ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పొగాకు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. నిన్నమొన్నటి వరకు వాణిజ్య పంటల్లో రారాజుగా వెలిగి, ప్రభుత్వాలకు కోట్ల రూపాయల విదేశీ మార్పిడి ద్రవ్యాన్ని, పన్నుల రూపంలో భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టిన పొగాకు సాగు..నేడు రైతులకు కన్నీళ్లను మిగుల్చుతోంది. తమ సమస్యలను పరిష్కరించాలని, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రైతులు రోడ్డెక్కి నిరసనలు ప్రదర్శిస్తున్నా, పాలకుల నుంచి ఆశించిన స్పందన కరువ్వడం శోచనీయం. నిరంతర శ్రమ, పెట్టుబడుల భారం, ఆపై పాలకుల ఉదాసీనత వెరసి పొగాకు రైతాంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయి. గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ పది రోజుల క్రితం పొగాకు రైతులు వందలాది ట్రాక్టర్లతో ఒంగోలు పట్టణంలో ఆందోళనకు దిగారు. కార్పొరేట్ కంపెనీలు సిండికేట్‌గా మారి దగా చేస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తంచేశారు. వారి ఆవేదన అర్థవంతమైనదే. భారతదేశంలో పొగాకు సాగు, దాని అనుబంధ రంగాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 4.5 కోట్ల మంది ఆధారపడి జీవిస్తున్నారు. ఇందులో సుమారు 46 లక్షల మంది కేవలం సాగు రంగంలో ఉన్న రైతులు, కూలీలే. దేశవ్యాప్తంగా ముఖ్యంగా వర్జీనియా (ఎఫ్‌సీవీ) పొగాకు సాగులో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలోని ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. ఏపీలోనే దాదాపు 80,000 నుండి ఒక లక్ష మంది వరకు నమోదిత పొగాకు రైతులు ఉన్నారు. నాణ్యమైన వర్జీనియా పొగాకును పండిస్తూ అంతర్జాతీయ మార్కెట్లో భారతదేశం కీర్తిని పెంచడంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన రైతాంగం నేడు రోడ్డెక్కి పోరాడాల్సిన పరిస్థితి రావడం వ్యవస్థాగత లోపాలకు అద్దం పడుతోంది. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ప్రభుత్వాలకూ ఎరుకే. పొగాకు సాగు సాధారణ పంటల వంటిది కాదు. ఇది అత్యంత శ్రమతో కూడిన, భారీ పెట్టుబడులు అవసరమయ్యే వాణిజ్య పంట. ప్రస్తుత తరుణంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మార్కెట్లో వ్యాపారుల సిండికేట్ మాఫియా. పొగాకు బోర్డు ఆధ్వర్యంలో వేలం కేంద్రాలు నిర్వహిస్తున్నప్పటికీ, కొనుగోలుదారులు (కంపెనీలు, వ్యాపారులు) సిండికేట్‌గా మారి ధరలను నియంత్రిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పటికీ, కావాలనే గ్రేడుల వారీగా ధరలను తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. దిగుబడి, నాణ్యత దెబ్బతినడం ఇంకో సమస్య. వాతావరణ మార్పులు, అకాల వర్షాలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పొగాకు రంగు మారిపోతోంది. నాణ్యత తగ్గిందనే నెపంతో వ్యాపారులు మద్దతు ధర ఇవ్వడానికి నిరాకరించడం ఒకింత బాధాకరమే. అలాగే, ఆకాశాన్నంటిన పెట్టుబడి వ్యయం పొగాకు రైతును ఊపిరి సలపనివ్వడం లేదు. ఎరువులు, పురుగుల మందులు, బొగ్గు (పొగాకు క్యూరింగ్ కోసం వాడే ఇంధనం), కూలీల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. బేరన్ల నిర్వహణ ఖర్చు ఏటా రెట్టింపవుతోంది. కానీ, దానికి అనుగుణంగా మార్కెట్ ధరలు పెరగడం లేదు. ఇవన్నీ ఒకెత్తయితే, పొగాకు బోర్డు ఉదాసీనత మరో ఎత్తు. రైతు ప్రయోజనాలను రక్షించాల్సిన పొగాకు బోర్డు, కేవలం కొనుగోలుదారులకే వత్తాసు పలుకుతోందనే విమర్శలు ఉన్నాయి. పంట మార్కెటింగ్‌లో బోర్డు సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల రైతులు దళారుల చేతిలో మోసపోతున్నారు. ఇది పచ్చి నిజం, సర్వవిదితం. ప్రభుత్వ విధానాలు, పన్నుల భారం పొగాకు రైతును ఇంకా కుదేలు చేస్తున్నది. పొగాకు ఉత్పత్తులపై ప్రభుత్వం విధిస్తున్న అధిక పన్నులు (జీఎస్టీ, అదనపు సుంకాలు) పరోక్షంగా ముడి పొగాకు ధరలపై ప్రభావం చూపుతున్నాయి.
అంతర్జాతీయంగా పొగాకు వాడకాన్ని తగ్గించాలనే నిబంధనలు (ప్రపంచ ఆరోగ్య సంస్థ`డబ్లుయూహెచ్ఓ గైడ్‌లైన్స్) ఉన్నప్పటికీ, ప్రత్యామ్నాయ పంటల వైపు రైతును మళ్లించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. పొగాకు రైతుల సమస్యలు తాత్కాలిక ఉపశమనాలతో తీరేవి కావు. దీనికి దీర్ఘకాలిక, స్థిరమైన ప్రణాళికలు అవసరం. ధరల పతనం, సిండికేట్ల సమస్యకు కాస్తయినా పరిష్కారం దొరకాýంటే, కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) గ్యారెంటీ చట్టం తేవాలి. వ్యాపారుల సిండికేట్‌ను బద్దలు కొట్టడానికి బోర్డు జోక్యం చేసుకోవాలి. పెట్టుబడి భారం తగ్గించాలంటే, క్యూరింగ్ కోసం వాడే బొగ్గు, సబ్సిడీ ధరలపై ఎరువులను ప్రభుత్వమే నేరుగా సరఫరా చేయాలి. అలాగే, ప్రకృతి నష్టాల నుంచి బయటపడాలంటే, వాతావరణ మార్పుల వల్ల దెబ్బతిన్న పంటకు తక్షణమే బీమా పరిహారం అందేలా నిబంధనలు సరళీకరించాలి. అలాగని పొగాకు రైతుకు ప్రత్యామ్నాయాలు లేకపోలేదు. పొగాకు పంట మానేయాలనుకునే రైతులకు లాభసాటి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లేలా ప్రోత్సాహకాలు ఇవ్వాలి. కనీస మద్దతు ధర భరోసా దక్కకుండా రైతుకు ఉపశమనం ఉంటుందని ఆశించలేం. పొగాకు బోర్డు కేవలం వేలాన్ని పర్యవేక్షించే సంస్థగా కాకుండా, రైతులకు గిట్టుబాటు ధర కల్పించే రక్షక కవచంగా మారాలి. వ్యాపారులు తక్కువ ధరకు అడిగితే, ప్రభుత్వమే జోక్యం చేసుకుని మార్కెట్ స్టెబిలైజేషన్ ఫండ్ ద్వారా పొగాకును కొనుగోలు చేయాలి. అంతేగాకుండా, అంతర్జాతీయ మార్కెటింగ్‌పై దృష్టి పెట్టాల్సిన తరుణమిది. భారతీయ పొగాకుకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇతర దేశాలతో దౌత్యపరమైన చర్చలు జరిపి ఎగుమతులను ప్రోత్సహించాలి. దీనివల్ల దేశీయంగా వ్యాపారుల ఏకఛత్రాధిపత్యానికి అడ్డుకట్ట పడుతుంది. పెట్టుబడి సబ్సిడీలు దక్కాలి. పొగాకు బేరన్ల నిర్వహణకు అయ్యే విద్యుత్ ఛార్జీలలో రాయితీ ఇవ్వాలి. క్యూరింగ్‌కు ప్రత్యామ్నాయ ఇంధన వనరులను (ఉదాహరణకు బయోమాస్ బ్రిక్స్) సబ్సిడీపై అందించాలి. ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం తప్పనిసరిగా ఉండాలి. పొగాకు సాగును క్రమంగా తగ్గించాలనేది అంతర్జాతీయ విధానం అయినప్పుడు, రైతులకు నష్టం లేని ఇతర వాణిజ్య పంటలు (ఔషధ మొక్కలు, తోటపని పంటలు) సాగు చేసేలా శాస్త్ర సాంకేతిక సహాయం, ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలి. దేశ ఆర్థిక వ్యవస్థకు వేల కోట్ల రూపాయల రెవెన్యూ అందిస్తున్న పొగాకు రైతును అనాధను చేయడం ఏ ప్రభుత్వానికైనా తగదు. అన్నదాతలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పొగాకు బోర్డు మొద్దునిద్ర వీడి ఉమ్మడిగా స్పందించాలి. తక్షణమే రైతు ప్రతినిధులతో చర్చలు జరిపి, గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలి. పొగాకు రైతుల కన్నీళ్లను తుడవడం పాలకుల కనీస కర్తవ్యం.
పొగాకు రైతుల కన్నీటిగాథ!
- Advertisement -


