. కేసు బలహీనపరిచిన టీటీడీ, పోలీస్ అధికారులు
. రవికుమార్ ఆస్తుల స్వీకరణలోనూ నిబంధనల ఉల్లంఘన
. పరకామణి చోరీ కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: పరకామణి చోరీ ఘటనకు బాధ్యులైన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ, పోలీసు సంబంధిత శాఖల ఉన్నతాధికారులను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. పరకామణిలో వెంటనే చేపట్టాల్సిన సంస్కరణలపై హైకోర్టుకు టీటీడీ ఈ నెల 5వ తేదీన నివేదిక అందజేసింది. నివేదికను పరిశీలించిన హైకోర్టు గురువారం స్పందించింది. కీలక నిందితుడు రవికుమార్‌తో కుమ్మక్కై తిరుమల తిరుపతి దేవస్థానం, పోలీసు అధికారులు కేసును బలహీనపర్చారని హైకోర్టు వ్యాఖ్యానించింది. సీఐడీ, ఏసీబీ నివేదికల్లో నిందితుడు రవికుమార్, కుటుంబ సభ్యులు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు స్పష్టమవుతోందని న్యాయస్థానం తెలిపింది. రవికుమార్ ప్రభుత్వ ఉద్యోగి పరిధిలోకి వస్తారని స్పష్టం చేసింది. రవికుమార్ ఆస్తులు స్వీకరించే సమయంలోనూ టీటీడీ అధికారులు, బోర్డు సభ్యులు, పోలీసులు, సెక్యూరిటీ అధికారులు చట్టనిబంధనలు అనుసరించలేదని తెలిపింది. పరకామణి ఘటనలో సీఐడీ, ఏసీబీ డీజీలు నిబంధనల మేరకు నడుచుకునేందుకు న్యాయస్థానం వెసులుబాటు కల్పించింది.
ఏవీఎస్వీ సతీశ్ కుమార్ మరణంపై దర్యాప్తును వేగవంతం చేయాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. కేసు తీవ్రత దృష్ట్యా చార్జిషీట్ దాఖలు చేసేవరకు దర్యాప్తును పర్యవేక్ష్షిస్తామని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకొని చట్టప్రకారం ముందుకెళ్లాలని సీఐడీ, ఏసీబీకి ఉత్తర్వులిచ్చింది. పరకామణిలో తక్షణ సంస్కరణలపై టీటీడీ సమర్పించిన నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం… కానుకల లెక్కింపు విధానాన్ని ఆధునికీకరించేందుకు మెరుగైన ఆలోచనతో ముందుకురావాలని టీటీడీ ఈవోను ఆదేశించింది.


