. ఖుల్నాలో ఘర్షణ…బీఎన్పీ నాయకుడి మృతి
. గోపాల్‌గంజ్‌లో పోలింగ్ కేంద్రంపై బాంబు దాడి.. ముగ్గురికి గాయాలు
. కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని జమాత్ ఆరోపణ
ఢాకా: బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికలు హింసాత్మకంగా మారాయి… గురువారం దేశవ్యాప్తంగా అనేక పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, ఖుల్నా జిల్లాలో జరిగిన ఘర్షణలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) నేత మొహిబుజ్జమాన్ కోచీ మతి చెందారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఖుల్నాలోని అలియా మదరసా పోలింగ్ కేంద్రం వద్ద బీఎన్పీ, జమాత్-ఏ-ఇస్లామీ మద్దతుదారుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. జమాత్ తరపున ప్రచారం చేస్తున్న మదరసా ప్రిన్సిపాల్‌ను మొహిబుజ్జమాన్ కోచీ అడ్డుకునే ందుకు ప్రయత్నించారు. మదరసా ప్రిన్సిపాల్ కోచీని తోసేయడంతో ఆయన ఒక చెట్టుకు గుద్దుకున్నారని… తలకు తీవ్రగాయం కావడంతో మరణించారని బీఎన్పీ నేత తెలిపారు. ఈ ఘటనను పోలీసులు ధృవీకరించారు. కోచీని ఆసుపత్రికి తీసుకువచ్చేసరికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కాగా,చ గోపాల్‌గంజ్ సదర్ ఉపజిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద కాక్టెయిల్ బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో విధుల్లో ఉన్న ఇద్దరు అన్సార్ సిబ్బంది, ఓటరుతో పాటు వచ్చిన ఒక చిన్నారితో సహా ముగ్గురు గాయపడ్డారు. కేంద్రం బయట ఉన్న కాలువ అవతలి వైపు నుంచి దుండగులు ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు, దేశంలోని అనేక ప్రాంతాల్లో తమ పార్టీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులపై దాడులు జరుగుతున్నా యని, ఓటు వేయకుండా అడ్డుకుంటున్నా రని జమాత్-ఏ-ఇస్లామీ ఆరోపించింది. ఈ విషయమై ఎన్నికల సంఘానికి, అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆ పార్టీ సహాయ ప్రధాన కార్యదర్శి మీడియాకు తెలిపారు. పెరుగుతున్న రాజకీయ ఘర్షణలు, హింస నడుమ జరుగుతున్న ఈ ఎన్నికల నిష్పాక్షికతపై పలు పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఈరోజు కోసం బంగ్లాప్రజలు పదేళ్లుగా ఎదురు చూశారు: తారిక్ రహమాన్
బీఎన్పీ చైర్మన్, మాజీ ప్రధాని ఖలిదా జియా కుమారుడు తారిక్ రహమాన్ ఢాకాలో ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఈ రోజు కోసం బంగ్లాదేశ్ ప్రజలు పదేళ్లుగా ఎదురచూశారని అన్నారు. ‘ఈ రోజు రాజ్యాంగబద్ధమైన నా ఓటు హక్కును వినియోగించుకున్నా. పదేళ్లకు పైగా బంగ్లాదేశ్ ప్రజలు ఈ రోజు కోసం ఎదురుచూశారు. గత రాత్రి కొన్ని ప్రాంతాల నుంచి కొన్ని అవాంఛనీయ ఘటనలు జరిగినట్లు నివేదికలు వచ్చాయి. అవి ఊహించనివి. పరిస్థితిని అదుపులోకి తీసుకురాడానికి చట్టాన్ని అమలు చేసే సంస్థలు కఠినంగా వ్యవహరిస్తాయని నమ్ముతున్నా. దేశవ్యాప్తంగా ప్రజలు బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటే, ఎలాంటి కుట్రనైనా తిప్పికొట్టవచ్చు’ అని రహమాన్ తెలిపారు.
ఈ పార్టీల మధ్యే ప్రధాన పోటీ
హసీనా పార్టీ అవామీ లీగ్‌ను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించారు. దీంతో ఈ ఎన్నికల్లో బీఎన్పీ, జమాత్-ఎ-ఇస్లామీ కూటమి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. విద్యార్థుల ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేషనల్ సిటిజన్ పార్టీ కూడా జమాతే కూటమిలో ఉంది. అదనంగా లెఫ్ట్ డెమొక్రటిక్ అలయన్స్, అమర్ బంగ్లాదేశ్ పార్టీతో పాటు ఇతర పార్టీలు కూడా పోటీలో ఉన్నాయి. దేశంలో ఉన్న మొత్తం 59 పార్టీల్లో 51 పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి.


