మందులపై యుద్ధం ప్రభావం
*ధరలు పెరిగే అవకాశం!
(విశాలాంధ్ర-చిత్తూరు)
ప్రస్తుతం పశ్చిమాసియా దేశాల మధ్య చెలరేగుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కాకుండా, సామాన్యుడి ప్రాణరక్షక ఔషధాల రంగాన్ని కూడా అతలాకుతలం చేస్తున్నాయి. రవాణా మార్గాల్లో ఆటంకాలు, ముడి చమురు ధరల పెరుగుదల వెరసి భారత ఫార్మా రంగానికి ‘ప్రమాద ఘటికలు’ మోగిస్తున్నాయి. రానున్న రోజుల్లో నిత్యావసర మందుల ధరలు సామాన్యుడికి భారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
భారతదేశం ప్రపంచానికి 'ఔషధశాల'గా పేరుగాంచినప్పటికీ, మందుల తయారీకి అవసరమైన ఏపీఐ (యాక్టివ్ ఫార్మాసూటికల్ ఇన్ గ్రేడైంట్స్), కీలక రసాయనాల కోసం మనం విదేశాలపై, ముఖ్యంగా చైనాపై అధికంగా ఆధారపడుతున్నాం. యుద్ధం కారణంగా ఎర్ర సముద్రం గుండా వెళ్లే నౌకలపై దాడులు జరుగుతుండటంతో, రవాణా సంస్థలు సుదూర మార్గాలను ఎంచుకుంటున్నాయి. దీనివల్ల ప్రయాణ సమయం 15 రోజులు పెరగడమే కాకుండా, కంటైనర్ చార్జీలు 200 నుంచి 300శాతం వరకు పెరిగాయి. మందుల తయారీలో కీలకమైన బెంజీన్, టోలుయిన్ వంటి పెట్రో రసాయనాల ధరలు ముడి చమురు ధరలతో ముడిపడి ఉన్నాయి. యుద్ధం కారణంగా వీటి సరఫరా నిలిచిపోవడంతో దేశీయంగా మందుల ఉత్పత్తి వ్యయం భారీగా పెరుగుతోంది.
ధరలు పెరిగే అవకాశం
ఉత్పత్తి వ్యయం, రవాణా ఖర్చులు పెరగడంతో, ఫార్మా కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులపై వేసేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రాథమిక ఔషధాలు అంటే.. జ్వరం, జలుబు, ఇన్ఫెక్షన్లకు వాడే పారాసిటమాల్, అజిత్రోమైసిన్ వంటి యాంటీబయాటిక్స్ ధరలపై ప్రభావం పడనుంది. ఇక దీర్ఘకాలిక వ్యాధులు అంటే … బీపీ, షుగర్, గుండె సంబంధిత వ్యాధులకు వాడే మందుల ధరలు కూడా 10 నుండి 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక సిరంజీలు, గ్లౌజులు, ఐవీ సెట్లు వంటి ప్లాస్టిక్ ఆధారిత వైద్య పరికరాల ధరలు ఇప్పటికే మార్కెట్లో సెగ పుట్టిస్తున్నాయి.
ప్రభుత్వం ఏం చేయాలి?
ప్రస్తుతం మన దేశంలో కేవలం రెండు నుంచి మూడు నెలలకు సరిపడా నిల్వలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. యుద్ధం గనుక సుదీర్ఘ కాలం కొనసాగితే దేశంలో మందుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. “ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫార్మా కంపెనీలకు రవాణా సబ్సిడీలు ప్రకటించాలి. అలాగే, కృత్రిమ కొరత సృష్టించే స్టాకిస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలి.” అని ఫార్మా రంగ ప్రతినిధులు కోరుతున్నారు.
ప్రజలకు సూచన
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదు కానీ, క్రమం తప్పకుండా మందులు వాడే వారు (బీపీ, షుగర్ రోగులు) తమకు కావాల్సిన కనీస నిల్వలను ముందే సమకూర్చుకోవడం ఉత్తమం. అలాగే, బ్రాండెడ్ మందుల కంటే తక్కువ ధరకు లభించే ‘జన ఔషధి’ (జెనరిక్) మందులను ఆశ్రయించడం ద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు.


