2026 చివరికి అమల్లోకి ఒప్పందం
న్యూదిల్లీ: భారత్`27 దేశాలతో కూడిన యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందా(ఎఫ్‌టీఏ)నికి సంబంధించి చట్టపరమైన ప్రక్రియల పూర్తికి, ఒప్పందం డాక్యుమెంట్లను ఐరోపా దేశాల 24 అధికారిక భాషల్లోకి అనువాదం చేయించడానికి దాదాపు 6 మాసాల సమయం పట్టనుంది. 2026 చివరికల్లా ఒప్పందంపై భారత్, ఈయూ లాంఛనంగా సంతకాలు చేస్తాయి. 2027లో మొదటి రెండు నెలల్లోగా ఎఫ్‌టీఏపై భారత ప్రభుత్వ మంత్రిమండలి, ఐరోపా పార్లమెంటు ఆమోదముద్ర వేస్తాయి. ఆ వెంటనే ఒప్పందం అమల్లోకి వచ్చేస్తుంది. ఈ ఒప్పందంలో కీలకాంశాలను పరిశీలించినట్లయితే…
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తే, దాదాపు 99 శాతం వస్తు, ఉత్పత్తులపై సుంకాలు పూర్తిగా తొలగడం కానీ, బాగా తగ్గడం కానీ జరుగుతుంది. ఈమేరకు ఈయూ కూటమిలోని 27 ఐరోపా దేశాలు, భారత్ తమతమ నియంత్రణ వ్యవస్థలలో మార్పులు, చేర్పులు చేసుకుంటాయి. మొత్తం మీద భారత్‌లోని టెక్, ఫార్మా, వాహన, వస్త్ర రంగ కంపెనీలకు లబ్ధి చేకూరనుంది. ఈయూ దేశాలకు భారత్ ప్రధానంగా డీజిల్, విమాన ఇంధనం, స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, వస్త్రాలు, యంత్రాలు, కంప్యూటర్లు, సేంద్రీయ రసాయనాలు, ఇనుము, ఉక్కు, రత్నాలు, ఆభరణాలు, ఫార్మా ఉత్పత్తులు, వాహన విడిభాగాలను ఎగుమతి చేస్తోంది. ప్రస్తుతం భారతీయ వస్త్రాలు, దుస్తులపై 12 నుంచి 16 శాతం దాకా సుంకాలను ఈయూ దేశాలు విధిస్తున్నాయి. దీనివల్ల అక్కడి మార్కెట్లో భారతీయ వస్త్రాలు, దుస్తుల ధరలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా చౌకగా లభిస్తున్న బంగ్లాదేశ్, వియత్నాం వస్త్ర ఉత్పత్తులతో భారత్ పోటీ పడలేకపోతోంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చాక, ఈ పరిస్థితి మారుతుంది. భారత వస్త్ర, ఉత్పత్తులు చౌకగా ఐరోపా దేశాల్లో లభిస్తాయి. వ్యాపార సేవలు, టెలీ కమ్యూనికేషన్లు, ఐటీ, రవాణా సేవలను ఈయూ దేశాలకు భారత కంపెనీలు అందిస్తుంటాయి. ఈ విభాగాల్లోనూ ఇకపై భారత్ మరింత బలపడనుంది. భారతీయ కంపెనీలకు ఈయూలో అవకాశాలు పెరగనున్నాయి. వెరసి, ఎగుమతి వ్యాపారం ద్వారా భారత్‌కు వచ్చే విదేశీ మారక ద్రవ్యం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
అనేక విభాగాల ఉత్పత్తుల ధరలు తగ్గే అవకాశం
ఈయూ దేశాల నుంచి భారత్‌కు ప్రధానంగా యంత్రాలు, కంప్యూటర్లు, టర్బో జెట్లు, మొబైల్ ఫోన్ల విడిభాగాలు, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, విమానాలు, వైద్య పరికరాలు, శాస్త్రీయ ఉపకరణాలు, ముడి వజ్రాలు, సేంద్రీయ రసాయనాలు, ప్లాస్టిక్స్, ఇనుము, ఉక్కు, కార్లు, వాహన విడిభాగాలు సరఫరా అవుతుంటాయి. ఎఫ్‌టీఏ అమల్లోకి వచ్చాక వీటిలో చాలావరకు వస్తు, ఉత్పత్తులపై భారత్ సుంకాలను విధించదు. ఫలితంగా ఈ కేటగిరీల ఉత్పత్తుల ధరలలు తగ్గే అవకాశం ఉంది. ఈ అంశం భారత వినియోగదారులకు కలిసొస్తుంది. ఈయూ దేశాలు భారత సంస్థలకు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సేవలు, టెలీ కమ్యూనికేషన్ సేవలు, ఐటీ సేవలను కూడా అందిస్తుంటాయి. ట్రేడ్ డీల్ ప్రభావంతో వచ్చే ఏడాది నుంచి ఈసేవలను మరింత సరసంగా భారతీయ కంపెనీలు పొందొచ్చు. అలాగే ఐరోపా దేశాల మద్యం బ్రాండ్ల ధరలు తగ్గనున్నాయి. ఐరోపా దేశాల్లో భారత మద్యం బ్రాండ్ల మార్కెట్ వాటా పెరగనుంది. భారత మార్కెట్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రవాహం పెరగనుంది. 2000 సంవత్సరం ఏప్రిల్ నుంచి 2024 సెప్టెంబరు మధ్యకాలంలో ఈయూ దేశాల నుంచి భారత్‌లోకి దాదాపు రూ.10 లక్షల కోట్లు విలువైన ఎఫ్‌డీఐలు వచ్చాయి. యావత్ ప్రపంచ దేశాల నుంచి భారత్‌కు వస్తున్న మొత్తం ఎఫ్‌డీఐలలో ఈయూ ఎఫ్‌డీఐల వాటా 16.6 శాతం ఉంది. వాణిజ్య ఒప్పందంలో భాగంగా రాబోయే రెండేళ్లలో భారత్‌కు రూ.5వేల కోట్లను ఈయూ దేశాలు అందించనున్నాయి. వాతావరణంలోకి కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించే చర్యల కోసం ఈ నిధులను ఖర్చు చేస్తారు. పరిశ్రమలు పర్యావరణహితమైన ఉత్పత్తి విధానాలను అనుసరించేలా ప్రోత్సహిస్తారు. పర్యావరణ హితమైన సాంకేతికతలను అందిపుచ్చుకునేలా పరిశ్రమలకు సాంకేతిక, యాంత్రిక తోడ్పాటును అందిస్తారు. వస్తు,ఉత్పత్తుల సప్లై చైన్ వ్యవస్థలలోనూ కాలుష్య రహిత పద్ధతులను వినియోగంలోకి తెచ్చేందుకు కార్యాచరణను అమలు చేస్తారు.


