Homeఆంధ్రప్రదేశ్21 రోజులకే ఇంధన నిల్వలు

21 రోజులకే ఇంధన నిల్వలు

- Advertisement -

మంత్రి మనోహర్
విశాలాంధ్రబ్యూరో-అమరావతి: రాష్ట్రంలో గ్యాస్, ఇంధన పరిస్థితి అదుపులో ఉందని పౌరసరఫరాల శాఖమంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. రబీ ధాన్యం సేకరణ తీరు, క్షేత్రస్థాయి పరిస్థితులు, రైతులకు ఎదురవుతున్న సమస్యలు, గ్యాస్, ఇంధన పరిస్థితులపై మంగళవారం పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ సరఫరా బ్యాక్ లాగులు కొనసాగుతున్నాయన్నారు. ఇష్టానుసారం వ్యవహరించే గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లుపై కఠినంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. ఎప్పటికప్ప్పుడు చమురు కంపెనీల ప్రతినిధులతో మాట్లాడుతున్నామన్నారు. సగటున రోజుకు 1.83 లక్షల బుకింగులు అవుతూ ఉంటే… 1.89 లక్షల గ్యాస్ బండలు డెలివరీ జరుగుతోందన్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కొంతమేర బ్యాక్ లాగులు కనిపిస్తున్నాయన్నారు. దీనిని త్వరలోనే పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని, గ్యాస్ బుక్ చేసిన నాలుగు రోజుల్లో డెలివరీ అయ్యేలా చూస్తామని చమురు కంపెనీలు చెబుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఎక్కడ పెట్రోల్ బంకుల డ్రై అవుట్ సమస్య లేదన్నారు. 21 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని మంత్రి మనోహర్ తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ రబీలో రికార్డుస్థాయిలో అన్ని జిల్లాల్లోనూ ధాన్యం సేకరణ చేయగలిగామన్నారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ కొనేందుకు అనుమతివ్వడం వల్ల… దానిని బొండాలు రకం ధాన్యం కొనేందుకు ఉపయోగించుకోవడం ద్వారా వేలాదిమంది రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఇప్పటివరకు రూ.4,600 కోట్ల సొమ్మును 1.90 లక్షల మంది రైతుల ఖాతాలో విజయవంతంగా 24 గంటల్లోనే వేయగలిగామన్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో రబీలో కొనుగోలు చేసిన దానితో పోలిస్తే 57 శాతం అధికంగా ఉందన్నారు. ఏటా ధాన్యం కొనుగోళ్లలో రికార్డులు సృష్టిస్తున్నామని, ఎంత భారీగా ధాన్యం కొన్నా క్షేత్రస్థాయిలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో రబీ సీజన్‌లో ఇబ్బందులు తలెత్తడం వెనుక ముఖ్య కారణాలు ఉన్నాయన్నారు. ధాన్యం సేకరణ ప్రతి సీజన్‌లోనూ గన్నీ బ్యాగుల సమస్య ఏర్పడుతోందని, దీనిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయం చూస్తున్నామన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు