నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి సిఐటియు
విశాలాంధ్ర – కొవ్వూరు : నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేసేవరకు పోరాటం ఆగదు-సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏం.సుందర్ బాబు అన్నారు. బ్రిటీష్ పాలనలోనే కార్మిక హక్కుల కోసం, చట్టాలు కోసం పోరాడి సాధించుకున్న అన్ని హక్కులను నేడు మోదీ ప్రభుత్వం కార్మిక హక్కులను హరించే విధంగా 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్ తీసుకు వచ్చి కార్మికులకు ద్రోహం చేస్తుందని అవి రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం కొవ్వూరులో కోరమండల్ కాంక్రీట్ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద నాలుగు లేబర్ కోడ్ లు అమలు ఉత్తర్వులను కోరమండల్ కాంక్రీట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ గేటు వద్ద కార్మికులందరూ సామూహికంగా లేబర్ కోడ్ ల ఉత్తరువుల కాపీలను దగ్ధం చేశారు ఈ సందర్భంగా జరిగిన సభకు యూనియన్ కార్యదర్శి బీరా రవి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం.సుందర బాబు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత, 29 కార్మిక చట్టాలను రద్దుచేసి, 4 ‘కార్మిక కోడ్స్’ను అమల్లోకి తీసుకు వచ్చారని. కార్మిక వర్గాన్ని బ్రిటీష్ కాలం నాటి దుర్భర పరిస్థితికి నెట్టేస్తున్నారని ఇప్పుడేమో నాలుగు కార్మిక కోడ్ల కొనసాగింపుగా “శ్రమ్ శక్తి ఎన్ఐటీఐ 2026” పేరుతో నూతన జాతీయ కార్మిక విధానాన్ని ముందుకు తీసుకొస్తున్నారని, దీనిని ఖచ్చితంగా కార్మిక లోకం వ్యతిరేకించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోరాడ రామకృష్ణ బట్టు సాంసంగ్ టి రాంబాబు పి పాపారావు తదితరులు పాల్గొన్నారు.


