. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నరుకు లేఖ
. రేపు సీఎంగా ప్రమాణస్వీకారానికి సన్నద్ధం
. రిసార్టుకు విజయ్ పార్టీ ఎమ్మెల్యేలు
తమిళగ వెట్రి కళగం(టీవీకే) శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత విజయ్ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ అభ్యర్థులతో టీవీకే కార్యాలయంలో విజయ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతగా విజయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
చెన్నై: తమిళగ వెట్రి కళగం(టీవీకే) శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత విజయ్ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ అభ్యర్థులతో టీవీకే కార్యాలయంలో విజయ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతగా విజయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమైంది. మే 7వ తేదీన విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. టీవీకే తమిళనాడులో అనూహ్య విజయం సాధించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లను దక్కించుకోలేకపోయింది. దీంతో పార్టీకి అవసరమైన సీట్లను కూడగట్టే విషయంపై సమావేశంలో చర్చ జరిగిట్టు తెలుస్తోంది. మద్దతు కూడగట్టే వ్యవహారంలో దూకుడుగా వ్యవహరించరాదని, ఏ రాజకీయ పార్టీని బతిమాలే విధంగా ఉండకూడదని టీవీకే నేతలు ఒక అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. కాగా, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరుతూ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు విజయ్ లేఖ రాశారు. లేఖను లోక్‌భవన్‌కు ఈ మెయిల్ ద్వారా పంపించారు. లేఖలో రెండు వారాల్లోగా తమ పార్టీ మెజారిటీ నిరూపించుకుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం గవర్నర్ చెన్నైలో లేకపోవడంతో రాగానే బుధవారం విజయ్ కలిసే అవకాశాలు ఉన్నాయి. విజయ్ రెండు చోట్ల నుంచి విజయం సాధించారు. పెరంబూర్, తిరుచ్చి తూర్పు నుంచి గెలుపొందారు. పెరంబూర్‌లో 1,20,365 ఓట్ల మెజారిటీతో గెల్వగా.. తిరుచ్చి తూర్పులో 27,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే పెరంబూర్‌లో ఎక్కువ మెజార్టీ లభించడంతో ఈ సీటు నిలబెట్టుకుని… మరో సీటును వదులుకోవాలని విజయ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీ తమిళనాడులో అనూహ్య విజయం సాధించినప్పటికీ… ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు దక్కించుకోలేకపోయింది. టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటే… ఆ పార్టీకి మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉంది. దీంతో ఏ కూటమి నుంచి మద్దతు కూడగట్టాలనే విషయంపై పార్టీ నేతలు తర్జనభర్జన పడుతున్నారు. టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్, పీఎంకే సుముఖంగా ఉన్నాయని, ఇందుకోసం రెండు పార్టీలు చెరో రెండు మంత్రి పదవులు కోరుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విజయ్‌తో సోమవారం ఫోన్లో మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు వామపక్ష పార్టీలు సైతం టీవీకే నేతలతో అంతర్గత సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే టీవీకే ఎవరి సాయం తీసుకుంటుందనే విషయంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశముంది. కాగా, ప్రభుత్వ ఏర్పాటుకు ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో తమ ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించాలని విజయ్ నిర్ణయించుకున్నారు. అందుకోసం మహాబలిపురంలోని ఓ రిసార్టును విజయ్ బుక్ చేసినట్లు తెలుస్తోంది.
టీవీకేతో కాంగ్రెస్ చర్చలు
టీవీకేతో పొత్తుపెట్టుకోవడానికి కాంగ్రెస్ సిద్ధమైంది. ఈ మేరకు ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సంకేతాలు పంపారు. టీవీకేతో కాంగ్రెస్ చర్చలు జరుపుతుందని ఆయన మంగళవారం మీడియాకు లీకేజీలిచ్చారు. వేణుగోపాల్ అలప్ప్పుులో మీడియాతో మాట్లాడుతూ ‘ఈ ఎన్నికల్లో డీఎంకేతో కలిసి మేం పోటీ చేశాం. ఇప్ప్పుడు తమిళనాడులో కొత్త పరిస్థితి తలెత్తింది. ఎన్నికల ఫలితాల అనంతరం తలెత్తిన పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని తదనుగుణంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటుంది’ అని ఆయన అన్నారు.


