Homeవిశ్లేషణజీ7, బ్రిక్స్‌ మధ్య సమతుల్యతే సవాల్

జీ7, బ్రిక్స్‌ మధ్య సమతుల్యతే సవాల్

- Advertisement -

డా॥ అరుణ్ మిత్ర

ఇటీవల జరిగిన జీ7 సదస్సుకు సభ్యదేశాలతో పాటు భారత్, బ్రెజిల్, దక్షిణ కొరియా, కెన్యా, ఉక్రెయిన్, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ వంటి దేశాలను కూడా ఆహ్వానించారు. ఇది ప్రపంచ రాజకీయాల్లో మారుతున్న శక్తి సమీకరణాలకు సంకేతంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించిన జీ7 దేశాలు ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలతో కలిసి పని చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నాయి. అయినప్పటికీ, వాటి విదేశాంగ విధానంలో సామ్రాజ్యవాద ధోరణి ఇంకా కొనసాగుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సోవియట్ యూనియన్ ఏర్పడిన తర్వాత ప్రపంచంలో వలసవాదం, సామ్రాజ్యవాదం క్రమంగా బలహీనపడింది. అనేక దేశాలు స్వాతంత్య్రం పొందాయి. అయితే, వలస పాలన కారణంగా ఆ దేశాలు ఆర్థికంగా వెనుకబడి ఉండటంతో పాటు తమ భద్రతా వ్యవస్థలను కూడా బలోపేతం చేసుకోలేకపోయాయి. ఈ పరిస్థితుల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలు కలిసి అలీనోద్యమాన్ని ఏర్పాటుచేసి పరస్పర సహకారం, శాంతి, అభివృద్ధికి కొత్త మార్గాలను అన్వేషించాయి. 1990లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత ప్రపంచం ఏకధ్రువ వ్యవస్థగా మారింది. అమెరికా తనను ఏకైక అగ్రరాజ్యంగా భావించి ప్రపంచ రాజకీయాలను శాసించేందుకు ప్రయత్నించింది. కానీ ఇటీవల ఇరాన్‌పై అమెరికా దాడి, ఆ తర్వాత ఏర్పడిన పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోలేకపోవడం వల్ల అమెరికా ప్రతిష్ఠ దెబ్బతిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే పశ్చిమాసియాలో అమెరికా ప్రధాన మిత్రదేశమైన ఇజ్రాయెల్ కూడా గాజా యుద్ధం నేపథ్యంలో తీవ్ర అంతర్జాతీయ విమర్శలు ఎదుర్కొంటోంది. అనేక దేశాలు ఇజ్రాయెల్ చర్యలను ఖండిస్తున్నాయి.మరోవైపు రష్యా-చైనా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతోంది. అదే సమయంలో బ్రిక్స్‌ అభివృద్ధి చెందుతున్న దేశాలకు పరస్పర సహకారం, వాణిజ్యం, అభివృద్ధి కోసం వేదికగా మారుతోంది.ప్రపంచం చాలా మారుతోంది. ఇప్పుడు సోవియట్ యూనియన్ నాటి కాలంలా లేదు, అలీన ఉద్యమం కాలంలా కూడా లేదు. పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో బ్రిక్స్‌ కొత్త అంతర్జాతీయ శక్తి కేంద్రంగా ఎదుగుతోందని భావిస్తున్నారు. చైనా ఆర్థిక, సైనిక రంగాల్లో వేగంగా ఎదగడం కూడా ప్రపంచ శక్తి సమీకరణాలను మార్చుతోంది. మరోవైపు, ఇరాన్-అమెరికా మధ్య చర్చలకు సహకరించిందనే వార్తలతో పాకిస్థాన్ అంతర్జాతీయ స్థాయిలో మళ్లీ ప్రాధాన్యం పొందుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ విషయానికి వస్తే, ప్రపంచానికి శాంతి, సహజీవనం సందేశం ఇచ్చే దేశంగా ఉన్న గుర్తింపు బలహీనపడిందనే విమర్శలు ఉన్నాయి. గత పదేళ్లలో భారత్ అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసింది. అయినప్పటికీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం లేదని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’పై ఆయన చేసిన వ్యాఖ్యలు, భారత ఉత్పత్తులపై సుంకాలు విధిస్తామని చేసిన హెచ్చరికలు, భారత్-అమెరికా వాణిజ్య చర్చల్లో అమెరికా ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వడం ఇందుకు ఉదాహరణలుగా పేర్కొంటున్నారు. అలాగే 2026 ఫిబ్రవరి 25న ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా భారత ప్రధాని అక్కడి పార్లమెంట్ నెస్సెట్‌లో చేసిన ప్రసంగం, ఇజ్రాయెల్‌తో రక్షణ రంగ సహకారాన్ని కొనసాగించడం వంటి అంశాలు చర్చకు దారి తీశాయి. గాజాలో జరుగుతున్న పరిణామాలపై అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్న సమయంలో భారత్ ఇజ్రాయెల్‌కు దగ్గరగా ఉందనే అభిప్రాయం బలపడిందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. అయితే, భారీ జనాభా, విస్తారమైన మార్కెట్ ఉన్న దేశంగా భారత్ను ఏ అగ్రరాజ్యమూ విస్మరించే అవకాశం లేదనేది మరో వాస్తవం.జీ7 సదస్సులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భారత ప్రధాని వ్యవహరించిన తీరు కూడా చర్చనీయాంశమైంది. దీనివల్ల భారత్ విదేశాంగ విధానం అమెరికాకు మరింత దగ్గరవుతోందనే అభిప్రాయం పెరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా ఒత్తిళ్ల నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ వైఖరిలో వచ్చిన మార్పులు స్పష్టంగా తెలిసింది. అలాగే జీ7 దేశాలు ఉక్రెయిన్‌కు పూర్తి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశంపై భారత్ తుది వైఖరి ఎలా ఉంటుందనే దానిపై కూడా ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది భారత్ బ్రిక్స్‌ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుండటంతో దేశ విదేశాంగ విధానంపై ప్రపంచ దృష్టి కేంద్రీకృతమైంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో ర్ఙుయో, బ్రిక్స్‌లో భారత్ తరచూ అమెరికా వైఖరికే మద్దతు ఇస్తుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను భారత ప్రభుత్వం బహిరంగంగా ఖండించలేదు. దీంతో బ్రిక్స్‌ సభ్యదేశాలు, గ్లోబల్ సౌత్ దేశాలు భారత్ నాయకత్వాన్ని ఎంతవరకు విశ్వసిస్తాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఈ సదస్సుకు హాజరవుతారా అనే అంశంపైనా చర్చ నడుస్తోంది. వచ్చే ఏడాది బ్రిక్స్‌కు చైనా అధ్యక్షత వహించనుంది.భారత్ బ్రిక్స్‌లో తన విశ్వసనీయతను, నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలంటే గ్లోబల్ సౌత్ దేశాల ప్రయోజనాల పట్ల నిబద్ధతను స్పష్టంగా చూపించాలి. అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికన్ డాలర్‌కు ప్రత్యామ్నాయ వ్యవస్థలను ప్రోత్సహించడం, అగ్రరాజ్యాల ప్రభావానికి అతీతమైన భద్రతా వ్యవస్థలను రూపొందించడం, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి, అభివృద్ధి సహకారాన్ని పెంచడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చివరగా, ప్రపంచ రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిస్థితుల్లో భారత్ ఎలాంటి విదేశాంగ విధానాన్ని అనుసరిస్తుందనేది అత్యంత కీలకమైన అంశం. భారత్ స్వతంత్ర విదేశాంగాన్ని కొనసాగిస్తూ బ్రిక్స్‌లో తన నాయకత్వాన్ని బలోపేతం చేస్తుందా లేక అమెరికాకు మరింత చేరువవుతుందా? అనే ప్రశ్నలకు సమాధానం రానున్న రోజుల్లో తెలుస్తుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు