Homeవిశ్లేషణఅవినీతి విషవృక్షం-వ్యవస్థీకృత మాయాజాలం

అవినీతి విషవృక్షం-వ్యవస్థీకృత మాయాజాలం

- Advertisement -

డా॥ సూర్యదేవర రామకృష్ణ

ఈ దేశపు నేలపై పుట్టిన ప్రతి మనిషీ, ప్రతి పౌరుడూ గుండె మీద చేయి వేసుకుని అడగాల్సిన అసలు సిసలైన ప్రశ్న ఒకటుంది. అసలు నేను జీవిస్తున్నానా, లేదా కేవలం బతుకుతున్నానా ? పైకి చూడటానికి ఈ రెండూ ఒకేలా అనిపించినా, వీటి మధ్య ఉన్న తేడా అగాధమంత. జీవించడం అంటే కేవలం శ్వాసించడం కాదు, అదొక సమున్నత భావన. గౌరవంగా, స్వేచ్ఛగా, సామాజిక న్యాయాన్ని ఆస్వాదిస్తూ బతకడం. మరి బతకడం అంటే ? ఈ కుళ్లిన వ్యవస్థ విసిరేసే ఎంగిలి మెతుకుల కోసం, రాజకీయ పెద్దలు గీసిన లక్ష్మణ రేఖల మధ్య, వారి స్వార్థ సామ్రాజ్యానికి ఊడిగం చేసే ఒక సజీవ సాధనంగా మగ్గిపోవడం. దురదృష్టవశాత్తూ, నేడు ఈ దేశంలో కోట్లాది మంది బతుకుతున్నారు తప్ప జీవించడం లేదు. ఈ చేదు నిజాన్ని అంగీకరించడానికి మనకు ఇంకా ఎన్ని దశాబ్దాలు కావాలి ? మన రాజకీయ వ్యవస్థ ఏ ఆకాశం నుండో, ఊహాలోకం నుండో ఊడిపడలేదు. అది కచ్చితంగా మన సామాజిక నేల నుండే మొలిచింది. కులం, మతం, భాష, ప్రాంతం ఇవన్నీ ఒకప్పుడు సమాజంలో ఐక్యతకు, ఒకరినొకరు గుర్తించుకోవడానికి మూలాధారాలుగా ఉండేవి. కానీ, నేటి కలర్ ఫుల్ రాజకీయ నేతలు వీటన్నింటినీ పదునైన ఆయుధాలుగా మార్చేశారు. ప్రజలను ఏకం చేయడానికి కాదు, వారి మధ్య శాశ్వత గోడలు నిర్మించడానికి ! సమస్యలను పరిష్కరించడానికి కాదు, వాటిని మరింత జటిలం చేసి పబ్బం గడుపుకోవడానికి. ఓట్ల పంట పండించుకోవడానికి, అధికారాన్ని తమ వారసత్వ ఆస్తిగా మార్చుకోవడానికి, ప్రజాధనంతో జేబులు నింపుకోవడానికి ఈ భావోద్వేగాలను వారు ముడిసరుకుగా వాడుకుంటున్నారు. ఎన్నికలు రాగానే కులం పేరుతో ఓట్లు అడుగుతారు కానీ, క్షేత్రస్థాయిలోకి వెళ్తే అన్ని కులాల్లోనూ పేదరికం తాండవిస్తూనే ఉంటుంది. మతం పేరుతో చిచ్చు పెట్టి భావోద్వేగాల గ్రాఫ్ పెంచుతారు కానీ, ఏ మతానికి చెందిన పేద బిడ్డకూ సరైన నాణ్యమైన చదువు అందించడం లేదు. ప్రాంతాల పేరుతో సెంటిమెంట్లు రగిల్చి అభివృద్ధి వాగ్దానాల వర్షం కురిపిస్తారు కానీ, ఏ ప్రాంతమైనా సమగ్రంగా, సంపూర్ణంగా వికసించిందా అంటే సమాధానం శూన్యం. ఇది కాకతాళీయం కాదు, పక్కా స్కెచ్! ప్రజలు అసలు సమస్యను చూడకుండా, తెర వెనుక ఉన్న అసలు శత్రువును గుర్తించకుండా, ప్రశ్నించే గొంతులను నొక్కేసే ఒక వ్యవస్థీకృత మాయాజాలం. చాలా మంది అవినీతిని సమాజానికి పట్టిన ఒక తాత్కాలిక వ్యాధిగా భావిస్తారు. కానీ అది తప్పు. అది వ్యాధి కాదు, ఈ దేశంలో అదొక తిరుగులేని పరిపాలనా వ్యవస్థగా రూపాంతరం చెందింది. వ్యాధి వస్తే మందులతో నయం చేయవచ్చు. కానీ, ఈ అవినీతి సామ్రాజ్యం స్వయంగా మందులను, ఆ మందులు ఇచ్చే డాక్టర్లను, హాస్పిటళ్లను కూడా తన గుప్పెట్లోకి తీసేసుకుంది. ఒక్కసారి మన కళ్లు తెరిచి చూస్తే, ఈ దేశంలో అవినీతి ఊబిలో కూరుకుపోని రంగం ఏదైనా ఉందా? విద్యారంగం స్కూళ్ల నిర్మాణంలో కాంట్రాక్టుల లీలలు, టీచర్ల పోస్టుల భర్తీలో లక్షల లావాదేవీలు, పేద పిల్లల మిడ్-డే మీల్స్‌ నిధుల దోపిడీ, యూనివర్సిటీ సీట్ల బ్లాక్ మార్కెటింగ్ నేడు విద్య అనేది ఒక పవిత్రమైన జ్ఞాన మార్గం కాదు, అదొక కార్పొరేట్ బిజినెస్ డీల్. వైద్యరంగం చూస్తే ప్రభుత్వ ఆస్పత్రులకు రావాల్సిన ఉచిత మందులు బ్లాక్‌లో మాయమవుతాయి, నియామకాల్లో అక్రమాలు రాజ్యమేలుతుంటాయి. గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు వెలవెలబోతుంటాయి. పేదవాడు ప్రాణాలు నిలబెట్టుకోవడానికి అప్పులపాలు కావాల్సిందే. ఐదేళ్లలో ఒకే ఒక్క రోజు మీరు రాజులు. ఆ రోజే ఓటు వేసే రోజు. మిగిలిన 1,824 రోజులూ మీరు కేవలం సేవకులు, యాచకులు. దీనిని ప్రజాస్వామ్యం అందామా? రాజకీయ నాయకులు ఎంత నైపుణ్యంతో, మైండ్ గేమ్‌తో మన సామాజిక గుర్తింపులను వాడుకుంటున్నారంటే కులాల మధ్య కృత్రిమ పోరాటాలు సృష్టించి ఇరువైపులా ఓట్లు కొల్లగొడతారు. ప్రాంతాల మధ్య అసమానతలను అలాగే ఉంచుతారు, ఎందుకంటే ఆ వెనుకబాటుతనమే వారి రాజకీయ మనుగడకు ఇంధనం. నేడు ప్రజలు చదువుకుంటున్నారు. చేతిలో గ్లోబల్ స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి, ప్రపంచాన్ని చూస్తున్నారు. కానీ, పాలకుల పొలిటికల్ నెరేటివ్స్‌ అందించే భావోద్వేగ మత్తులో జోగుతున్నారు. ఇది అమాయకత్వం కాదు, పాలకుల స్క్రిప్ట్ ప్రకారం సాగుతున్న ప్రణాళికాబద్ధమైన అజ్ఞానం. అభివృద్ధి ఈ దేశంలో అత్యంత దారుణంగా దుర్వినియోగమవుతున్న అర్థం పర్థం లేని పదం. నాలుగు లేన్ల రోడ్లు వేస్తే అభివృద్ధి, కానీ ఆ రోడ్లు ఎవరి ఫామ్ హౌస్‌కు వెళ్తున్నాయి. మెరిసిపోయే విమానాశ్రయాలు కడితే అభివృద్ధే, కానీ అందులో ఎంతమంది సామాన్యులు ప్రయాణించగలరు ? మెట్రో రైళ్లు నడిపితే అద్భుతమైన అభివృద్ధే, కానీ రోజువారీ కూలీ ఇప్పటికీ విరిగిన సైకిల్ పైనే కిలోమీటర్ల కొద్దీ ప్రయాణిస్తున్నాడు. గణాంకాలలో జీడీపీ పెరుగుతోంది, కార్పొరేట్ గ్రాఫు దూసుకుపోతున్నాయి. ఇది అభివృద్ధి కాదు లీగల్ దోపిడీ. ప్రభుత్వ పథకాలు ప్రకటించినప్పుడు లక్ష కోట్లు అని మైకుల్లో ఊదరగొడతారు. బడ్జెట్ నుంచి క్షేత్రస్థాయికి వచ్చేసరికి నిధులు కరిగిపోతాయి, మధ్యలో దళారులు, లీడర్ల జేబులు నిండుతాయి. చివరకు లబ్ధిదారుడి చేతికి చేరేది కేవలం పది శాతం మాత్రమే. ఇది కాకి లెక్క కాదు, ఆడిట్ నివేదికలు చెబుతున్న సత్యం. కానీ ఇక్కడ ఎవరికీ జవాబుదారీతనం లేదు, ఎందుకంటే ఆ జవాబుదారీతనాన్ని ప్రశ్నించే వ్యవస్థలన్నీ పాలకుల జేబుల్లో బందీలయ్యాయి. కేవలం రాజకీయ పార్టీని మారిస్తే ఈ రోగానికి ముక్తి దొరుకుతుందా? ఒకవేళ అదే నిజమైతే ఈ పాటికి దేశం ఎప్పుడో బాగుపడేది. గత ఐదారు దశాబ్దాలుగా ఎన్నో రంగుల జెండాలు మారాయి, ఎందరో నాయకులు సింహాసనాలు ఎక్కారు, దిగారు. కానీ అవినీతి మాత్రం ఇంకా బలంగా తయారైంది. ఎందుకంటే ఇక్కడ ముఖాలు మారుతున్నాయి తప్ప, వ్యవస్థ మారడం లేదు. అందుకే పరిష్కారం నాయకులను మార్చడంలో లేదు, మనం బతుకుతున్న వ్యవస్థను ప్రక్షాళన చేయడంలో ఉంది. తొలి అడుగు మన సమస్యలకు అసలు కారణం కులం కాదు, కులాన్ని వాడుకుని దోచుకునే పొలిటికల్ సిస్టమ్. మతం సమస్య కాదు, మతాన్ని ఓట్ల మార్కెట్‌గా మార్చే నాయకత్వం అసలు విలన్. ఈ స్పృహ ప్రజల్లో రావాలి. రెండో అడుగు ప్రజాప్రతినిధి అనేవాడు మన నేవకుడే తప్ప పాలకుడు కాదు. మన పన్నుల సొమ్ము, ప్రతి పైసా ఎలా ఖర్చు పెట్టారో నిలదీయాలి. కేవలం ఐదేళ్లకు ఒకసారి ఓటు వేసేటప్పుడు కాదు, ప్రతి రోజూ, ప్రతి వీధిలోనూ ప్రశ్నించడం అలవాటు కావాలి. మూడో అడుగు ఒంటరిగా ప్రశ్నించే గొంతును ఈ వ్యవస్థ చాలా సులభంగా నొక్కేస్తుంది, నిశ్శబ్దం చేస్తుంది. కానీ, లక్షలాది గొంతులు ఒకేసారి న్యాయం కోసం గర్జిస్తే, ఏ నిరంకుశ వ్యవస్థా తట్టుకోలేదు, మోకరిల్లక తప్పదు. ఈ విశ్లేషణ చదివిన తర్వాత మీ రక్తంలో కాస్త కోపం ప్రవహిస్తే అది మీరు ఇంకా సజీవంగా ఉన్నారనడానికి సంకేతం. ఒకవేళ తీవ్రమైన నిరాశ ఆవహిస్తే అది ప్రస్తుత పరిస్థితిని చూసి కలగడం సహజం. కానీ, ఆ నిరాశతోనే చేతులు ముడుచుకుని కూర్చుంటే, ఈ దుర్మార్గపు వ్యవస్థ గెలిచినట్టే, మనం ఓడినట్టే. ఈ దేశంలో మార్పు అసాధ్యమేమీ కాదు. కానీ ఆ మార్పు ఎక్కడి నుంచో, పైనుంచి కార్పొరేట్ సూట్లలో రాదు, అది కచ్చితంగా ప్రజల గుండెల నుంచే, క్షేత్రస్థాయి నుంచే ఉప్పెనలా రావాలి. మిమ్మల్ని కేవలం ఓట్ల యంత్రాలుగా వాడుకుంటున్న వారి ముసుగులను తొలగించండి. మీ కులం, మతం, ప్రాంతం అనే సంకుచిత కళ్లద్దాలను పగలకుట్టండి. అసలు శత్రువు ఎవరో గుర్తించండి. అవినీతి రాజకీయాలు మీ పిల్లల భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తున్నాయి, మీ రక్తాన్ని పిండి వసూలు చేసిన శ్రమఫలాన్ని దోచుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నా ఇంకా నిద్రపోవడానికి మనం బానిసలమా?గుర్తుంచుకోండి. వ్యవస్థ మిమ్మల్ని ఎప్పటికీ నిద్రపుచ్చాలనే చూస్తుంది. కానీ, మీరు మేల్కొని చరిత్రను తిరగరాయాలని కాలం కోరుకుంటోంది. ఈ చారిత్రక ఎంపిక మీది కేవలం బతుకుతారా, లేదా గౌరవంగా జీవిస్తారా ? సెల్ : 9490754169

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు