బేటీ బచావో బేటీ పడావో… బాల్ వివాహ్ ముక్త్ భారత్.
విశాలాంధ్ర – కడియం : బేటీ బచావో బేటీ పడావో, బాల్ వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కడియం ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం నందు శనివారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ, రక్షణ అధికారి జి క్రాంతిలాల్ మాట్లాడుతూ విద్యార్థులు అందరూ బాగా చదువుకుని తల్లితండ్రులు, గురువులు చెప్పిన మాట వింటూ అభివృద్ధి చెందాలని తెలిపారు. అలాగే మంచి స్పర్శ, చెడు స్పర్శ గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. అలాగే బాలలపై లైంగిక వేధింపుల వ్యతిరేక చట్టం -2012 , బాల్యవివాహ నిషేధ చట్టం-2006 గురించి వివరించారు. ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నట్టు తెలిస్తే వెంటనే సంబంధిత బాల్యవివాహ నిషేధ అధికారులకు లేదా చైల్డ్ హెల్ప్ లైన్ -1098, పోలీస్-100 , 112 అనే నెంబర్లకు కు ఫోన్ చేసి సమాచారం అందించాలని, అలాగే వ్యక్తిగత భద్రత, సంరక్షణ తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు. అలాగే వస్త్రాధారణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఐసిడిఎస్ సూపర్ వైజర్ శిరీష, పావని, సరస్వతి, హాస్టల్ వార్డెన్ లక్ష్మి పాల్గొన్నారు.


