విశాలాంధ్ర – కంబదూరు విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు శుక్రవారం కంబదూరు మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. గత వారం రోజులుగా వ్యవసాయానికి సరిపడా విద్యుత్ సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని మండిపడ్డారు. ముఖ్యంగా టమోటా సాగు కోసం లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టామని, కరెంట్ లేక మోటార్లు నడవక పంటలకు నీరు అందడం లేదని తెలిపారు. ఫలితంగా మొక్కలు ఎండిపోతున్నాయని వాపోయారు.వాట్సాప్ గ్రూపుల్లో మాత్రం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉంటుందని సమాచారం ఇస్తున్నారని, కానీ క్షేత్రస్థాయిలో విద్యుత్ అందడం లేదని ఆరోపించారు. విద్యుత్ కోతల కారణంగా ఇప్పటికే భారీ నష్టం వాటిల్లిందని రైతులు పేర్కొన్నారు.హౌసింగ్ పరిధిలోని నీటి తొట్ల సమస్యలు సైతం 20 రోజులుగా పెండింగ్‌లో ఉన్నాయని, గ్రామంలో లైన్మెన్, హెల్పర్ కూడా లేకపోవడంతో సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు అధికారులు కార్యాలయాలకే పరిమితమైపోయారని, గ్రామాల్లోకి వచ్చి సమస్యలను పరిశీలించడం లేదని విమర్శించారు.“దేశానికి అన్నం పెట్టే రైతుల కష్టాలను నిర్లక్ష్యం చేయడం తగదు. మేము పంటలు పండించకపోతే ప్రజల ఇళ్లలో అన్నం ఎలా పడుతుంది?” అంటూ రైతులు ప్రశ్నించారు. మండుతున్న ఎండల్లో విద్యుత్ లేక పంటలను కాపాడుకోవడం కష్టంగా మారిందని తెలిపారు.విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ లోకేష్ కుమార్ విద్యుత్ కార్యాలయానికి చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్న రైతులతో మాట్లాడారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు తమ ఆందోళనను విరమించారు.విద్యుత్ సరఫరా సమస్యలను తక్షణమే పరిష్కరించి, వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ అందించాలని రైతులు డిమాండ్ చేశారు.


