-టారిఫ్ ల సొమ్ము రిఫండ్ చేయాలని తీర్పు ఇచ్చిన ట్రేడ్ కోర్టు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాగానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. టారిఫ్‌ల సొమ్ము రిఫండ్ చేయాల్సిందేనని న్యూయార్క్‌లోని ట్రేడ్ కోర్టు తీర్పునిచ్చింది. 1977 అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద ట్రంప్ గతేడాది విధించిన భారీ సుంకాల ను సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అట్మస్ ఫిల్ట్రేషన్ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. దిగుమతిదారులు రిఫండ్ పొందేందుకు అర్హులని తాజాగా ట్రేడ్ కోర్టు న్యాయమూర్తి రిచర్డ్ ఈటన్ పేర్కొన్నారు. ఈ సుంకాల సొమ్ము వాపసుకు సంబంధించిన కేసులను తానే చూడనున్నట్లు వెల్లడించారు. ఇటీవల సుప్రీం తీర్పులో ట్రంప్ టారిఫ్‌లు చెల్లవని స్పష్టం చేసింది. కానీ, రిఫండ్ల గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు. తాజా తీర్పుతో ఈ ప్రక్రియపై కొంత స్పష్టత వచ్చినట్లయ్యింది. ఈ తీర్పును అప్పీల్ చేస్తామని ట్రంప్ యంత్రాంగం తరఫు న్యాయవాది పేర్కొన్నారు. కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్స్ ద్వారా యూఎస్‌లోకి దిగుమతయ్యే అన్ని వస్తువులు ‘లిక్విడేషన్్ణ అనే ప్రక్రియలోకి వస్తాయి. ఈ వస్తువులపై అధికారులు విధించిన సుంకంపై అభ్యంతరం తెలపడానికి దిగుమతిదారులకు 180 రోజుల సమయం ఉంటుంది. ఆ గడువు ముగిసిపోతే.. వారు యూఎస్ అధికారులు విధించిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో.. ఇకపై లిక్విడేషన్ ప్రక్రియ ద్వారా వెళ్తున్న వస్తువులపై సుంకాలు వసూలుచేయడం ఆపాలని న్యాయమూర్తి కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్స్ను ఆదేశించారు. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తయ్యి ఉంటే.. సుంకాలు లేకుండా వస్తువులను తిరిగి లెక్కించాలని స్పష్టం చేశారు.


