భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించిన సీఎం
విశాలాంధ్ర – తిరుమల: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. క్యూ లైన్ ద్వారా స్వామివారి దర్శనానికి వెళ్లారు. తెల్లవారి జామున స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం భక్తులతో కలిసి శ్రీ వెంగమాంబ అన్నదాన వితరణ కేంద్రంలో శ్రీవారి అన్న ప్రసాదాలను స్వీకరించారు. శ్రీవారి దర్శనార్థం శుక్రవారం సాయంత్రమే సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ తిరుమలకు చేరుకున్నారు. రాత్రి గాయత్రి నిలయంలో బస చేశారు. టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు, కార్య నిర్వహణ అధికారి ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆయనకు స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. టిటిడి బోర్డు సభ్యులు సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులకి స్వాగతం పలికారు. తెల్లవారి జామున కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. క్యూ లైన్ ద్వారా దర్శనానికి వెళ్లారా ఆయన. దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయకుల వారి మండపంలో టిటిడి అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనాలు పలికారు. తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామి వారి శేష వస్త్రాలను బహుకరించారు. మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా. తిరుమలలో ఒకరోజు భోజనానికి అయ్యే ఖర్చు మొత్తం రూ. 44 లక్షల రూపాయలను టిటిడి అన్నప్రసాద కేంద్రానికి అందజేశారు. అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ భక్తులతో కలిసి అల్పాహారాన్ని స్వీకరించారు. సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా భక్తులతో కొద్దిసేపు ముచ్చటించారు. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో మనవడితో సీఎం చంద్రబాబు నాయుడు చాలా సేపు మాట్లాడడం కనిపించింది. రాష్ట్ర సీఎం కుటుంబ సభ్యుల వెంట టిటిడి చైర్మన్ డిఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ మురళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


