Homeజాతీయంవచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో నీట్‌ : ధర్మేంద్ర ప్రధాన్‌

వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో నీట్‌ : ధర్మేంద్ర ప్రధాన్‌

- Advertisement -

నీట్​ యూజీ 2026 (NEET UG 2026) పేపర్​ లీక్, పరీక్ష రద్దు అనంతరం వెల్లువెత్తుతున్న నిరసనల మధ్య కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది! వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం జరిపే ఈ నీట్​ (నేషనల్​ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్​ టెస్ట్​) పరీక్షను వచ్చే ఏడాది నుంచి (2027) కంప్యూటర్​ ఆధారంగా (ఆన్​లైన్) నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం ప్రకటించారు.

ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీడియాతో మాట్లాడారు. జాతీయ వైద్య ప్రవేశ పరీక్షల విధానంలో పారదర్శకత కోసం వచ్చే ఏడాది (2027) నుండి ‘నీట్ యూజీ’ పరీక్షను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) మోడ్‌లో నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధికారికంగా ప్రకటించారు.‘‘జూన్‌ 21న నీట్ రీఎగ్జామ్‌ తేదీ ఖరారైంది. నీట్ ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలపై విచారణకు ఆదేశించాం. ఇప్పటికే ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. విద్యార్థులకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. వారు నష్టపోకూడదనే పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహిస్తున్నాం. విద్యార్థుల భవిష్యత్తు బాగుండేలా చూడటమే మా మొదటి లక్ష్యం. పరీక్ష పారదర్శకంగా నిర్వహించడమే మా ప్రధాన కర్తవ్యం. ఏటా కోటి మందికి ఎన్టీఏ పరీక్షలు నిర్వహిస్తోంది. పేపర్ ఎలా లీక్ అయింది.. ఎవరి నుంచి ఎక్కడికి వెళ్లిందన్న పూర్తి వివరాలు బహిర్గతమవుతాయి. ఈసారి ఎలాంటి పరిస్థితుల్లోనూ మాల్ ప్రాక్టీస్ జరగకుండా చూసుకుంటాం. రీటెస్ట్ కోసం విద్యార్థులు నచ్చిన నగరాన్ని ఎంచుకోవడానికి వారం రోజులు గడువు ఇస్తున్నాం. జూన్ 14న అడ్మిట్ కార్డులు విడుదల చేస్తాం. నీట్‌ కోసం మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోన్న వార్తలు చూసి విద్యార్థులు ఆందోళన చెందొద్దు’’ అని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.

పరీక్షను అత్యంత పారదర్శకంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషి, ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్, సీబీఎస్‌ఈ ఛైర్‌పర్సన్ రాహుల్ సింగ్‌లతో కలిసి మంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించారు.

నీట్​ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్​ వివరాలు..

మరోవైపు జూన్ 21న జరిగే NEET రాసే విద్యార్థులకు ఊరట కలిగిస్తూ అభ్యర్థులు తమకు నచ్చిన పరీక్షా కేంద్రాలను ఎంచుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను జూన్ 14న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేస్తుందని స్పష్టం చేశారు.

విద్యార్థుల సౌకర్యార్థం ఈసారి పరీక్షా సమయాన్ని మరో 15 నిమిషాల పాటు పొడిగిస్తున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. దీని ప్రకారం జూన్ 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు పరీక్ష జరగనుంది.

పేపర్ లీక్ కేసులో ఐదుగురి అరెస్ట్.. సీబీఐ కస్టడీకి నిందితులు

మే 3న జరిగిన నీట్ పరీక్షను, పేపర్ లీక్, అవకతవకల ఆరోపణల నేపథ్యంలో మే 12న ఎన్టీఏ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును ప్రభుత్వం సీబీఐ విచారణకు అప్పగించింది. రంగంలోకి దిగిన సీబీఐ బృందం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసింది. జైపూర్ నుంచి మాంగీలాల్ బివాల్, వికాస్ బివాల్, దినేష్ బివాల్.. గురుగ్రామ్ నుంచి యష్ యాదవ్, నాసిక్ నుంచి శుభమ్ ఖైర్నార్‌లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ఐదుగురు నిందితులకు దిల్లీ హైకోర్టు 7 రోజుల CBI కస్టడీకి అనుమతించిందని పీటీఐ నివేదించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు