టెక్నాలజీ ఆధారిత పాలనపై ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్‌గేట్స్ సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి సచివాలయంలోని రియల్‌టైమ్ గవర్నెన్స్ కమాండ్ సెంటర్ ను సందర్శించారు.ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి రాష్ట్ర పాలనలో టెక్నాలజీని ఎలా వినియోగిస్తున్నారో ప్రత్యక్షంగా పరిశీలించారు.రియల్‌టైమ్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలను వేగంగా అందిస్తున్న విధానం, అందుతోన్న ఫలితాలను ముఖ్యమంత్రి బిల్‌గేట్స్‌కు వివరించారు.డేటా లేక్,అవేర్ 2.0,వాట్సాప్ గవర్నెన్స్,సంజీవని ప్రాజెక్టు, రాజధాని అమరావతి వంటి కీలక ప్రాజెక్టులపై గేట్స్ ఆసక్తిగా తెలుసుకున్నారు.ఆర్టీజీఎస్‌లో ఏర్పాటు చేసిన డిస్‌ప్లే వాల్స్‌పై జరిగిన ప్రజెంటేషన్లను పరిశీలించిన బిల్‌గేట్స్‌కు, డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను ఒకే వేదికపైకి తీసుకొచ్చామని సీఎం వివరించారు.
కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఆధారంగా రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి అంచనా
డేటా లేక్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు మరింత సులభంగా మారిన తీరు బాగుందని ఈ సందర్భంగా బిల్‌గేట్స్ ప్రశంసించారు.అవేర్ 2.0 వ్యవస్థతో రియల్‌టైమ్‌లో సమాచారాన్ని సేకరించి, త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, విధానాలపై ప్రజాభిప్రాయాన్ని ఎలా సేకరిస్తున్నారో కూడా ఆయన వివరించారు.కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఆధారంగా రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధిని నిరంతరం అంచనా వేస్తున్నట్టు తెలిపారు.ఆస్తి రికార్డుల భద్రతపై బిల్‌గేట్స్ అడిగిన ప్రశ్నకు, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా భూ రికార్డులను భద్రపరుస్తున్నామని, క్యూఆర్ కోడ్ వంటి విధానాలతో భూ లావాదేవీల్లో పారదర్శకత తీసుకొచ్చామని అధికారులు వివరించారు.
గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చిత్తూరు జిల్లాలో అమలవుతున్న సంజీవని ప్రాజెక్టు పురోగతిపై కూడా బిల్‌గేట్స్ ఆరా తీశారు.రక్తపోటు,షుగర్ వంటి పరీక్షల వివరాలను ఎలా నమోదు చేస్తున్నారో తెలుసుకున్నారు.కుప్పంలో అమలైన సంజీవని ప్రాజెక్టు చాలా చక్కగా ఉందని ప్రశంసిస్తూ నైస్ అంటూ అభినందించారు.ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డుల ఆధారంగా వారి జీవనశైలి,ఆహారం తదితర అంశాలపై సూచనలు ఇస్తున్నామని అధికారులు తెలిపారు.కృత్రిమ మేధస్సు(ఏఐ)వినియోగంతో ప్రజారోగ్య సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించగా,దానికి బిల్‌గేట్స్ గ్రేట్ అంటూ మెచ్చుకున్నారు.అలాగే ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ వివరాలను కూడా గేట్స్ తెలుసుకోగా, రాజధాని అభివృద్ధి తీరును సీఎం వివరించారు.ఈ పనితీరును చూసి గ్రేట్ వర్క్ అంటూ బిల్‌గేట్స్ కొనియాడారు.


