కృష్ణ కానూరి
ధనబలం, రాజకీయ పలుకుబడి ఉంటే ప్రపంచంలో ఏదైనా సాధ్యమేనా? న్యాయాన్ని కూడా కొనేయవచ్చా ? ఈ ప్రశ్నలకు అమెరికా ఫెడరల్ కోర్టు గట్టి సమాధానమిచ్చింది. భారతీయ పారిశ్రామిక దిగ్గజం, ప్రపంచ కుబేరులలో ఒకరైన గౌతమ్ అదానీపై నమోదైన హై-ప్రొఫైల్ లంచం, మోసం కేసులో ఒక అద్భుతమైన న్యాయపోరాటం తెరపైకి వచ్చింది. అదానీపై ఉన్న క్రిమినల్ ఆరోపణలను కొట్టేయాలంటూ ట్రంప్ ప్రభుత్వం వేసిన అభ్యర్థనను బ్రూక్లిన్ ఫెడరల్ జడ్జి నికోలస్ గరౌఫిస్ తిరస్కరించారు. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీతో పాటు ఇతర నిందితులపై ఉన్న క్రిమినల్ కేసును ఉపసంహరించుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయంపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసును ఎందుకు వదిలేస్తున్నారో వివరిస్తూ ప్రభుత్వం సమర్పించిన నివేదిక ‘సంక్షిప్తంగా, చప్పగా, ముక్తసరిగా’ ఉందే తప్ప అందులో స్పష్టత లేదని జడ్జి గరౌఫిస్ దుయ్యబట్టారు. ‘ప్రభుత్వ నివేదిక ఆధారంగా కోర్టు ఏ నిర్ణయానికి రాలేదు, కనీసం దీనిపై విశ్లేషణ కూడా చేయలేదు’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ కేసును ఎందుకు ఉపసంహరించుకోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్క కారణాన్ని ఆధారాలతో, పూర్తి నివేదిక రూపంలో జూలై 13లోగా సమర్పించాలని అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్‌ను కోర్టు ఆదేశించింది. అప్పటివరకు కేసు కొట్టివేతపై ఎటువంటి నిర్ణయం తీసుకోబోమని తేల్చిచెప్పింది.
అసలు కేసు ఏమిటి : 2024 చివర్‌లో జోబైడెన్ ప్రభుత్వ హయాంలో ఈ కేసు నమోదైంది. భారత్‌లో భారీ సోలార్ పవర్ ప్లాంట్ కాంట్రాక్ట్‌ను దక్కించుకోవడం కోసం అదానీ గ్రూప్ భారత ప్రభుత్వ అధికారులకు రూ.2,500 కోట్లు (265 మిలియన్ డాలర్లు) లంచాలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుందని అమెరికా అధికారులు ఆరోపించారు. తాము అవినీతి రహిత విధానాలను పాటిస్తున్నామని నమ్మబలుకుతూ అమెరికా పెట్టుబడిదారులను మోసం చేసి నిధులు సేకరించారని అదానీపై సెక్యూరిటీస్ ఫ్రాడ్, వైర్ ఫ్రాడ్ కేసులు పెట్టారు. ఐతే డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక, ఈ కేసులో ఊహించని మలుపులు చోటుచేసుకున్నాయి. ట్రంప్‌నకు వ్యక్తిగత న్యాయవాది అయిన రాబర్ట్ గియుఫ్రాను తన తరఫున వాదించడానికి అదానీ నియమించుకున్నారు. గియుఫ్రా బృందంలోని జేమ్స్ మెక్డొనాల్డ్ అనే మరో లాయర్‌ను ట్రంప్ ప్రభుత్వం మాన్హాటన్ టాప్ ఫెడరల్ ప్రాసిక్యూటర్‌గా ఎంపిక చేసింది. ఈ రాజకీయ, న్యాయ సత్సంబంధాల నేపథ్యంలోనే మే నెలలో జస్టిస్ డిపార్ట్‌మెంట్ ఈ కేసును వెనక్కి తీసుకోవాలని సంచలన నిర్ణయం తీసుకుంది.
తెరవెనుక రూ.94 వేల కోట్ల భారీ డీల్ : అదానీపై క్రిమినల్ కేసును ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వం చెప్పిన కారణం ‘దీనిపై మరిన్ని వనరులను కేటాయించలేము’ అని మాత్రమే. కానీ, దీని వెనుక భారీ వ్యూహం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం తెలుస్తోంది. ఒకవేళ ఈ క్రిమినల్ కేసును కొట్టేస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఏకంగా రూ.94,360 కోట్లు (10 బిలియన్ల డాలర్లు) పెట్టుబడులు పెడతామని, తద్వారా 15,000 ఉద్యోగాల సృష్టికి సహాయపడతామని అదానీ లాయర్లు ప్రభుత్వానికి ఆశ చూపినట్లు ‘న్యూయార్క్ టైమ్స్’ నివేదించింది. ఈ ప్రతిపాదన అమెరికా రాజకీయాల్లో దుమారం రేపింది. కేసుల మాఫీ కోసం పెట్టుబడులను ఆశ చూపడం ‘కిÇడ్ ప్రో కో’ (ఒకదానికి బదులు మరొకటి-లంచం వంటిదే) అని డెమొక్రాటిక్ సెనేటర్లు ఆరోపించారు. దేశంలో చట్ట నియమాలను పక్కనబెట్టి, కార్పొరేట్ శక్తులకు ట్రంప్ ప్రభుత్వం తలొగ్గుతోందని విమర్శలు గుప్పించారు. విచిత్రమేమిటంటే, ఈ కేసును ఉపసంహరించుకోవాలని వాషింగ్టన్‌లోని ఉన్నతాధికారులు నిర్ణయించినప్పుడు, అప్పటివరకు క్షేత్రస్థాయిలో కేసును దర్యాప్తు చేసిన కెరీర్ ప్రాసిక్యూటర్లు ఎవరూ ఆ లేఖపై సంతకం చేయలేదు. ప్రభుత్వ ఒత్తిడికి నిరసనగా ఇద్దరు న్యాయశాఖ లాయర్లు ఈ కేసు నుంచే తప్పుకున్నారు. ఇది జస్టిస్ డిపార్ట్‌మెంట్ లోపల జరిగిన అంతర్గత ఘర్షణను బయటపెట్టింది. క్రిమినల్ కేసుల సంగతి ఎలా ఉన్నా, అమెరికా మార్కెట్స్ రెగ్యులేటర్ (ఎస్.ఇ.సి) వేసిన సివిల్ కేసులలో అదానీ గ్రూప్ ఇప్పటికే రాజీపడింది. ఇందులో భాగంగా గౌతమ్ అదానీ రూ.56.6 కోట్లు (6 మిలియన్ల డాలర్లు), సాగర్ అదానీ రూ.113.2 కోట్లు (12 మిలియన్ డాలర్లు) జరిమానా చెల్లించేందుకు అంగీకరించారు. ఇరాన్ ఆంక్షల ఉల్లంఘన ఆరోపణలపై అదానీ ఎంటర్ప్రైజెస్ అమెరికా ట్రెజరీకి రూ.2,595 కోట్లు (275 మిలియన్ డాలర్లు) భారీ పెనాల్టీ చెల్లించడానికి అంగీకరించడం గమనార్హం.
అదానీ గ్రూప్ వాదన : తాము ఎలాంటి తప్పు చేయలేదని అదానీ గ్రూప్ గట్టిగా సమర్థించుకుంటోంది. అమెరికా చట్టాల పరిధి దాటి ఈ కేసు పెట్టారని, భారతదేశంలో జరిగినట్లు చెబుతున్న లంచాల ఆరోపణలను నిరూపించడానికి ప్రాసిక్యూటర్ల వద్ద సరైన ఆధారాలు లేవని అదానీ లాయర్ రాబర్ట్ గియుఫ్రా వాదించారు. ఈ బలహీనతల వల్లే ప్రభుత్వం కేసును ఉపసంహరించుకోవాలని చూస్తోందన్నారు. ఏది ఏమైనప్పటికీ, అధికారంలో ఉన్న ప్రభుత్వం ఒక పెద్ద కార్పొరేట్ శక్తులతో చేతులు కలిపి కేసును నీరుగార్చాలని చూసినప్పుడు, న్యాయవ్యవస్థ అడ్డుకట్ట వేసింది. జూలై 13న జస్టిస్ డిపార్ట్‌మెంట్ ఇచ్చే నివేదిక ఆధారంగానే అదానీ భవితవ్యం తేలనుంది. గ్లోబల్ బిజినెస్ సామ్రాజ్యాలు ఎంతటివైనా సరే… న్యాయస్థానం ముందు జవాబుదారీగా ఉండాల్సిందేనని బ్రూక్లిన్ కోర్టు ఇచ్చిన ఈ మైలురాయి లాంటి నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా సామాన్యుడికి న్యాయంపై నమ్మకాన్ని పెంచింది.
500 పేజీల తిరుగుబాటు… లోపభూయిష్టమైన దర్యాప్తు ? అదానీ లాయర్ రాబర్ట్ గియుఫ్రా కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం ఈ కేసును రద్దు చేయించుకోవడం వెనుక వారి వ్యూహం పనిచేసింది. జస్టిస్ డిపార్ట్‌మెంట్ అధికారులతో అదానీ లాయర్ల బృందం కీలక సమావేశాలు నిర్వహించి, ఈ దర్యాప్తులో ఉన్న లోపాలను ఎండగడుతూ 500 పేజీల నివేదికను అందజేసింది. అమెరికా చట్టాల పరిధి దాటి ఈ కేసు పెట్టారని, భారతదేశంలో జరిగినట్లు చెబుతున్న ఆరోపణలను నిరూపించడానికి ప్రాసిక్యూటర్ల వద్ద అసలు ఆధారాలే లేవని వారు వాదించారు. ‘ప్రభుత్వం ఈ కేసును ఉపసంహరించు కోవాలనే నిర్ణయానికి రావడం చట్టపరంగా, వాస్తవంగా ప్రాసిక్యూషన్ దర్యాప్తులో ఉన్న బలహీనతలను నిష్పక్షపాతంగా ఒప్పుకోవడమే’ అని గియుఫ్రా కోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం స్వయంగా కేసును వెనక్కి తీసుకుంటున్నప్పుడు, ఫెడరల్ కోర్టు ఆలస్యం చేయకుండా క్లియర్ చిట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, కింది స్థాయి దర్యాప్తు అధికారులు సంతకం చేయని ఈ ముక్తసరి ఉపసంహరణ వెనుక అసలు రహస్యాన్ని జూలై 13 లోగా బయటపెట్టాల్సిందేనని జడ్జి గరౌఫిస్ పట్టుబట్టడంతో ఇప్పుడు బంతి మళ్లీ ట్రంప్ ప్రభుత్వం కోర్టులోకి చేరింది.
సెల్ : 7981305779


