ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందించడమే ధ్యేయం
ప్రధానోపాధ్యాయులు సాకే భాస్కర్
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసి ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉరవకొండ మండలం రేణుమాకులపల్లిలో స్థానిక జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించి ఇంటింటికీ తిరుగుతూ తల్లిదండ్రులకు ప్రభుత్వ విద్యా వ్యవస్థపై వివరాలు తెలియజేశారు. స్థానిక జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు సాకే భాస్కర్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వసంతమ్మ, సీఆర్ఎంటీ పార్ధన్న, అంగన్‌వాడీ హెల్పర్ నందిని కలిసి శుక్రవారం గ్రామంలోని పలు కాలనీల్లో పర్యటించారు. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను కలుసుకుని ప్రభుత్వ పాఠశాలల్లో లభించే సౌకర్యాలు, బోధన విధానం, విద్యార్థుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు సాకే భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పాఠశాలల్లో అనేక మార్పులు తీసుకొస్తోందన్నారు. విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటుబుక్స్, యూనిఫాంలు, బూట్లు, బ్యాగులతో కూడిన “సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్లు” అందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా “తల్లికి వందనం” పథకం ద్వారా రూ.15 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మధ్యాహ్న భోజనంతో పాటు గుడ్డు, చిక్కీ, రాగిజావ వంటి పోషకాహారం అందిస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమంలో బోధన కొనసాగుతోందని, ప్రతి తరగతికి ప్రత్యేక ఉపాధ్యాయులు నియమించి నాణ్యమైన విద్య అందిస్తున్నామని వివరించారు.
రేణుమాకులపల్లి ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రతి తరగతికి ప్రత్యేక ఉపాధ్యాయులు ఉండగా, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి సబ్జెక్టుకు ప్రత్యేక ఉపాధ్యాయుడు అందుబాటులో ఉన్నారని తెలిపారు. విద్యార్థులలో ప్రతిభను వెలికితీయడానికి విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న అపోహలను తొలగించి పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించడమే తమ లక్ష్యమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న సౌకర్యాలను పరిశీలించి తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు.


