Homeతెలంగాణప్రతి పేదోడికి సొంతిల్లు

ప్రతి పేదోడికి సొంతిల్లు

- Advertisement -

. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం
. గృహ విప్లవం, రెవెన్యూ సంస్కరణల నవశకం
. అదనపు ఎమ్మార్వోల నియామకం
. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల సమీక్షలో పొంగులేటి

విశాలాంధ్ర-హైదరాబాద్: తెలంగాణలో ప్రజా ప్రభుత్వం గృహ విప్లవం తెస్తోందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ప్రతి పేదవాడికి సొంతిల్లు సమకూర్చడమే లక్ష్యమన్నారు. భూ యాజమానులకు తమ భూమిపై స్పష్టమైన హక్కులు కల్పించడమే ధ్యేయంగా పేదల జీవితాల్లో శాశ్వత మార్పు తేవాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. పేదవాడికి భద్రమైన భవిష్యత్తు కల్పించడమే సంకల్పమన్నారు. పేదల జీవితాల్లో గౌరవప్రదమైన మార్పు లక్ష్యంతో ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకం కింద ఇళ్ల నిర్మాణం కోసం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. దాదాపు 4 లక్షల ఇళ్లT మంజూరు చేసి, రాష్ట్రవ్యాప్తంగా గృహ విప్లవానికి శ్రీకారం చుట్టామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఆయన గురువారం హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, హౌసింగ్, రెవెన్యూ, ఫారెస్టు అధికారాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సంక్షేమ పథకాల అమలు, క్షేత్ర స్థాయి పరిస్థితులపై ఆరా తీశారు. జిల్లా యంత్రాగమంతా సమన్వయంతో పనిచేస్తే అక్కడికక్కడే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా కలెక్టర్లు పనిచేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒకసారి ప్రొసీడింగ్స్ ఇచ్చి, మొదటి బిల్లు వారి ఖాతాల్లో జమ అయిన లబ్ధిదారులందరికీ తదుపరి విడతల బిల్లులన్నింటిని సకాలంలోనే విడుదల చేయాలన్నారు. అక్రమాలకు తావివ్వకుండా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో పనిచేయాలని సంబంధిత అధికారులను పొంగులేటి ఆదేశించారు. అలసత్వాన్ని, తప్ప్పులను ఉపేక్షించేది లేదన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల్ల కోసం సేకరించి పూర్తి స్థాయిలో వినియోగించకుండా మిగిలిన భూముల్లో అర్హులైన వారికి నిళ్ల పట్టాలు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు మంత్రి సూచించారు. జిల్లాల్లో గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరక్టర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు. లబ్ధిదారులు, ఉన్నతాధికారుల మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరిస్తూ సమస్యల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టంచేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు ఈనెల 20వ తేదీలోగా పూర్తి చేయాలని, ఈ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని, అర్హులైన పేదలనే లబ్ధిదారులగా ఎంపిక చేయాలని మంత్రి ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు నూతన భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రదేశాల్లో వీటిని నెలకొల్పేలా కలెక్టర్లు చూడాలన్నారు. లక్షకు పైగా జనాభా ఉన్న మండలాల్లో, అవసరానికి అనుగుణంగా, అదనంగా మరో తహశీల్దార్‌ను నియమించనున్నామని పొంగులేటి తెలిపారు. ఇందుకు సంబంధించిన కలెక్టర్లు ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. రెవెన్యూ, అటవీ తదితర శాఖల మధ్య ఉన్న భూ వివాదాల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఆయా విభాగాలు ఉమ్మడిగా సర్వే చేయడమే మార్గమన్నారు. ఈ దిశలో మరింత వేగవంతమైన చర్యలు తీసుకోవాలని అటవీ, రెవెన్యూ అధికారులకు స్పష్టం చేశారు. రెవెన్యూ విభాగంలో అనేక సంస్కరణలతో ఆర్డీవోలకు విస్తృతమైన అధికారాలు కల్పించామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కాకుండా, ఇతర ప్రయోజనాలకు వీటిని వినియోగిస్తే అత్యంత కఠినంగా వ్యవహరిస్తామన్నారు. భూ పరిపాలన బలోపేతానికి సర్వే, సెటిల్మెంట్స్, భూ రికార్డుల శాఖ ద్వారా సమగ్ర సంస్కరణలు అమలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. భూ రికార్డుల్లో పారదర్శకత, కచ్చితత్వమే లక్ష్యమన్నారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలనే కృషి చేస్తున్నట్లు పొంగులేటి వెల్లడించారు. సమావేశాల్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్, వాకాటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ చిన్నా రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు