Homeవిశ్లేషణపీపీపీతో వైద్యవిద్య, ప్రజారోగ్యం ప్రమాదకరం

పీపీపీతో వైద్యవిద్య, ప్రజారోగ్యం ప్రమాదకరం

- Advertisement -

బందెల నాసర్ జీ

ప్రభుత్వ వైద్య కళాశాలలను పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంతో ప్రైవేట్‌కు ధారాదత్తం చేసే చంద్రబాబు ప్రభుత్వం విధానాలు విద్యతో పాటు ప్రజారోగ్య హక్కుకు ముప్పే. 2025 సెప్టెంబర్ 4వ తేదీన సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో గత వైసీపీ ప్రభుత్వంలో కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి నూతనంగా కేటాయించిన 17 ప్రభుత్వ వైద్యకళాశాలలో 10వైద్య కళాశాలలను (ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుకొండ, అమలాపురం, పాలకొల్లు, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం) పీపీపీ పేరిట 33 సంవత్సరాలపాటు ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించడం రాజ్యాంగ విరుద్ధం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాబార్డ్ నిధులతో రూ.8,400తో 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టినప్పటికీ…2023 సంవత్సరం నాటికి విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాలలోనే కళాశాలలు ప్రారంభమయ్యాయి. ఈ కళాశాలలో బీ-కేటగిరి సీట్లను రూ.12 లక్షలకు, సీ`కేటగిరి సీట్లను రూ.20లక్షలకు జీవో నంబర్ల 107, 108 ద్వారా వైసీపీ ప్రభుత్వం విక్రయించింది. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులతో పాటు ప్రతిభ గల విద్యార్థులకు ఎంబీబీఎస్ వైద్యవిద్య దూరమైంది. అదే సమయంలో ప్రస్తుత సీఎం చంద్రబాబు తనయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్…నాడు నిర్వహించిన యువగళం పాదయాత్రలో భాగంగా మంగళగిరిలో వేలాది మంది విద్యార్థుల సమక్షంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లోగా జీవోలు 107, 108 రద్దు చేసి 100 శాతం ఎంబీబీఎస్ సీట్లను విద్యార్థులకు ప్రభుత్వ కోటాలోనే కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవోలను రద్దు చేయకపోవడంతో పాటు 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను పూర్తిగా ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులు వేస్తూ, దాదాపు 765ఎకరాల ప్రభుత్వ భూమిని ఎకరా రూ.100కు 33 సంవత్సరాల పాటు లీజుకు ఇస్తుంది.దీనివలన పేదవర్గాల విద్యార్థులకు ఒక్క వైద్య విద్యే కాకుండా సామాన్య పేదలకు ప్రభుత్వ వైద్యమూ దూరమవుతుంది. ఇది కేవలం పరిపాలనా మార్పే కాదు. ప్రజా వైద్యరంగ దిశ, ప్రజల ఆరోగ్య హక్కు, విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే కీలక అంశం.
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రాధాన్యత
స్వాతంత్య్రం తర్వాత దేశం ప్రజారోగ్యాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించింది. పేద, మధ్యతరగతి విద్యార్థులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యవిద్య అందించడం, గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలను విస్తరించడం, సేవాభావంతో వైద్యులను తయారుచేయడం ప్రధాన లక్ష్యం. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులు ప్రతిభ ఆధారంగా ఎంపికవుతారు, ఫీజులు తక్కువగా ఉంటాయి. అదే సమయంలో ఈ కళాశాలలు ప్రజాఆసుపత్రులతో అనుబంధంగా పనిచేసి పేదలకు ఉచిత వైద్యం అందిస్తాయి. ఈ విధంగా విద్య, సేవ రెండూ సమాజానికి ప్రయోజనం కలిగించేలా సమన్వయమవుతాయి. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రధాన ఉద్దేశం ఒక్కసారి పరిశీలిస్తే… ప్రతిభావంతులైన, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు వైద్య విద్యావకాశాలు కల్పించడం. తక్కువ ఫీజుతో మెరుగైన విద్య, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ప్రభుత్వ ఆసుపత్రుల అనుబంధం ఇవన్నీ విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది. ఈ కళాశాలల్లో చదివే విద్యార్థులు సామాజిక సేవాభావంతో, ప్రజారోగ్య దృక్పథంతో వైద్యరంగంలోకి అడుగుపెడతారు. ప్రైవేటీకరణ ఆ వ్యవస్థనే మూలం నుంచి కదిలించే ప్రమాదముంది.
పీపీపీ అంటే ఏమిటి ? దానితో వచ్చే ప్రమాదాలు
పబ్లిక్, ప్రైవేట్, పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) అంటే ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థ కలిసి ఒక ప్రాజెక్టును నడపడం. ఇందులో ప్రభుత్వం భూమి, మౌలిక వసతులు, అనుమతులకు సహకరిస్తుంది. ప్రైవేట్ సంస్థలు నిర్వహణ, ఆర్థిక పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం అందిస్తాయి. ఈ విధానం ఆరోగ్యం, విద్యారంగాల్లో ప్రమాదకరం. ప్రైవేట్ సంస్థల ప్రధాన ఉద్దేశ్యం లాభం. ప్రభుత్వ ఉద్దేశ్యం ప్రజాసేవ. ఈ రెండు భిన్న ధోరణులు ఒకే వేదికపై సరిగా కలవవు. ప్రైవేట్ భాగస్వాములు కళాశాలల నిర్వహణలో భాగం ఐతే ఫలితంగా ఫీజులు భారీగా పెరిగే ప్రమాదముంది. దాంతో పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులు వైద్య విద్యను అందిపుచ్చుకోలేవు. ప్రస్తుత వ్యవస్థలో వైద్య విద్య సీట్లను నీట్ వంటి జాతీయస్థాయి పోటీ పరీక్ష ద్వారా, రిజర్వేషన్లు, ప్రతిభ ఆధారంగా కేటాయించబడతాయి. ప్రైవేటీకరణ తర్వాత నిర్వహణ అధికారాలు ప్రైవేట్ సంస్థలకు వెళ్తే, సీట్ల కేటాయింపులో పారదర్శకత తగ్గే ప్రమాదముంది. డబ్బు ఉన్న వారికి సీట్లు దొరుకుతాయి కానీ ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు వెనుకబడిపోతారు. ఇది పేద, మధ్యతరగతి విద్యార్థులను వైద్య విద్య నుంచి దూరం చేసే నిర్ణయమే. ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలల్లో రిజర్వేషన్ విధానం ద్వారా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు అవకాశం ఉంది. ప్రైవేటీకరణతో ఈ సమానత్వం తగ్గిపోతుంది.
పరిశోధన అవకాశాల క్షీణత..బోధనా నాణ్యతపై ప్రభావం
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సాధారణంగా పరిశోధన కార్యక్రమాలకు ప్రభుత్వ నిధులు, ప్రయోగశాల వసతులు అందుబాటులో ఉంటాయి. ప్రైవేట్ భాగస్వాములైతే, లాభం రాని పరిశోధనలపై ఖర్చు పెట్టడానికి ఆసక్తి చూపరు. దీంతో విద్యార్థులు వైద్య పరిశోధనల పట్ల ఆసక్తి కోల్పోతారు. ప్రైవేటీకరణ తర్వాత అధ్యాపకుల నియామకం, వేతనాలు, సిబ్బంది నియమాలు అన్నీ ప్రైవేట్ నిర్వాహకుల చేతుల్లోకి వెళ్తాయి. వారు ఖర్చు తగ్గించేందుకు తక్కువ అనుభవం ఉన్న, తాత్కాలిక లెక్చరర్లను నియమిస్తారు. దీని వల్ల విద్యార్థులు సరైన శిక్షణ ఉండదు, ప్రయోగాల అనుభవం లోపించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థులు పేదలకు సేవ చేయాలనే తపనతో ఉంటారు. ప్రైవేటీకరణ వల్ల విద్యార్థులు అధిక ఫీజు చెల్లించి చదువుతారు కనుక, తర్వాత వారు లాభం పొందే విధానంలోనే వైద్య వృత్తి కొనసాగించాలనే ఆలోచన పెరుగుతుంది. దీంతో ‘వైద్యం ఒక సేవ’ అనే విలువ బలహీనపడుతుంది. ఇప్పటికే ఈ రాష్ట్రం నుంచి అనేకమంది ఎంబిబిఎస్ చదువుకొని ఇతర దేశాలకు వెళ్లి డాలర్ల పేరుతో కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ చదువుకున్న దేశంలో ప్రజలకి సేవ చేయడం మర్చిపోయారు. ప్రైవేట్ సంస్థలు లాభం కోసం పని చేస్తే ఆసుపత్రుల్లో ఉచిత లేదా తక్కువ ధరల సేవలు తగ్గిపోతాయి. పేదలకు చికిత్స అందుబాటులో ఉండదు. లాభాల కోసం సిబ్బంది నియామకాల్లో నాణ్యత కన్నా ఖర్చు తగ్గింపు మీద దృష్టి ఉంటుంది. దీని ప్రభావం వైద్య సేవల నాణ్యతపై పడుతుంది. ప్రభుత్వ సిబ్బందికి ఉన్న భద్రత, సర్వీస్ నియమాలు ప్రైవేట్ భాగస్వామ్య వ్యవస్థలో ఉండవు. ఫలితంగా ఉద్యోగులు ఆందోళన చెందుతారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎసఎఫ్)తో పాటు ఇతర విద్యార్థి సంఘాలు ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ‘వైద్య విద్య వ్యాపారం కాదు-హక్కు” అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలలు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి, ప్రజానిధులతో నడవాలి. ప్రజాసంఘాలు కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వ భూములు, భవనాలు, వసతులను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడం ప్రజాసంపదను వాణిజ్య రంగానికి అప్పగించే చర్యల్ని వ్యతిరేకిస్తున్నాయి.
ప్రజా ఆరోగ్యం-రాజ్యాంగ హక్కు
భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులలో ప్రజా ఆరోగ్యం ఒక భాగం. 1948లో ప్రపంచ ఆరోగ్య సంస్థనూ ఆరోగ్యాన్ని ప్రతి వ్యక్తి హక్కుగా ప్రకటించింది. అలాంటి హక్కును వ్యాపార ప్రయోజనాల కింద ఉంచడం సామాజిక న్యాయానికి విరుద్ధం. ఆరోగ్య రంగం లాభదాయక వ్యాపారం కాకుండా, సమాజ సేవకు కేంద్రంగా ఉండాలి. పేదలు డబ్బు లేక చికిత్స లేక మరణించే పరిస్థితి ఉంటే, ఆ దేశం అభివృద్ధి చెందలేదని చెప్పడానికి ఒక నిదర్శనం. ప్రభుత్వం ఆరోగ్య రంగంలో పెట్టుబడులను పెంచాలి. ఉన్న కళాశాలలను ఆధునీకరించి సిబ్బంది నియామకాలు చేయాలి. ప్రభుత్వాస్పపత్రుల్లో వసతులు మెరుగుపరచాలి. వైద్యవిద్యకు నిధులు పెంచి, పరిశోధనలకు ప్రోత్సాహం ఇవ్వాలి. ప్రైవేటీకరణకు బదులుగా ప్రభుత్వ వ్యవస్థను బలోపేతం చేయడమే దీర్ఘకాలిక పరిష్కారం. ప్రజల ఆరోగ్యం లాభాలకన్నా గొప్పదని గుర్తించాలి. ప్రభుత్వ వైద్యకళాశాలల ప్రైవేటీకరణ తాత్కాలికంగా పాలకులకు సౌకర్యంగా కనిపించినా, దీర్ఘకాలంలో అది ప్రజా ఆరోగ్యానికి, సామాజిక న్యాయానికి ప్రమాదకరం. విద్య, ఆరోగ్యం రంగాలు ప్రభుత్వ ఆధీనంలోనే బలపడాలి. ప్రజానిధులతో, ప్రజల మేలు కోసం నడిచే వ్యవస్థనే నిజమైన అభివృద్ధి అని గుర్తుంచుకోవాలి. పీపీపీ అమలైతే విద్యార్థుల కలలు కల్లలైనట్లే. వైద్య విద్యను వ్యాపారంగా మార్చే ప్రయత్నం సామాజిక న్యాయాన్ని దెబ్బతీస్తుంది.
ప్రజా వైద్యసేవలు స్థాయిని తగ్గిస్తుంది. ప్రభుత్వం తక్షణమే ఈ విధానాన్ని పున:సమీక్షించి విద్యార్థుల ప్రయోజనాలను కాపాడే దిశగా నిర్ణయాలు తీసుకోవాలి. ఏఐఎసఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా గతేడాది అక్టోబర్ 22 నుంచి నవంబర్ 12 వరకు నిర్వహించిన బస్సుయాత్రలో లక్షలాది మంది విద్యార్థులు, ప్రజానీకం పీపీపీ విధానాన్ని గంటాపథంగా వ్యతిరేకించారు. 2025, నవంబర్ 21వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఇంటికి విద్యార్థి సంఘాల నాయకులను చర్చలకు పిలిచిన సందర్భంలో ఏఐఎసఎఫ్ తరపున ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని స్పష్టం చేశాం. మంత్రి సానుకూలంగా స్పందించకపోవడంతో నవంబర్ 28వ తేదీన విజయవాడలో ఏఐఎసఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చలో సీఎం క్యాంప్ ఆఫీస్‌కి పిలుపునిచ్చాం. దాదాపు మూడు గంటల పాటు విజయవాడ ఏలూరు రోడ్డు వద్దకు వందలాది మంది విద్యార్థులు తరలివచ్చి ఆ ప్రాంతాన్ని దిగ్భంధం చేశాం. ఈ తరుణంలో పీపీపీకి వ్యతిరేకంగా భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలను, యువజన, ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలకు శ్రీకారం చూడతాం.
ప్రధాన కార్యదర్శి, ఏఐఎసఎఫ్-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు