ఘనంగా జాతీయ రైతు దినోత్సవం
విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా): మండల కేంద్రంలోని స్థానిక నారాయణ ప్రైమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు సోమవారం పొలం బాట పట్టారు. జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా చొక్కనహళ్లి గ్రామం సమీపంలోనే రైతు ఈరన్న తోటలో విద్యార్థులు రైతుల వేషాదారణలో ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు రైతులతో వ్యవసాయం గురించి అడిగి తెలుసుకున్నారు. విత్తనాలు, వివిధ పంటల గురించి, పంటల మార్పిడి గురించి, ఎరువుల వాడకం, తదితర అంశాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. అనంతరం నారాయణ పాఠశాల కరస్పాండెంట్ నరేష్ ఆచారి మాట్లాడుతూ భారతదేశం యొక్క ఐదవ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ జయంతి జ్ఞాపకార్థం ఈ రోజును జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం అని తెలిపారు. రైతులేనిదే రాజ్యంలేదని, ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటలే అందరికి ఆహారంగా వస్తున్నాయని, దేశానికి రైతు వెన్నుముఖ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు హరి ప్రసాద్, అకాడమిక్ డీన్ నిజం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.