హిందూ మహాసముద్రం పైకి ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు
తెహ్రాన్: ఇరాన్ యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ప్రతి దాడులతో ఎదురు తిరుగుతోంది. హిందూ మహాసముద్రం పైకి ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. మహాసముద్రంలోని యూఎస్-యూకే సైనిక స్థావరం డిగో గార్సియా లక్ష్యంగా వాటిని పంపింది. అయితే 4000 కి.మీ.దూరంలో ఉన్న టార్గెట్‌ను అవి తాకలేదని తెలుస్తోంది. ఒకటి మార్గంమధ్యలోనే విఫలమవగా, మరొకదాన్ని తమ దేశం అడ్డుకుందని మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ క్షిపణులను ఎప్ప్పుడు ప్రయోగించారన్న దానిపై స్పష్టత లేదు.
డిగో గార్సియా హిందూ మహాసముద్రంలో యూఎస్-యూకేకు ఉన్న వ్యూహాత్మక సైనిక స్థావరం. హిందూ మహాసముద్రంలో 60 దీవుల సముదాయం. అందులో అతిపెద్దదే డిగో గార్సియా. ఆఫ్రికా, పశ్చిమాసియాలోని కార్యకలాపాల కోసం అమెరికా దీనిని ప్రధానంగా వినియోగిస్తోంది. ఇదిలాఉంటే… హోర్మూజ్ర్ జలసంధిని తెరిపించేందుకు, ఇరాన్‌కు చెందిన ఖర్గ్ ఐలాండ్‌ను ఆక్రమించే అవకాశాలను అమెరికా పరిశీలిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఆ క్రమంలోనే పశ్చిమాసియాలో మరో మూడు యుద్ధనౌకలను మోహరించేందుకు అమెరికా సిద్ధమైంది. యూఎసఎస్ బాక్సర్, మరో రెండు యుద్ధనౌకలు దాదాపు 2,500 మంది నౌకాదళ సిబ్బందితో పశ్చిమాసియా దిశగా వెళ్తున్నట్లు అమెరికా అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. అగ్రరాజ్యానికి చెందిన విమానవాహక నౌక యూఎసఎస్ ట్రిపోలీ పశ్చిమాసియా వైపు కదులుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఇరాన్‌పై సైనిక చర్యను క్రమంగా తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ ఈ క్షిపణుల ప్రయోగం గురించి వెలుగులోకి వచ్చింది. తమవద్ద క్షిపణుల పరిధి 2000 కి.మీ. వరకు ఉంటుందని ఇటీవల ఇరాన్ విదేశాంగ మంత్రి వెల్లడించారు. కానీ చెప్పిన దానికంటే ఇరాన్ వద్ద ఉన్న మిస్సైళ్ల పరిధి చాలా ఎక్కువనేని తాజా ఘటన వెల్లడి చేస్తోంది. ఇరాన్ ఆయుధ సంపత్తిని అమెరికాకు అంచనా దొరకడంలేదు. అగ్ర రాజ్యాధిపత్యానికి ఎక్కడా తగ్గడం లేదు. అమెరికాను …చమురు ఆయువు పట్టు హోర్మూజ్ర్ దరి చేరనీయడం లేదు.


