సాధారణంగా అవార్డులు తెచ్చుకునేవే తప్ప వచ్చేవి కావు. ప్రధానమంత్రి మోదీ విదేశాలకు వెళ్లినప్పుడల్లా ఏదో అవార్డు తెచ్చుకుంటూ ఉంటారు. మోదీ ప్రధానమంత్రి ఐనప్పటి నుంచి లెక్కలేనన్ని విదేశీ యాత్రలు చేశారు. ఈ యాత్రల వల్ల మన దేశానికి ఒరిగిందేమిటి అని ఆలోచిస్తే నిరాశ మిగులుతుంది. కానీ రికార్డు స్థాయిలో విదేశీ యాత్రలు చేసిన సంతృప్తి మాత్రం మోదీకు ఉంటుంది. ఇటీవలే మోదీ హిందూ మహాసముద్రంలోని ఓ చిన్న దేశమైన సెషెల్స్లో పర్యటించారు. అక్కడ ఆయనకు గార్డియన్ ఆఫ్ థి బ్లూ హారైజన్ అవార్డు ఇచ్చారు. మోదీ తెచ్చుకునే అవార్డుల్లో ఎప్పుడూ ఓ విశేషం ఉంటుంది. అలాంటి అవార్డులు ఆ దేశాలు మోదీ కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. అలాంటి అవార్డులు అంతకు ముందూ ఉండవు. ఆ తరవాతా ఉండవు. ఏ దేశానికి వెళ్లినా మోదీకి అవార్డు ఇచ్చారు అన్న పేరైతే ఉంటుంది. సెషెల్స్ చాలా చిన్న దేశం. మొత్తం భూభాగం 455 నుంచి 459 చదరపు కిలోమీటర్లే. అది 115 దీవుల సమూహం. ఇది ఆఫ్రికా తూర్పు తీరం నుంచి మడగాస్కర్ ఈశాన్య ప్రాంతం దాకా విస్తరించి ఉంటుంది.
ఇది ఆఫ్రికా ఖండంలో భాగమైనా హిందూ మహాసముద్రంలో కీలక ప్రాంతం కనక ఆసియా, ఆఫ్రికా, యూరప్ దేశాలను కలపడానికి ఉపకరిస్తుంది. సెషెల్స్‌తో మన సంబంధాలు వ్యూహాత్మకంగా అంటే సైనికపరంగా చాలా ప్రధానమైనవి. ఈ దేశానికి మనం సముద్ర రక్షణ కల్పిస్తుంటాం. కానీ హిందూ మహాసముద్రంలో చైనా హడావుడి పెరిగిన తరవాత సెషెల్స్‌తో మన సంబంధాలు కొంత అనుమానాస్పదంగా మారాయి. మోదీ సెషెల్స్ పర్యటన ఈ చైనా ప్రభావాన్ని నిలవరించడానికి తోడ్పడితే మంచిదే. సెషెల్స్ ఎంత చిన్న దేశం అంటే మొత్తం జనాభా లక్షా పాతిక వేలు. అంటే దిల్లీలో ఒక బస్తీలో అంతకన్నా ఎక్కువమందే ఉంటారు. 2015లోనూ మోదీ సెషెల్స్ సందర్శించారు. ఇది ఆయన రెండవ పర్యటన. ఈ సందర్భంగా ఆయనకు ఇచ్చిన అవార్డు విచిత్రమైంది. ఈ అవార్డుని ప్రత్యేకంగా మోదీ కోసమే ఏర్పాటు చేసినట్టున్నారు. సెషెల్స్ పార్లమెంటు ఈ అవార్డును మోదీ పర్యటనకు నాలుగు రోజుల ముందే ఏర్పాటు చేసింది. ఈ అవార్డు ఆ తరవాత రద్దు కూడా చేశారు. అంటే అవార్డు తతంగం మోదీని సంతృప్తిపరచడానికే అనుకోవాలి. ఇరాన్ మీద ఇస్రాయెల్, అమెరికా విరుచుకుపడడానికి రెండు రోజుల ముందు మోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించారు. అక్కడ కూడా ఆయనకు ఓ అవార్డు ఇచ్చారు. ఆ అవార్డు కూడా ఇంతకుముందు ఎవరికీ ఇవ్వలేదట. మోదీకి ఇంతదాకా 34 దేశాలు అవార్డులు ఇచ్చాయి. ఇందులో చాలా అవార్డులు అయితే అనామకమైనవి లేకపోతే అప్పటికప్పుడు హడావుడిగా ఏర్పాటు చేసి ఇచ్చి చేతులు దులిపేసుకున్న బాపతే. మోదీ ఎంత చిన్న దేశమైనా అక్కడ కాలు మోపి పావనం చేస్తుంటారు. పనిలో పనిగా అనామకమైందైనా ఓ అవార్డు మోసుకొస్తుంటారు. మోదీ మొదటిసారి ప్రధానమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినప్పుడు సార్క్ (దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం) దేశాల అధినేతలను ఆహ్వానించారు. అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్ దేశాల అధినేతలు మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. అధికారం చేపడుతున్న సమయంలోనే మోదీ చాలా సానుకూలమైన చర్య తీసుకున్నారని అనుకున్నాం. కానీ ఈ దేశాలు వేటితోనూ మన సంబంధాలు సవ్యంగా లేవు. అన్ని వేళలా మనకు అండగా ఉండే దేశం దుర్బిణీ వేసి చూసినా కనిపించదు. పాకిస్థాన్‌తో వైరం సరే సరి. మన చుట్టూ ఉన్న దేశాలలో ముస్లింల జనాభా ఆధిపత్య స్థానంలో ఉంటుంది.
మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ముస్లిం విద్వేష రాజకీయాల వల్ల ఆ దేశాల అధినేతలు మనతో సఖ్యంగా ఉండాలనుకున్నా ఆ దేశ ప్రజలు మెచ్చని దశకు నెట్టేశాం. మొత్తం మీద హిందూ మహాసముద్రంలో మన ప్రభావం తగ్గుతోంది. మాల్దీవుల్లో ఒకప్పుడు మన సైనిక స్థావరాలు ఉండేవి. మోదీ అధికారంలోకి వచ్చిన తరవాత మన సైనిక స్థావరాలకు ఎక్కడా చోటే లేకుండా పోయింది. మన చుట్టూ ఉన్న దేశాలను క్రమంగా చేరదీస్తోంది. భారీ ఎత్తున ఆర్థిక సహాయం చేస్తోంది. పెట్టుబడులు పెడ్తోంది. ఈ పరిణామాలన్నీ మనకు ప్రతికూలమైనవే. అదీకాక మన సరిహద్దులు దాటి వందలాది కిలోమీటర్లు లోపలికి వచ్చి చైనా నానా ఆగడాలు చేస్తోంది. రోడ్లు నిర్మిస్తోంది. అయినా మనం నోరు విప్పి మాట్లాడే స్థితిలో లేం. “వామ్మో! చైనా శక్తిమంతమైన దేశం. మనం ఏం అనగలం ” అని సాక్షాత్తు విదేశాంగ మంత్రి జైశంకరే అంటూ ఉంటే నోరెళ్లబట్టి చూడడం తప్ప చేసేదేమీ లేదు. సెషెల్స్లో మనం మోంగ్లా రేవు పట్టణాన్ని అభివృద్ధి చేయాల్సింది. ఆ ప్రాంతంలో రెండు ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఏర్పాటు చేయాల్సింది. కానీ సెషెల్స్ ఈ ప్రతిపాదనను వెనక్కు తీసుకుంది. ఈ రేవు పట్టణం మన తీరం నుంచి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే మనకు ఎంత కీలకమైందో అర్థం చేసుకోవచ్చు. వ్యూహాత్మకంగా సెషెల్స్ మనకు చాలా ముఖ్యమైందే. ఇదివరకు సెషెల్స్లో అసంప్షన్ దీవుల్లో మన సైనిక స్థావరం కాకపోయినా ఓ సైనిక కేంద్రం ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదిరింది. కానీ ఇది పూర్తిగా తమ అధీనంలో ఉంటుందని సెషెల్స్ అన్నప్పుడు 2018లో ఈ ఒప్పందం కాస్తా రద్దయింది. సెషెల్స్ ప్రతిపక్షాలు భారత సైనిక కేంద్రం ఉండడం తమ భద్రతకు, సార్వభౌమాధికారానికి ముప్పు అని భావించాయి. మోదీ సెషెల్స్ పర్యటన సందర్భంగా ఇలాంటి సమస్యలేవీ పరిష్కారం కాలేదు. మనం సెషెల్స్‌కు భారీగా ఆర్థిక సహాయం అందించడానికి ఒప్పందం కుదిరింది. అందులో కొంత భాగం సెషెల్స్ మనకు తిరిగి ఇవ్వనక్కర్లేదు. నేరస్థులను ఇచ్చి పుచ్చుకోవడానికీ ఒప్పందం కుదిరింది. మోదీ ఎక్కడికి వెళ్లినా అదానీ వ్యాపారాభివృద్ధికి ఏదో ఓ ఏర్పాటు చేస్తారు. సెషెల్స్లో అలాంటిదేమైనా ఉందో లేదో కొద్ది రోజుల తరవాతగానీ బయటకు రాదు. సెషెల్స్‌తో ఎన్ని ఒప్పందాలు కుదిరినా అవన్నీ మనం సెషెల్స్‌కు తోడ్పడేవే. అక్కడ మన సైన్యాలను నిలపడానికి ఏ ఒప్పందమూ కుదిరినట్టు లేదు. బంగ్లా, మాల్దీవుల లాంటి దేశాలలో భారత వ్యతిరేక భావాలు పెరిగిపోతున్న దశలో సెషెల్స్‌తో మైత్రి మంచిదే. కానీ దాని వల్ల ఆ దేశానికే ప్రయోజనం. సెషెల్స్ మంచి పర్యాటక కేంద్రం అంటారు. మోదీ పనిలో పనిగా ఆ అందాలు అనుభవించి ఉంటారు.
మోదీ సెషెల్స్ పర్యటన ఆంతర్యం
- Advertisement -


