బెంగళూరు కోర్టు కీలక ఆదేశం
బెంగళూరు: హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా రూపొందిన ‘ఉస్తాద్ భగత్ సింగ’ చిత్రంపై సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేక ప్రచారం చేయకుండా నిరోధిస్తూ బెంగళూరు సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. ఈ సినిమా గురించి అభ్యంతరకర, కించపరిచే లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకునేలా ‘జాన్ డో’ ఇంజంక్షన్ ఆర్డర్‌ను జారీ చేస్తూ న్యాయమూర్తి జీవనరావు వసంతరావు కులకర్ణి ఆదేశాలిచ్చారు. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ మేరకు స్పందించింది. సినిమా విడుదలకు ముందే కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా వ్యతిరేక ప్రచారం చేస్తూ… బాక్సాఫీస్ వసూళ్లను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని మైత్రీ మూవీస్ తమ పిటిషన్లో పేర్కొంది. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, చిత్ర యూనిట్‌కు ఊరటనిస్తూ ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఎక్స్, యూట్యూబ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాýతో పాటు ఐఎండీబీ, బుక్‌మైషో వంటి వెబ్సైట్లలో కూడా సినిమా ప్రతిష్టను దెబ్బతీసే కంటెంట్‌ను ప్రసారం చేయడాన్ని నిషేధించారు. ఈ స్టే ఆర్డర్ తదుపరి విచారణ తేదీ అయిన ఏప్రిల్ 27 వరకు అమలులో ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
‘జాన్ డో’ ఇంజంక్షన్ ఆర్డర్ అంటే?
ఇంటర్నెట్లో వేలాది మంది గుర్తుతెలియని యూజర్లు తప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడు వారి వివరాలు తెలియవు. అలాంటి సందర్భాల్లో వీరందరికీ వర్తించేలా జారీ చేసే ముందస్తు నిషేధాజ్ఞలనే ‘జాన్ డో’ ఆర్డర్ అంటారు. ఈ ఉత్తర్వుల వల్ల, అభ్యంతరకర పోస్టులను గుర్తించిన వెంటనే సంబంధిత సోషల్ మీడియా సంస్థలు వాటిని తొలగించాల్సి ఉంటుంది. ఇది సినిమా పైరసీని అరికట్టడంతో పాటు ఇలాంటి దుష్ప్రచారాలను నిరోధించడానికి ఒక శక్తివంతమైన న్యాయ సాధనంగా ఉపయోగపడుతుంది.
‘ఉస్తాద్ భగత్ సింగ’పై వ్యతిరేక ప్రచారానికి అడ్డుకట్ట
- Advertisement -


