Home2029 నాటికిసొంతింటి కల సాకారం

2029 నాటికిసొంతింటి కల సాకారం

- Advertisement -

. మూడు లక్షల మంది గృహప్రవేశాలు
. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే ప్రభుత్వ లక్ష్యం
. ఆకాశమే హద్దుగా రాష్ట్రాభివృద్ధి
. చంద్రబాబు నాయుడు

విశాలాంధ్ర – రాయచోటి రూరల్‌: సంక్షేమం, అభివృద్ధి, సుపరి పాలనే లక్ష్యంగా పనిచేస్తున్నామని, రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపి… ప్రతి కుటుంబంలో ఒకరిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని చిన్నమండెం మండలం దేవగుడి పల్లిలో బుధవారం ప్రజావేదిక కార్యక్రమంలో చంద్రబాబు మాట్లా డారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పూర్తయిన మూడు లక్షల పేదల ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. జిల్లా ఇంచార్జి మంత్రి జనార్దన్‌రెడ్డి, రవాణా, క్రీడల మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి, గృహనిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్‌ జైన్‌, జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌, జిల్లా ఎస్పీ ధీరజ్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ రాజేంద్రన్‌, సబ్‌ కలెక్టర్‌ భావన, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరువ శ్రీధర్‌ పాల్గొన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ గృహప్ర వేశం చేస్తున్న ప్రతి కుటుంబానికి అభినందనలు తెలిపారు. 2029 నాటికి ప్రతి పేదవాడి సొంతింటి కల నిజం చేస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. డ్వాక్రా మహిళలను పారిశ్రా మికవేత్తలుగా అభివృద్ధి చేస్తామన్నారు. పేదలకు పక్కా గృహాలు నిర్మాణ కార్యక్రమం ఎన్టీఆర్‌ ప్రారంభించారని గుర్తు చేశారు. 16 నెలల్లోనే మూడు లక్షల ఇళ్లు పూర్తి చేశామంటే…అది తమ ప్రభుత్వ నిబద్ధత, పట్టుదలే కారణమన్నారు. వచ్చే ఉగాది లోపు వివిధ దశల్లో ఉన్న పేదల ఇళ్లు పూర్తి చేస్తామన్నారు. గతంలో పట్టణాలలో నిర్మించిన ఇళ్లను పూర్తిగా అస్తవ్యస్తం చేశారని, వాటన్నింటినీ గాడిన పెడుతున్నామన్నారు. ఇంటి స్థలం లేని పేదలు ఉంటే వారికి ఈ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు మంజూరు చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన ఇసుక అక్రమాలను ప్రక్షాళన చేస్తున్నామ న్నారు. ఇల్లు మంజూరుకు ఎస్సీ, బీసీలకు రూ.50 వేలు, ఎస్‌టీలకు రూ.75 వేలు, ప్రిమిటివ్‌ గిరిజనులకు లక్ష అదనంగా నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఇల్లు నిర్మించుకోవడానికి ముస్లింలకు కూడా అదనంగా రూ.50 వేలు అందిస్తామని తెలిపారు. రాబోవు ఉగాదికి మరో ఐదు లక్షల ఇళ్లు పూర్తి చేస్తామన్నారు. పేదలకు ఉచిత కరెంటు, బీసీలకు సబ్సిడీ ద్వారా అందజేస్తామన్నారు. గ్రీన్‌ ఎనర్జీకి ప్రాధాన్యత ఇచ్చి సోలార్‌ పవర్‌లో సంస్కరణ తీసుకొచ్చామన్నారు. రైతులు పంటలతో పాటు తమ పొలాల్లో కరెంటును కూడా ఉత్పత్తి చేస్తున్నారన్నారు. వినియోగదారులను సోలార్‌ పవర్‌ ఉత్పత్తిదారులుగా మార్చామన్నారు. త్వరలో రాయచోటి నియోజకవర్గంలోని 68 గ్రామ పంచాయతీలకు ఆరు మండలాలతోతో పాటు పీలేరు తంబళ్లపల్లెలో ఇంటింటికీ కుళాయినీరు అందిస్తామన్నారు. సూపర్‌ సిక్స్‌ సూపర్‌ హిట్‌ అయిందని, ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగ కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని, త్వరలో జరగనున్న విశాఖ ఇన్వెస్టుమెంట్‌ మీట్‌లో మరో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తెచ్చి… ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇక్కడ చదువుకున్న పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు రావాలన్న ఉద్దేశంతో పారిశ్రామికవాడలుగా గ్రామాలను, మండలాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. వెలుగల్లు ప్రాజెక్టు ద్వారా చెరువులకు నీరు అందిస్తామని తెలిపారు. శ్రీనివాసపురం రిజర్వాయర్‌ పూర్తిచేసి రాయిచోటి నియోజకవర్గంలో భూగర్భ జలాలు పెంచుతామన్నారు. నదుల సంధానం తన జీవిత ఆశయమని, శాశ్వత ప్రాతిపదికన తాగునీటి సమస్యకు పరిష్కార మార్గం చూపుతామన్నారు. ఇప్పటికే గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేశానని, పెన్నా, వంశధారను అనుసంధానం చేయాల్సి ఉందని తెలిపారు. రాయలసీమలో భూగర్భ జలాలను మూడు మీటర్లకు పెంచాలన్నారు. రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా మార్చి… మరింత అభివృద్ధి చేస్తామన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర విజన్‌ సాకారం చేసే దిశగా కృషి చేస్తామన్నారు. రాష్ట్ర గృహ, సమాచార శాఖ మంత్రి పార్ధసారథి మాట్లాడుతూ చంద్రబాబు అభివృద్ధి ప్రధాత అని ప్రశంసించారు. ఇది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని నిరూపించామన్నారు. కేవలం16 నెలల్లో 3 లక్షల పేదల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. అర్హత గల ప్రతి ఒక్కరికీ ఇల్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం 16 నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. జల్‌ జీవన్‌ పథకంలో భాగంగా రాయచోటి నియోజకవర్గంలో రూ.300 కోట్లతో ఆరు మండలాలకు త్వరలో తాగునీరు అందిస్తామన్నారు. రాయచోటి నియోజకవర్గంలో తాగునీటి సమస్యను త్వరలో పూర్తిగా పరిష్కరిస్తామన్నారు. అధికారులు, మార్గదర్శులు, బంగారు కుటుంబాలు, ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు