Thursday, January 9, 2025
Homeఅంతర్జాతీయంఅమెరికా సంయుక్త రాష్ట్రాలలో కెనడా కలిసే ఛాన్సే లేదని తేల్చిచెప్పిన తాత్కాలిక ప్రధాని

అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కెనడా కలిసే ఛాన్సే లేదని తేల్చిచెప్పిన తాత్కాలిక ప్రధాని

అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 51 వ రాష్ట్రంగా కెనడా కలిసిపోవాలంటూ డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేస్తున్న వ్యాఖ్యలపై కెనడా తాత్కాలిక ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా స్పందించారు. కెనడా ఎన్నటికీ అమెరికాలో కలవబోదని, అసలు ఆ ఛాన్సే లేదని తేల్చిచెప్పారు. ఈమేరకు ట్రంప్ వ్యాఖ్యలను ఉద్దేశించి ట్రూడో తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ పెట్టారు. అమెరికా, కెనడా దేశాల మధ్య స్నేహబంధం వల్ల ఇరు దేశాలకు ప్రయోజనం ఉందన్నారు. రెండు దేశాలు పరస్పరం ఆధారపడి ఉన్నాయని చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలపై కెనడా విదేశాంగ మంత్రి కూడా స్పందించారు. కెనడా ఎప్పటికీ వెన్ను చూపదని, తమ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని చెప్పారు. బెదిరింపులకు, ప్రలోభాలకు కెనడా ప్రజలు తలవంచరని స్పష్టం చేశారు. ఆర్థికపరమైన కారణాలు, అవసరాలను సాకుగా చూపి కెనడాను అమెరికాలో విలీనం చేయాలనే ఆలోచన ఎన్నటికీ కార్యరూపం దాల్చబోదని తేల్చిచెప్పారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇండియా, కెనడాలపై టారిఫ్స్ పెంచుతానని ప్రకటించారు. దీంతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అప్పట్లో ఫ్లోరిడా వెళ్లి ట్రంప్ ను కలుసుకున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ కు ట్రూడో అభినందనలు తెలిపారు. కెనడాపై విధిస్తున్న పన్నుల విషయంపై చర్చ సందర్భంగా.. ాకెనడాను అమెరికాలో కలిపేయండి, యూఎస్ లో 51వ రాష్ట్రంగా మారిపోండి. అప్పుడు ఎలాంటి పన్నులు ఉండవు్ణ అంటూ ట్రంప్ కెనడా ప్రధానికి వ్యంగ్యంగా సూచించారు. ఆ తర్వాత కూడా పదే పదే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. సోమవారం ట్రూడో రాజీనామా చేసిన సందర్భంలోనూ అమెరికాలో కెనడా కలిసిపోవాలంటూ ట్రంప్ ట్వీట్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు