Homeవిశ్లేషణఉద్యాన హబ్‌గా రాయలసీమ… ఉత్తి మాటే

ఉద్యాన హబ్‌గా రాయలసీమ… ఉత్తి మాటే

- Advertisement -

డా॥ టి.జనార్ధన్

ఎన్నికల సమయంలో రాయలసీమ రైతులకు నాయకులు ఎన్నో హామీలు ఇస్తున్నారు. “రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం”, “వ్యవసాయాన్ని పండుగగా మారుస్తాం”, “రాయలసీమను ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దుతాం” అనే మాటలు పాలకుల నోట వినిపిస్తున్నా…ఆచరణలో మాత్రం రైతు పరిస్థితి మారడం లేదు. తక్కువ వర్షపాతం, పరిమిత నీటిపారుదల, వరుస కరవులతో రాయలసీమ రైతులు ఆరుతడి పంటలపైనే ఆధారపడుతున్నారు. చీడపీడలను తట్టుకుని పంటను చేతికందించే సమయానికి మార్కెట్ మాయాజాలం రైతులను తీవ్ర నష్టాల్లోకి నెట్టేస్తోంది. గత మూడు దశాబ్దాలుగా రాయలసీమ నుంచి ఎన్నికవుతున్న ముఖ్యమంత్రులు రైతుల మార్కెటింగ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించలేకపోయారు. రాయలసీమలో పండే మామిడి, టమోటా, బొప్పాయి, ఉల్లి, అరటి, బత్తాయి వంటి ఉద్యాన పంటలకు దేశ, విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్నప్పటికీ రైతులకు గిట్టుబాటు ధర మాత్రం అందడం లేదు. దీంతో ధర ఉన్న పంటల వైపు రైతులు మొగ్గుచూపడం, చివరకు అధిక దిగుబడితో ధరలు కుప్పకూలి కోట్ల రూపాయల నష్టాలు చవిచూడడం ప్రతి ఏడాది పునరావృతమవుతోంది. రూ.30 వేల కోట్లతో రాయలసీమను ఉద్యాన హబ్‌గా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వాలు ప్రకటించినా, ఆ నిధులను ఎలా వినియోగిస్తారు ? రైతులకు ధరల భరోసా ఎలా కల్పిస్తారు ? అనే అంశాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. గిట్టుబాటు ధర కోసం రైతులు రోడ్డెక్కడం, పంటలను రోడ్డుపై పారబోయడం, నష్టాలతో కుంగిపోవడం సాధారణ దృశ్యాలుగా మారిపోయాయి.
ధరల స్థిరీకరణ నిధి ఎక్కడ ? 2000 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి కోసం రూ.3,000 కోట్లు కేటాయించి అనేక పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటించింది. ఉల్లికి క్వింటాల్‌కు రూ.770, అరటికి రూ.800,బత్తాయికి రూ.1,400, పసుపుకు రూ.6,850 ప్రకటించింది. కానీ ఆ తర్వాత రెండు దశాబ్దాలుగా ఈ ధరలను సవరించే ప్రయత్నం కూడా జరగలేదు. ముఖ్యంగా మామిడి, టమోటా, బొప్పాయి వంటి ప్రధాన ఉద్యాన పంటలకు కనీస మద్దతు ధరనే ప్రకటించలేదు.
మామిడి రైతుల దుస్థితి ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల్లో 3 లక్షల ఎకరాలకు పైగా మామిడి సాగవుతోంది. ఇందులో 70 శాతం తోతాపురి రకం పండుతోంది. ఈ పంటపై వేలాది మంది రైతులు ఆధారపడి జీవిస్తున్నారు. ఎనిమిదేళ్లుగా తోతాపురి మామిడికి గిట్టుబాటు ధర లేక ప్రతి ఏడాది రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. 2018లో కిలో రూ.3కే ధర పడిపోవడంతో ప్రభుత్వం రూ.2.50 ప్రోత్సాహకం ఇచ్చింది. అదే సమయంలో మామిడి బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించినా ఇప్పటివరకు ఆ హామీ అమలు కాలేదు. గత ఏడాది ప్రభుత్వం జోక్యంతో కిలో రూ.12 ధర నిర్ణయించినప్పటికీ, ఫ్యాక్టరీలు పూర్తి మొత్తాన్ని రైతులకు చెల్లించలేదు. ప్రభుత్వం రూ.4 ప్రోత్సాహకం ఇచ్చినా రైతులకు సుమారు రూ.250 కోట్ల మేర నష్టం వాటిల్లింది. రైతు సంఘాలు పోరాటం చేసినా బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదు.
ఈ ఏడాది కూడా అదే కథ : ఈ ఏడాది దిగుబడి 20 శాతం తగ్గినా ప్రభుత్వం రైతు సంఘాలతో చర్చించకుండా కిలో రూ.7.50 ధర నిర్ణయించింది. రైతుల లెక్కల ప్రకారం కిలో మామిడి పండించడానికి కనీసం రూ.15 ఖర్చవుతోంది. లాభం కలిపి కనీసం రూ.18 ధర ఉండాలని రైతు సంఘాలు కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అంతేకాదు, రూ.7.50గా ప్రకటించిన ధర కొద్ది రోజుల్లోనే రూ.7కు, ఆ తర్వాత రూ.6కు, ప్రస్తుతం రూ.5కు పడిపోయింది. ఇదే సమయంలో ర్యాంపుల వద్ద రైతుల నుంచి రూ.2 నుంచి రూ.3కే కొనుగోలు జరుగుతోందని ఆరోపణలు ఉన్నాయి. పర్మిట్ల మంజూరులో జాప్యం, రాజకీయ జోక్యం, కాయల అన్‌లోడింగ్ ఆలస్యం, ట్రాక్టర్ అద్దెల భారం, కాయలు కుళ్లిపోవడం వంటి సమస్యలు రైతులను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
కర్ణాటకలో మద్దతు… ఇక్కడ ఎందుకు లేదు ?
కేంద్ర ప్రభుత్వం గత ఏడాది కిలోకు రూ.14.80 ధరపై 25 శాతం సబ్సిడీ అందించింది. ఈ ఏడాది కర్ణాటక ప్రభుత్వం కిలోకు రూ.17.50 ధరకు కూడా 25 శాతం మద్దతు కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన మొత్తానికి కూడా భరోసా ఇచ్చి ఉంటే మామిడి రైతులకు గణనీయమైన ఊరట లభించేదని రైతు సంఘాలు అంటున్నాయి.
ప్రభుత్వం చేయాల్సిన చర్యలు : రాయలసీమ రైతాంగాన్ని ఆదుకోవాలంటే ప్రభుత్వం తక్షణమే ఈ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మామిడికి కిలోకు కనీసం రూ.18 గిట్టుబాటు ధర ప్రకటించాలి. రైతుల భాగస్వామ్యంతో ప్రత్యేక మామిడి బోర్డు ఏర్పాటు చేయాలి. టమోటా, బొప్పాయి వంటి ఉద్యాన పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలి. ఉల్లి, అరటి, బత్తాయి, పసుపు వంటి పంటల ధరలను పునఃసమీక్షించి సవరించాలి. పాడి రైతులకు లీటర్ పాలకు కనీసం రూ.50 ధరతో పాటు కర్ణాటక తరహాలో రూ.6 ప్రభుత్వ బోనస్ ఇవ్వాలి. పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే భరించాలి. ధరల స్థిరీకరణ నిధిని రూ.10 వేల కోట్లకు పెంచి మార్కెట్ ఒడిదుడుకుల నుంచి రైతులను రక్షించాలి. రాయలసీమను నిజంగా ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దాలంటే కేవలం భారీ పెట్టుబడుల ప్రకటనలు సరిపోవు. రైతుకు గిట్టుబాటు ధర, పారదర్శక మార్కెటింగ్ వ్యవస్థ, శాశ్వత ధరల భరోసా, మామిడి బోర్డు వంటి సంస్థాగత సంస్కరణలు అత్యవసరం. లేకపోతే ప్రతి సీజన్‌లో రైతులు రోడ్డెక్కి న్యాయం కోసం పోరాడాల్సిన దుస్థితి కొనసాగుతుంది. రైతు శ్రమకు తగిన విలువ దక్కినప్పుడే రాయలసీమ నిజమైన “ఉద్యాన హబ్‌” గా ఎదుగుతుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు