నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత మూడు రోజులుగా తెలంగాణలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మధ్యాహ్న సమయాల్లో అక్కడక్కడా ఎండ తీవ్రత కనిపిస్తున్నప్పటికీ, వాతావరణంలో వస్తున్న ఆకస్మిక మార్పుల వల్ల అనేక ప్రాంతాల్లో మబ్బులు పట్టి వర్షాలు పడుతున్నాయి. వాతావరణ నిపుణుడు, వెదర్ మ్యాన్ బాలాజీ తెలిపిన వివరాల ప్రకారం, ఈరోజు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కుమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
మరోవైపు, రుతుపవనాల రాకతో తీవ్రమైన వేసవి ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు పెద్ద ఉపశమనం లభించింది. పలు ప్రాంతాలలో వాతావరణం ఆహ్లాదకరంగా మారడమే కాకుండా, అప్పుడప్పుడు కురుస్తున్న జల్లులు ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి.


