జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి
గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశం సిద్ధమవుతున్న వేళ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించారు. న్యాయం, సోదరభావం అనే రెండు కీలకమైన అంశాలను మన రాజ్యాంగం నిర్వచించిందని, అవే గణతంత్రానికి పునాదులని ఆమె స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దార్శనికత, రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలను ఆమె తన ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించారు.దేశాభివృద్ధి ప్రయాణంలో మహిళలు కీలక మైలురాళ్లను సృష్టిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్నారని రాష్ట్రపతి ప్రశంసించారు. దేశ భద్రతకు కాపలా కాస్తున్న సాయుధ బలగాల శౌర్య పరాక్రమాలను కొనియాడుతూ, ‘ఆపరేషన్ సిందూర్‌్ణను ఆమె గుర్తుచేశారు. దేశ పురోభివృద్ధికి దోహదపడుతున్న రైతులు, శాస్త్రవేత్తలు, వైద్యులు, సైనిక, పోలీసు సిబ్బంది, వ్యాపారవేత్తలు, యువత సేవలను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.
ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయడానికి ఎన్నికలలో పాల్గొనడం పౌరుల బాధ్యత అని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇచ్చిన సందేశాన్ని రాష్ట్రపతి ఈ సందర్భంగా గుర్తుచేశారు. వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలతో పాటు సర్దార్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌లకు నివాళులర్పించిన కార్యక్రమాలను కూడా ఆమె ప్రస్తావించారు.


