Homeజాతీయంసేవలతోనే ‘టీవీకే’ పునాదులు

సేవలతోనే ‘టీవీకే’ పునాదులు

- Advertisement -


పార్టీపై ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టిన సీఎం విజయ్
చెన్నై:
టీవీకే ఒక నటుడి పార్టీ అని ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలను తమిళనాడు సీఎం జోసెప్ విజయ్ తిప్పికొట్టారు. క్షేత్రస్థాయిలో కొన్నేళ్ల పాటు సేవా కార్యక్రమాల ద్వారా టీవీకే పార్టీ పునాది ఏర్పడిందని అన్నారు. సినిమాల్లోనూ తాను సామాజిక న్యాయం, అవినీతి వ్యతిరేకతను చూపించానని చెప్పారు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నానన్నారు. గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా విజయ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏళ్లతరబడి ప్రజల తరఫున పోరాడానని చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేశారు. కరూర్ తొక్కిసలాట వివాద రూపంలో పెను సవాలు ఎదురైందన్నారు. ఫ్యాన్ క్లబ్‌లుగా ఉన్న సమయంలో కూడా తాము ప్రజల పక్షాన నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. 2008లో శ్రీలంక తమిళుల కోసం, 2011లో మత్స్యకారుల తరఫున నిరసన కార్యక్రమాలు నిర్వహించిన విషయాన్నీ పేర్కొన్నారు. జల్లికట్టు నిరసనలకు మద్దతు తెలిపిన విషయాన్ని ప్రస్తుతించారు.
సంఘ సంస్కర్తలు చూపిన మార్గంలో…
సంఘ సంస్కర్తలు చూపించిన మార్గంలో తాము ముందుకు వెళుతున్నామని సీఎం విజయ్ తెలిపారు. మతవిశ్వాసాలపై పెరియార్ వాదనకు తాము వ్యతిరేకమైనప్పటికీ స్థూలంగా ఆయన చూపించిన బాటలోనే నడుస్తున్నామని అన్నారు. అంబేద్కర్, కామరాజ్‌నాడార్‌ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతున్నామన్నారు. చాలా మంది మొదట పార్టీ పెట్టి ఆపై ప్రజల వద్దకు వెళతారని, తాను ముందు ప్రజల్లో ఉండి ఆ తరువాతే పార్టీ పెట్టానని చెప్పారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేని వారే తమది నటుడి పార్టీ అని విమర్శిస్తున్నారన్నారు. సామాన్య ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. కుల, మత అడ్డుగోడలను తమ పార్టీ ఇటీవల ఎన్నికల్లో కూల్చేసిందని విజయ్ అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు