Homeజాతీయంజూన్‌ 21న మళ్లీ నీట్ పరీక్ష.. ఎన్‌టీఏ వెల్లడి

జూన్‌ 21న మళ్లీ నీట్ పరీక్ష.. ఎన్‌టీఏ వెల్లడి

- Advertisement -

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న నీట్ యూజీ (NEET-UG) 2026 రీ-ఎగ్జామినేషన్ తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఖరారు చేసింది. జూన్ 21న ఈ పరీక్షను తిరిగి నిర్వహించనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తమ అధికారిక ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) ఖాతా ద్వారా ఎన్టీఏ వెల్లడించింది. రీఎగ్జామ్‌కు సంబంధించి అధికారిక మార్గాల్లో వచ్చే సమాచారాన్నే విశ్వసించాలని విద్యార్థులను ఎన్‌టీఏ కోరింది. హాల్‌టికెట్‌, ఇతరత్రా వివరాలను త్వరలోనే వెల్లడించనుంది.

దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్‌ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 3వ తేదీన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష-యూజీని (నీట్‌-యూజీ) నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశంలోని 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్ష జరిగింది. అయితే, ఈ పరీక్ష ప్రశ్నపత్రాలు కొన్నిచోట్ల లీకయ్యాయని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నాటి పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 23 లక్షల మంది మళ్లీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా.. రీఎగ్జామినేషన్‌కు మరోసారి దరఖాస్తు చేసుకోనక్కర్లేదని, ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ఎన్‌టీఏ స్పష్టం చేసింది.

ఇదిలాఉండగా.. నీట్‌ పేపర్‌ లీక్‌పై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు కీలక నిందితులను అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. రాజస్థాన్‌లోని సికార్‌లో ఈ లీకేజీ వ్యవహారం బయటపడింది. సుమారు 410 ప్రశ్నలతో ఒక గెస్‌ పేపర్‌ పరీక్షకు ముందే విద్యార్థులకు అందగా.. అందులోని 120 కెమిస్ట్రీ ప్రశ్నలు పరీక్షలో వచ్చాయనే ఆరోపణలొచ్చాయి. ప్రశ్నల క్రమంతో పాటు ఆప్షన్లు కూడా ఒకే వరుసలో ఉండటంతో లీక్‌ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధరించారు. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి ప్రశ్నపత్నం లీక్ అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడి నుంచి రాజస్థాన్‌, హరియాణా, జమ్మూకశ్మీర్‌, కేరళ సహా పలు రాష్ట్రాలకు చేరినట్లు దర్యాప్తులో తేలింది. ఈ పేపర్‌ కోసం విద్యార్థుల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు