విశాలాంధ్ర ధర్మవరం; సాగు నీటి దృష్ట్యా ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో నీటి విడుదలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. పీఏబీఆర్ కుడికాలువ ద్వారా ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, కనగానపల్లి, కూడేరు మండలాల్లోని మొత్తం 42 చెరువులకు నీరు అందించాల్సిన అవసరం ఉందని, అందులో భాగంగా చివరి చెరువుకు ముందుగా నీరు చేరేలా, మొదటి చెరువులకు అనంతరం విడుదల చేయాలన్న స్పష్టమైన సూచనలు చేశారు. పీఏబీఆర్ వద్ద నుంచి సుమారు 114 కిలోమీటర్ల మేర నీరు ప్రవహిస్తే తప్ప చివరి చెరువుకు చేరదన్న వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని, నీటి విడుదలను జాగ్రత్తగా, ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలన్నారు. కాలువకు ఎక్కడా గండ్లు వేయకుండా హెచ్చరికలు జారీ చేయాలని, అలాగే నీటి చౌర్యం జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. పీఏబీఆర్ కుడికాలువ వెంట పోలీసుల ద్వారా గస్తీ నిర్వహించడంతో పాటు, కాలువ నిర్వహణను పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. అదేవిధంగా ధర్మవరం రూరల్, బత్తలపల్లి, తాడిమర్రి మండలాల్లోని చెరువులను ముందుగానే నింపడం ప్రథమ ధ్యేయంగా పని చేయాలని అధికారులకు సూచించారు. ఈ అంశాలపై అనంతపురం జిల్లా కలెక్టర్, అనంతపురం జిల్లా ఎస్పీ, ఎస్ఈ హెచ్చెల్సీ, సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి విస్తృతంగా చర్చించారు. నీటి వనరుల అందుబాటు, పంపిణీ విధానం, కాలువ నిర్వహణ, భద్రత వంటి అంశాలపై సమగ్రంగా సమీక్షించి తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు నీటిపారుదల అధికారులు పీఏబీఆర్ కుడికాలువ వెంట పరిశీలనలు చేపట్టి పీఏబీఆర్ డ్యాం వరకు క్షేత్రస్థాయిలో పర్యటన నిర్వహించారు. ఈ పరిశీలనలో ఎస్ఈ హెచ్చెల్సీ సుధాకర్, ఈఈ వెంకటేశ్వర్లు, డీఈ రాధాకృష్ణ, ఏ.ఈ శివ శంకర్, మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు, నీటిపారుదల శాఖ అధికారులు, బత్తలపల్లి మండల అధ్యక్షులు భాస్కర్, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు పోతుకుంట రాజు, డీ.చెర్లోపల్లి నారాయణస్వామి, వెంకటేష్ చౌదరి, వెంకటేశ్వర్లు రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి ఆదేశాల మేరకు కదిలిన నీటిపారుదల అధికారులు
- Advertisement -
RELATED ARTICLES


