చెన్నైలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీలోకి ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (ఏఐఏడీఎంకే)కు చెందిన 300 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు చేరారు. పార్టీలో చేరిన వారిలో మాజీ మంత్రి వెల్లమండి నటరాజన్, అన్నా ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కమలక్కన్నన్, మాజీ మైలాపూర్ ఎమ్మెల్యే నటరాజ్‌తో పాటు పలువురు కీలక నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో టీవీకే ప్రధాన కార్యదర్శి ఎన్ ఆనంద్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సెంగొట్టైయన్, ప్రజాపనుల శాఖ మంత్రి ఆధవ్ అర్జున తదితరులు పాల్గొన్నారు.
జోసెఫ్ విజయ్ శాశ్వత ముఖ్యమంత్రి: మంత్రి
టీవీకే పార్టీ అతి తక్కువ సమయంలో సాధించిన ఎదుగుదలను మంత్రి సెంగొట్టైయన్ ప్రశంసించారు.
భారత రాజకీయ చరిత్రలో ఇంత వేగంగా ఎదిగిన పార్టీ మరొకటి లేదని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో జోసెఫ్ విజయ్ తమిళనాడుకు శాశ్వత ముఖ్యమంత్రిగా నిలుస్తారని ఆయన వ్యాఖ్యానించారు. మరో మంత్రి ఆధవ్ అర్జున కూడా విజయ్ నాయకత్వాన్ని కొనియాడుతూ, వివిధ పార్టీలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో ఆయన విజయవంతమయ్యారని అన్నారు. అలాగే అవినీతిని పూర్తిగా నిర్మూలించే దిశగా టీవీకే ముందుకెళ్తోందని చెప్పారు. ఎన్నికల పరాజయం తర్వాత ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి డీఎంకేతో దగ్గరయ్యారని, దీనిపై పార్టీలో అసంతృప్తి పెరగడంతో అనేక మంది టీవీకే వైపు వస్తున్నారని ఆరోపించారు.
కొత్త సభ్యులకు గౌరవం,పదవులు : ఆనంద్
టీవీకేలో చేరిన వారిని ఎలాంటి ప్రలోభాలకు గురిచేయలేదని, వారిని కుటుంబ సభ్యుల్లా ఆహ్వానించామని ఆధవ్ అర్జున తెలిపారు. రాబోయే నెల రోజుల్లో ఏఐఏడీఎంకేలోని చాలా మంది నాయకులు టీవీకేలో చేరే అవకాశం ఉందని ఆయన అన్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి తగిన గౌరవం, ప్రాధాన్యం కల్పిస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆనంద్ హామీ ఇచ్చారు. విజయ్ నాయకత్వంలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో టీవీకే అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అవినీతికి తావులేకుండా పార్టీ ముందుకు సాగుతోందని చెప్పారు.
విజయ్ నాయకత్వాన్ని ప్రశంసించిన అర్జున
వార్తా సంస్థ ఏఎన్ఐ కథనం ప్రకారం, మంత్రి ఆధవ్ అర్జున విజయ్ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఁటీవీకే కేవలం 15 రోజుల్లో ఏమి సాధించిందని డీఎంకే, ఏఐఏడీఎంకే ప్రశ్నిస్తున్నాయి. తమిళనాడు రాజకీయాలు ఎప్పటి నుంచో లౌకికవాద పరిరక్షణ గురించి మాట్లాడుతున్నాయి. అయితే నేడు మా నాయకుడు కాంగ్రెస్, ఐయూఎంఎల్, వీసీకే తదితర పార్టీలను ఒకే వేదికపైకి తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి నిధుల పేరుతో గానీ, మంత్రుల నిధుల ద్వారా గానీ అవినీతి జరగడం లేదనిఁ ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఇసుక తవ్వకాలు, ప్రజాపనుల శాఖ, సీఎండీఏతో పాటు పలు ప్రభుత్వ విభాగాల్లో ఉన్న అవినీతి పూర్తిగా తగ్గిపోయిందని అర్జున వ్యాఖ్యానించారు.


