ఖమ్మంలో సీపీఐ ముగింపు ఉత్సవాలు
. ట్రంప్‌కు భయపడుతున్న మోదీ
. చర్చల ద్వారా జల వివాద పరిష్కారం
. సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ
విశాలాంధ్ర బ్యూరోఖమ్మం: సీపీఐ పోరాటాల చరిత్రకు వందేళ్లు నిండాయని, ఆవిర్భావం నుంచి నిర్బంధాలు ఎదుర్కొంటూ ప్రజల పక్షాన నిలిచిన ఏకైక పార్టీ సీపీఐ మాత్రమేనని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. భూమి కోసం, భుక్తి కోసం అలుపెరగని పోరాటం చేసిందని గుర్తుచేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో 4,500 మంది రక్తతర్పణం చేశారని ఆయన తెలిపారు. పోరాటాల పురిటిగడ్డ ఖమ్మంలో సీపీఐ శత వసంతాల ముగింపు వేడుకలు నాలుగు రోజుల పాటు జరగనున్నాయని, జనవరి 18న గొప్ప బహిరంగ సభ, 19న సీపీఐ జాతీయ కార్యవర్గం, 20న జాతీయస్థాయి సెమినార్ నిర్వహిస్తున్నట్లు రామకృష్ణ తెలిపారు. ఖమ్మం సీపీఐ కార్యాలయం గిరిప్రసాద్ భవనంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ భారతదేశ ప్రస్తుత పరిస్థితులు వామపక్ష ఉద్యమం ఎదుర్కొంటున్న సవాళ్లు అనే అంశంపై జనవరి 20న జరిగే సెమినార్లో వామపక్షపార్టీల ప్రధాన కార్యదర్శులు ఎంఏ బేబీ, దీపాంకర్ భట్టాచార్య, మనోజ్ భట్టాచార్య సహా కీలక నేతలు పాల్గొంటారన్నారు. ట్రంప్ బెదిరింపులకు మోదీ భయపడుతున్నారని, ఆయన ఏమి చెప్పినా తల ఊపడం తప్ప సమాధానం చెప్పలేని స్థితిలో మోదీ ఉండడం దురదృష్టకరమన్నారు. దీంతో భారతదేశ విలువలు ప్రపంచవ్యాప్తంగా మంటగలుస్తున్నాయని రామకృష్ణ విమర్శించారు. అలీన దేశంగా కీర్తిగడిరచిన భారత్…మోదీ నాయకత్వంలో ట్రంప్‌కు తలవంచే పరిస్థితి వచ్చిందన్నారు. వెనిజులా అధ్యక్షుడు మదురో, ఆయన భార్యను బంధిస్తే కనీసం నోరు విప్పలేని స్థితిలో మోదీ ఉన్నారని, ట్రంప్ వల్ల భవిష్యత్తులో భారతదేశం సైతం ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని రామకృష్ణ హెచ్చరించారు. చర్చల ద్వారా జల వివాదాలు పరిష్కరించుకోవచ్చని, రెండు ప్రభుత్వాలు చర్చించుకుంటే సమస్య పరిష్కారమవుతుందని ఆయన తెలిపారు. వివాదాలకు పోవడం వల్ల రెండు రాష్ట్రాలు నష్టపోతాయని, ఇప్పటికే సముద్రంలో రెండువేల టీఎంసీల నీరు కలుస్తున్నద న్నారు. నీటి విషయంలో భేషజాలకు పోకుండా పరస్పర ప్రయోజనాలే లక్ష్యంగా రెండు ప్రభుత్వాలు మాట్లాడుకోవాలని రామకృష్ణ సూచించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నదన్నారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెబుతున్న చంద్రబాబు… నిర్వాసి తులకు పరిహారం ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. 72 శాతం ప్రాజెక్టు పూర్తయిందని ప్రభుత్వ లెక్కలే చెబుతు న్నాయని, కానీ పరిహారం చెల్లింపు మాత్రం 21 శాతం మాత్రమే జరిగిందని, ఇలా ఎందుకు జరుగుతోందని రామకృష్ణ ప్రశ్నించారు. పోలవరం నిర్వాసితుల పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సీపీఐ అధ్వర్యం లో ఆందోళన చేపడతామన్నారు. పోలవరం ముంపు మండలాల్లో పర్యటించి త్వరలో పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన స్పష్టంచేశారు.
కార్పొరేట్ల కోసమే కగార్
ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ తీసుకొచ్చిందని రామకృష్ణ ఆరోపించారు. ఎన్కౌంటర్ల పేరుతో మావోయిస్టులను కాల్చి చంపుతున్నారని, అందులో భాగంగానే మావోయిస్టు కీలకనేత హిద్మాను ఆంధ్రప్రదేశ్‌లో కాల్చి చంపారని ఆయన తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మావోయిస్టుల కారణంగా రక్షంచబడిన అటవీ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతూ… ప్రశ్నించే వారిని అర్బన్ నక్సలైట్ల పేరుతో నిర్బంధాలకు గురిచేస్తు న్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ నిర్బంధాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీక రించి పోరాడాల్సిన బాధ్యత వామపక్షాలతో పాటు ప్రజాతంత్రశక్తులపై ఉందని రామకృష్ణ తెలిపారు. సమావేశంలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంత రావు, జిల్లా కార్యదర్శి దండి సురేష్, సహాయ కార్యదర్శి జమ్ముల జితేందరరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్కే జానిమియా, బీజీ క్లెమెంట్, పోటు కళావతి, రామాంజనేయులు, మేకల శ్రీనివాసరావు, తాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


