుధార్మిక శక్తితో కూడిన యురేనియం, థోరియం ఐసోటోపుల ప్రభావంతో కేన్సర్, హృదయ, శ్వాసకోశ సంబంధిత తీవ్రమైన రోగాల రూపంలో ప్రాణాలు తీసే ఫ్యాక్టరీ వద్దంటూ ప్రజాభిప్రాయ సేకరణ ప్రాంగణంలోకి దూసుకు వచ్చిన వేలాది మంది స్థానికులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెంట్లను ద్వంసం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల మత్స్యకార గ్రామం రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానికులు చేపట్టిన ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. నెల రోజులకు పైగా శాంతియుత రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. తొలుత ఇందుకోసం టెంట్ ఏర్పాటును కూడా నిరాకరించిన పోలీసులు తిరగబడ్డ జనం ఒక్కసారిగా జాతీయ రహదారి ముట్టడి ఉద్యమ ఉధృతితో దిగివచ్చారు. నిత్యం వేల మంది పోలీసుల పహారాలో ఆ నిరసనలు కొనసాగుతున్నాయి. ఆ గ్రామానికి వెళ్లే అన్ని రోడ్లను మూసివేయడం ద్వారా ఆ ఉద్యమాన్ని అణచి వేయాలని చూసినా ఫలితం దక్కలేదు. ఎన్ని కుట్రలు చేసినా తమ ఉద్యమాన్ని ఆపలేరని స్థానిక మత్స్యకారులు ప్రభుత్వానికి అల్టీమేటం ఇచ్చారు. స్థానికంగా ఉన్న హెటిరో కంపెనీ వెదజల్లే కాలుష్యంతో అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని, మత్స్యకారుల ఉపాధి, మనుగడను దెబ్బతీసే బల్క్ డ్రగ్ పార్కును ఆపేయాలని భీష్మించుకు కూర్చున్నారు. ఉపాధి, అభివృద్ధి ముసుగు తొడిగి సముద్రతీరాన్ని డంపింగ్ యార్డ్‌గా మార్చి మత్స్యకారుల జీవితాలను నాశనం చేయడాన్ని సహించబోమని, బల్క్ డ్రగ్ పార్క్ నిలిపివేసేదాకా ఉద్యమం ఆగదని జిల్లా కలెక్టర్ సమక్షంలోనే తేల్చేశారు. అల్లూరి జిల్లాలో హైడ్రో ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమం పాలకులపైకి ఎగిసి పడుతున్నది. హైడ్రోకు వ్యతిరేకంగా వేల మంది అడవి బిడ్డలు పాడేరులో చేపట్టిన అరణ్య గర్జన ర్యాలీ ప్రభుత్వ పెద్దలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. వివిధ కార్పొరేట్ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న అక్రమ హైడ్రో ఒప్పందాల జీఓ 51, 13, 02 ను వెంటనే రద్దు చేయాలనే ఏకైక నినాదంతో గిరిజనం ఏకమయ్యారు. అనంతగిరి మండలంలోని గుజ్జిలి, పెదకోట, చిట్టంవల్లలో, జీకేవీధి మండలం సీలేరు, ఎర్రవరంలో 7400 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి నవయుగ, మెగా, శిరిడి సాయి వంటి కార్పొరేట్ సంస్థలకు 20 వేల ఎకరాల అటవీ భూములు కేటాయించడమే ఈ ఉద్యమానికి కారణం. ఈ ప్రాజెక్టులతో 20 వేల ఎకరాల అటవీ భూమి ధ్వంసం అవడంతో పాటు అక్కడున్న 50 వేల మంది గిరిజనులు, 250 గ్రామాలు మునిగిపోయే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ప్రాణాలు ఫణంగా పెట్టయినా తమ కాళ్ల కింద నేలను వదులుకోబోమని గిరిజనులు తేల్చిచెప్పారు.
9059837847


