Homeభూముల కేటాయింపుపై రచ్చ

భూముల కేటాయింపుపై రచ్చ

- Advertisement -

టీడీపీ, వైసీపీ మాటల యుద్ధం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: శాసన మండలిలో తొలిరోజు జరిగిన ప్రశ్నోత్తరాల నుంచి గవర్నరు ప్రసంగం వరకు రచ్చ జరిగింది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. విశాఖలో విలువైన భూములను 99 పైసలకే కారుచౌకగా కట్టపెట్టడంపై మండలి అట్టుడికింది. ప్రధానంగా రహేజాకు భూములు ఇవ్వడంపై విపక్ష వైసీపీ, అధికార టీడీపీ సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. రహేజా సాఫ్ట్‌వేర్ సంస్థ కాదనీ, అది ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థ అని, అది భవనాలు నిర్మించి… అద్దెలకు ఇస్తుందని, అలాంటి రియల్ ఎస్టేట్ కంపెనీకి భూములు కేటాయించడం ఏమిటని వైసీపీ సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. అంతేకాకుండా కారు చౌకంగా కేటాయించడం సరికాదని హితవు పలికారు. ఈ ప్రశ్నకు మంత్రి లోకేశ్ సమాధానం ఇచ్చినప్పటికీ సంతప్తి చెందని వైసీపీ సభ్యులు పదేపదే ప్రశ్నించడంతో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. సభలో కొంతసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖలో ప్రైవేట్ కంపెనీలకు ప్రభుత్వ భూములు కేటాయించడంపై సుదీర్ఘ చర్చ జరిగింది. సభ్యుల ప్రశ్నలకు మంత్రులు లోకేశ్, అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నించగా… వైసీపీ సభ్యులు అడ్డుకుంటూ…మాటల దాడికి దిగారు. సభ్యులకు అండగా శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడారు. లోకేశ్, అచ్చెన్నాయుడు వైఖరిని తప్ప్పుపట్టారు. చివరికి విశాఖలో 5 కంపెనీలకు 99 పైసలకే ప్రభుత్వ భూములు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. చైర్మన్ కొయ్యే మోషెన్‌రాజు గురువారం ఉదయం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. పరిశ్రమలకు భూముల కేటాయింపు అంశంపై వైసీపీ సభ్యులు తూమాటి మాధవరావు, వరుదు కల్యాణి తదితరులు అడిగిన ప్రశ్నను ముందుకు తీసుకురావాలని అభ్యర్థించారు. ఆ ప్రశ్నపై చర్చను ముందు ప్రారంభించేందుకు అంగీకరించారు. తూమాటి మాధవరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏఏ కంపెనీలకు 99 పైసలకే భూములు ఇచ్చింది? ఎవరికి ఎన్నెన్ని ఎకరాలు, ఎంత ధరకు ఇచ్చిందని ప్రశ్నించారు. గతేడాది ప్రారంభమైన కంపెనీలకు కూడా 99 పైసలకే భూములిచ్చారని, విజయవాడ గవర్నరుపేట ఆర్టీసీ డిపోకు చెందిన రూ.600 కోట్ల విలువైన స్థలాన్ని రూ.156 కోట్ల పెట్టుబడులు వస్తాయని అప్పనంగా కట్టబెట్టారని మండిపడ్డారు. అమరావతి రాజధాని పనులకు టెండర్లు పిలిచి…లులూ సంస్థను టెండర్లు ఎందుకు పిలవలేదని నిలదీశారు. విశాఖలోని ఓ విద్యాసంస్థ తమ ఆధీనంలో రూ.5 వేల కోట్ల విలువైన భూములు ఉంచుకుందని, దీనిపై విమర్శలు రావడంతో తాము వెయ్యి కోట్ల భూమినే ఆక్రమించామని చెబుతోందన్నారు. వెయ్యి కోట్ల విలువైన భూములు ఆక్రమించుకోవచ్చా అని సూటిగా ప్రశ్నించారు. దీనిపై నారా లోకేశ్, అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చినప్పటికీ వైసీపీ సభ్యులు సంతప్తి చెందలేదు. దీంతో టీడీపీ, వైసీపీ మధ్య పరస్పర విమర్శలతో మండలి వేడెక్కింది.
ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం: లోకేశ్
విశ్వసనీయత ఉన్న 5 ప్రైవేట్ కంపెనీలకే ఎకరా రూ.99 పైసలకు ప్రభుత్వ భూములు కేటాయించామని… వీటిద్వారా 65వేల మందికి ఉద్యోగాలు రానున్నాయని, భూముల కేటాయింపుల్లో ప్రభుత్వం ఎక్కడా లాలూచీ పడాల్సిన అవసరం లేదని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంటే..రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదనే లక్ష్యంతో వైసీపీ ఉందన్నారు. శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ… ఒక కప్పు కాఫీ కంటే నేను వారి వద్ద ఎక్కువ తీసుకుని ఉంటే నిరూపించాలని… అప్పుడు ఏ చర్యకైనా సిద్ధమని అన్నారు. రాష్ట్రంలో 5 కంపెనీలకు 99 పైసలకు భూమి కేటాయించామని, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, కాగ్నిజెంట్, ఏఎనఎసఆర్ గ్లోబల్, రహేజా, మదర్సన్ ఇంటర్నేషనల్ కంపెనీలకు 99 పైసల చొప్పున భూములు కేటాయించామని, ఏయే కంపెనీ ఎన్ని ఉద్యోగాలు కల్పించనుందో కూడా ప్రభుత్వ సమాధానంలో పొందుపర్చామని స్పష్టం చేశారు. కాగ్నిజెంట్ కు భూమి కేటాయించినప్పుడు 8వేల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిందని… కానీ భూమిపూజ సమయంలో 25వేల ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించిందన్నారు. ఎనర్జీ, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఐఎనఐ, ఐటీ అండ్ కామర్స్, ఏపీసీఆర్డీయే, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్`అర్బన్ డెవలప్ మెంట్, టెక్స్ టైల్, ఎడ్యుకేషన్, హెల్త్ పాలసీల కింద ఆయా సంస్థలకు భూములు కేటాయించామన్నారు. ఐదు కంపెనీలకు మాత్రమే 99 పైసలకు భూములు కేటాయించామని స్పష్టం చేశారు. ఆర్సెల్లార్ మిట్టల్ ఎక్కడికీ వెళ్లలేదని, వైసీపీ సభ్యులు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదన్నారు. ఆర్సెల్లార్ మిట్టల్ ప్రాజెక్ట్ ఉత్తరాంధ్రకు వస్తుంది. మేం భూములు కేటాయించామని, 17 నెలల్లోనే మేం వారిని రాష్ట్రానికి తీసుకువచ్చామని తెలిపారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ భూములు తక్కువ ధరకు ఇవ్వడంతోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, దీనిపై వైసీపీ సభ్యులు చేస్తున్న ఆరోపణలలో అర్థం లేదన్నారు. ఆ తర్వాత మరో వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ విశాఖలో రూపాయికి గుప్పెడు శనగలు, సింగిల్ టీ కూడా రాదని, 99 పైసలకే వేల కోట్ల విలువైన భూములు కట్టబెట్టేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎక్కడైనా వెనుకబడిన ప్రాంతాల్లో భూములను తక్కువ ధరకు ఇస్తారని, అభివద్ధి చెందిన విశాఖ నగరంలోని భూములను అప్పన్నంగా కారు చౌకగా ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేయడం ఏమిటని మండిపడ్డారు. ఏపీఐఐసీ చేసే పనిని రియల్ ఎస్టేట్ కంపెనీలతో చేయించడమేమిటి?, రియల్ ఎస్టేట్ సంస్థలు బాగా పనిచేస్తాయా?, ప్రభుత్వ భూములను టెండర్లు లేకుండా ఎలా కేటాయిస్తారని నిలదీశారు.
పెన్షన్లపైనా రగడ
సామాజిక భద్రతా పెన్షన్ల అంశంపైనా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు, వైసీపీ సభ్యులకు తీవ్ర వాగ్వివాదం జరిగింది. కూటమి ప్రభుత్వ హయాంలో పెన్షన్లు ఎంతమంది కొత్త వారికిచ్చారో చెప్పాలంటూ వైసీపీ సభ్యులు శివరామిరెడ్డి పట్టుబట్టడంతో సభ ఒక్కసారిగా వేడెక్కింది. సభ్యుల ప్రశ్నకు మంత్రి సమాధానం దాటవేశారు.
శివరామిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో 66 లక్షల మందికి సామాజిక పెన్షన్లు అందించగా… కూటమి ప్రభుత్వ రాగానే 60 లక్షలకు కుదించిందని, మిగిలిన 6 లక్షల మంది పరిస్థితేమిటని నిలదీశారు. బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకుని కొత్త వారికి ఎన్ని పెన్షన్లు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. సామాజిక పెన్షన్ల విషయంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న నిబంధనలనే కూటమి ప్రభుత్వం పాటిస్తున్నదనీ, అలాంటి సమయంలో పెన్షన్లు ఎందుకు తగ్గుతాయని నిలదీశారు. మంత్రి కొండపల్లి సూటిగా సమాధానం ఇవ్వకుండా పెన్షన్ల కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ఎక్కడా పెన్షన్లలో కోతవేయలేదన్నారు. ఈ సమయంలో రెండు పార్టీల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. చైర్మన్ సర్దిచెప్పినప్పటికీ ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో సభను వాయిదా వేశారు. తిరిగి సమావేశం ప్రారంభమయ్యాక చైర్మన్ మాట్లాడుతూ మిగిలిన అన్ని ప్రశ్నలకు సమాధానాలిచ్చినట్లుగా ప్రకటించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు