న్యూదిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో 2016`2020 మధ్య కాలంలో ప్రభుత్వ ఉద్యోగులపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల అవినీతి కేసుల్లో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన 13 ఎఫ్ఐఆర్లు రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఏపీ విభజన తర్వాత విజయవాడలోని ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్‌ను ప్రత్యేక పోలీస్‌స్టేషన్‌గా అధికారికంగా నోటిఫై చేయలేదన్న సాంకేతిక కారణంతో హైకోర్టు ఆ ఎఫ్ఐఆర్లు కొట్టివేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన కేసులో హైకోర్టు ఆదేశాన్ని సుప్రీంకోర్టు రద్దు చేస్తూ… అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఇందుకుగాను ఆరు మాసాల గడువు విధించింది. ప్రతివాదుల్ని అరెస్ట్ చేయకూడదని, అయితే వారు దర్యాప్తులో పూర్తిగా సహకరించాల్సి ఉంటుందని చెప్పింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ్ అగర్వాల్ వాదనలు వినిపించారు. ఇలాంటి సాంకేతిక కారణాలతో దేశవ్యాప్తంగా అనేక అవినీతి కేసులు హైకోర్టుల్లో పెండిరగ్లో ఉన్న నేపథ్యంలో ఈ తీర్పు మైలురాయిగా నిలుస్తుంది. ఎఫ్ఐఆర్లు రద్దుచేయడం సరైనది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీనియర్ పోలీసు అధికారులుగా నోటిఫై అయిన ఐదుగురు అధికారుల అధ్వర్యంలో దర్యాప్తు జరగాలని పేర్కొంది. అయితే, సుప్రీంకోర్టు తీర్పులో రాష్ట్ర విభజన తర్వాత కూడా పాత చట్టాలు తప్పకుండా అమలులోనే ఉన్నట్లు స్పష్టంగా పేర్కొంది. పాత చట్టాలు మార్చకుంటే… అవి ఇప్పటికీ అమలులోనే ఉంటాయని, అవినీతి నిరోధక చట్టం కూడా వర్తించాల్సిన చట్టంగా ఉన్నదని తీర్పులో పేర్కొంది. అవినీతి నిరోధక చట్టం కింద పలువురు వ్యక్తులపై ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ద్వారా ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయని, ఈ కేసులను సముచిత దర్యాప్తు ద్వారా సామరస్యంగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.


