Homeముంబై మేయర్‌ పీఠంపై మల్లగుల్లాలు!

ముంబై మేయర్‌ పీఠంపై మల్లగుల్లాలు!

- Advertisement -

ముంబై: ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి విజయం సాధించింది. అయితే, ఇప్పుడు ముంబై మేయర్‌ పీఠంపై బీజేపీ, శివసేన(ఏక్‌నాథ్‌) పోటీ పడుతున్నాయి. పాతికేళ్లపాటు కొనసాగిన ఠాక్రే ఆధిపత్యానికి ముగింపు పలుకుతూ ముంబై మున్సిపల్‌ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. వాస్తవానికి గత ఎన్నికల్లోనే ముంబై మేయర్‌ పదవిని బీజేపీ తృటిలో చేజార్చుకుంది. ఆ సమయంలో 82 స్థానాలు నెగ్గినప్పటికీ మిత్రపక్షంగా ఉన్న శివసేన కంటే కేవలం రెండే సీట్లు వెనకబడిరది. ఈసారి మహాయుతికి స్పష్టమైన బలం ఉండడంతో ముంబై మేయర్‌ పీఠం బీజేపీదే అనుకుంటున్న సమయంలో హైడ్రామా మొదలైంది. బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే మేయర్‌ పదవిపై బీజేపీ, ఏకనాథ్‌ షిండే శివసేన మధ్య అంతర్గత చర్చలు ప్రారంభమయ్యాయి. మొత్తం 227 స్థానాలున్న బీఎంసీలో మ్యాజిక్‌ ఫిగర్‌ 114. బీజేపీ 89 వార్డుల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. షిండే శివసేన కేవలం 29 స్థానాలు సాధించింది. అజిత్‌ పవార్‌ ఎన్సీపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ లెక్క ప్రకారం బీజేపీకి మేయర్‌ పదవి దక్కాలంటే షిండే వర్గం మద్దతు తప్పనిసరి. దీంతో… షిండే వర్గానికి కింగ్‌మేకర్‌ స్థానం దక్కినట్లయింది. షిండే వర్గంలోని కీలక నేతలు ఇప్పటికే ‘ముంబై మేయర్‌ శివసేన వర్గానిదే కావాలి. ఇది బాలాసాహెబ్‌ ఠాక్రే వారసత్వం’ అని ప్రకటనలు చేసుకుంటూ వస్తోంది. అయితే షిండే మాత్రం ‘మహాయుతి కూటమిగా పోరాడాం. ముంబై అభివృద్ధి కోసం కలిసి నిర్ణయం తీసుకుంటాం’ అని సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. మరోవైపు, 131 స్థానాలున్న థానేలో సీన్‌ రివర్స్‌గా ఉంది. అక్కడ షిండే శివసేన ఏకంగా 75 సీట్లు సాధించింది. బీజేపీ 28 స్థానాలు దక్కించుకుంది. దీంతో మిత్రపక్షం మద్దతు అవసరం లేకుండానే షిండే సేన మేయర్‌ పదవి దక్కించుకోబోతోంది. ముంబై విషయంలో అలా కాదు. మేయర్‌ పదవిని రెండు భాగాలుగా పంచుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంటే, చెరి రెండున్నర సంవత్సరాలు అధికారం పంచుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. మేయర్‌ పదవిపై తుది నిర్ణయం తీసుకునే ముందు డిప్యూటీ మేయర్‌, స్టాండిరగ్‌ కమిటీ చైర్మన్‌ పదవులు, కీలక వార్డులపై గట్టి చర్చలు జరుగుతున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు