రాజస్థాన్‌తో ఐపీఎల్-19 క్వాలిఫయర్-2 నేడు
చండీగఢ్: ఐపీఎల్-19 ఫైనల్లో ఆర్సీబీని ఢీకొట్టే జట్టేదో నేడు (శుక్రవారం) తేలనుంది. క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. రెండూ బలమైన జట్లే. కష్టంగా ప్లేఆఫ్స్‌లోకి వచ్చినప్పటికీ ఎలిమినేటర్‌లో అదిరే విజయంతో రాజస్థాన్ జోరు మీదుంది. ఆ జట్టు విధ్వంసక ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపైనే అందరి కళ్లూ ఉన్నాయి. టైటాన్స్ బౌలర్లు అతణ్ని ఆపగలరా లేదా అన్నదానిపైనే ఫలితం ఆధారపడి ఉందని విశ్లేషకుల అంచనా. బ్యాటింగ్‌కు బాగా అనుకూలిస్తుందని భావిస్తున్న పిచ్‌పై వైభవ్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు… ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీకొంటుంది. భీకర ఫామ్‌లో ఉన్న ఈ కుర్రాడు ఎలాంటి బౌలింగ్ దళాన్నైనా హడలెత్తిస్తున్నాడు. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై కేవలం 29 బంతుల్లో 12 సిక్స్‌లతో 97 పరుగులు చేసి దాదాపు ఒంటి చేత్తో తన జట్టును గెలిపించాడు.
జోరుమీదున్న రాయల్స్…
టోర్నీని ఘనంగా ఆరంభించి మధ్యలో తడబడ్డ రాజస్థాన్.. గత మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి జోరు మీదుంది. ముఖ్యంగా ఎలిమినేటర్‌లో బలమైన సన్‌రైజర్స్‌ను మట్టికరిపించడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేదే. రాయల్స్ అతి పెద్ద బలం నిస్సందేహంగా వైభవే. బలమైన బౌలింగ్ విభాగం ఉన్నప్పటికీ వైభవ్‌ను నియంత్రించడం టైటాన్స్‌కు పెద్ద సవాలే. వైభవ్ ఇప్పటివరకు 15 మ్యాచ్‌ల్లో 45.33 సగటు, 242.85 స్ట్రైక్‌రేట్‌తో 680 పరుగులు చేశాడు. అతడు నిలబడ్డాడంటే రాయల్స్‌కు తిరుగుండదు. యశస్వి జైస్వాల్ (426), జురెల్ (508) కూడా రాణిస్తున్నారు. ఈ ముగ్గురితో రాయల్స్ టాప్ ఆర్డర్ బలంగా కనిపిస్తోంది. ఫెరీరా (279), రియాన్ పరాగ్ (298) కూడా లయలోనే ఉన్నారు. ఇక బంతితో ఆర్చర్ అదిరే ఫామ్ రాజస్థాన్‌లో ధీమాను పెంచుతోంది. ఇప్పటివరకు అతడు 9.17 ఎకానమీతో 24 వికెట్లు పడగొట్టి రాయల్స్ అత్యుత్తమ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా చివరి లీగ్ మ్యాచ్, ఎలిమినేటర్‌లో అద్భుత బౌలింగ్‌తో రాజస్థాన్ విజయాల్లో కీలక పాత్ర పోషించి జోరు మీదున్నాడు. పేసర్లు బర్గర్ (13 వికెట్లు), బ్రిజేశ్ శర్మ (13).. స్పిన్నర్ యశ్‌రాజ్ పుంజా (9) ఆర్చర్‌కు మద్దతిస్తున్నారు. అయితే బ్యాటింగ్‌లో వైభవ్‌పై, బౌలింగ్‌లో ఆర్చర్‌పై అతిగా ఆధారపడడం రాజస్థాన్‌కు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
గుజరాత్ సత్తా చాటుకుంటుందా…
లీగ్ దశలో నిలకడైన ఆటతో టాప్-2లో నిలిచింది గుజరాత్ టైటాన్స్. ముందుగానే ప్లేఆఫ్స్‌లో స్థానాన్ని ఖరారు చేసుకుంది. కానీ క్వాలిఫయర్-1లో పేలవ ప్రదర్శనతో ఆర్సీబీ చేతిలో చిత్తు కావడం ఆ జట్టుకు పెద్ద షాకే. అయినా టైటాన్స్ బలమైన జట్టే. రాజస్థాన్‌తో పోలిస్తే సమతూకంగా ఉంది. బ్యాటింగ్‌లో టాప్ ఆర్డర్ ఆ జట్టుకు పెద్ద బలం. సాయి సుదర్శన్ (652), శుభ్‌మన్ గిల్ (618), బట్లర్ (498) ఈ టోర్నీలో పరుగుల వరద పారించారు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. కానీ వీళ్లపై టైటాన్స్ అతిగా ఆధారపడుతోంది. ఈ కీలక సమరంలో వాళ్లు చెలరేగడం ఆ జట్టుకు చాలా ముఖ్యం. లేకపోతే మంచి స్కోరు సాధించడం కష్టమే. మిడిల్ ఆర్డర్ బలహీనంగా ఉంది. మొత్తంగా చూస్తే బౌలింగే టైటాన్స్ ప్రధాన బలంగా కనబడుతోంది. రబాడ 26 వికెట్లతో ఈ లీగ్‌లో అత్యుత్తమ బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో (భువనేశ్వర్‌తో కలిసి) ఉన్నాడు. మరో పేసర్ సిరాజ్ (17 వికెట్లు)తో కలిసి కొత్త బంతితో నిలకడగా వికెట్లు తీస్తున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ కూడా 15 వికెట్లు పడగొట్టాడు. ఆల్‌రౌండర్ హోల్డర్ (7.63 ఎకానమీతో 15 వికెట్లు) కూడా రాణిస్తుండడం గుజరాత్‌కు సానుకూలాంశం. మరోవైపు రషీద్ ఖాన్ (19 వికెట్లు) మధ్య ఓవర్లలో ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నాడు. అయితే టైటాన్స్ బౌలింగ్‌లో ఎంత పదునున్నా… వైభవ్‌ను నియంత్రిండానికి ఆ జట్టు బౌలర్లు ఎలాంటి వ్యూహాలతో వస్తారో చూడాలి.
వైభవ్‌పైనే అందరి దృష్టి
- Advertisement -
RELATED ARTICLES


