Homeవిశ్లేషణఉక్కుపాదం!

ఉక్కుపాదం!

- Advertisement -

ఉపా చట్టంలోని పదునైన, కరడుగట్టిన కోరలు ప్రజాస్వామ్య హక్కులపై ఉక్కుపాదంగా పరిణమించాయి. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు పౌర హక్కులు, భావప్రకటన స్వేచ్ఛ వెన్నెముక లాంటివి. పౌరుడు ప్రశ్నించే హక్కును కోల్పోయిన నాడు ప్రజాస్వామ్యం కేవలం ఒక అలంకార ప్రాయంగా మిగిలిపోతుంది. దురదృష్టవశాత్తూ, దేశంలో అటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఉగ్రవాదాన్ని, దేశద్రోహాన్ని అణచివేయడానికి ఉద్దేశించిన ‘ఉపా’ (చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంఉపా) చట్టం, నేడు భిన్నాభిప్రాయాలను అణచివేయడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను నొక్కేయడానికి రాజకీయ ఆయుధంగా మారుతోందనే ఆందోళనలు దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి కాలంలో ఏపీలో సామాజిక కార్యకర్త, ప్రజా గొంతుక ‘ప్రశ్న రావణ్’పై ఉపా చట్టాన్ని ప్రయోగించి, కేసులు నమోదు చేయడం అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా నిలుస్తోంది. సాధారణ పౌరుడు లేదా హక్కుల కార్యకర్త సమాజంలోని అవినీతి అక్రమాలపై గళమెత్తితే వారిపై ఉగ్రవాద ముద్ర వేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న మేధావులను, న్యాయకోవిదులను కలచివేస్తోంది. ఉపా చట్టం నేపథ్యం, దాని ఆనుపానులు పరిశీలిస్తే, 1967లో దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడటానికి తీసుకువచ్చిన ఉపా (యూఏపీఏ) చట్టానికి 2004, 2008, 2012, 2019లలో కీలక సవరణలు చేశారు. 2019 సవరణ ద్వారా ఏ ఒక్క సంస్థనే కాకుండా, ప్రభుత్వానికి నచ్చని ఏ వ్యక్తినైనా ముందస్తు విచారణ లేకుండానే ‘ఉగ్రవాది’గా ప్రకటించే అపరిమితమైన అధికారాలు దక్కాయి. అందుకే, ఉపా చట్టం ప్రభుత్వానికిచ్చిన రాజ్యాంగేతర అధికారంగా హక్కుల కార్యకర్తలు చెపుతూ ఉంటారు. సాధారణ క్రిమినల్ చట్టాల్లో ‘నేరం నిరూపితమయ్యే వరకు నిందితుడు నిర్దోషి’ అనే సూత్రం వర్తిస్తుంది. కానీ, ఉపా చట్టం కింద కేసు నమోదైతే ‘తాను నిర్దోషిని’ అని నిందితుడే నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ చట్టం కింద పట్టుబడితే 180 రోజుల వరకు చార్జ్‌షీట్ దాఖలు చేయకుండానే జైల్లో ఉంచవచ్చు. ఇందులో బెయిల్ రావడం అసాధ్యం. దర్యాప్తు సంస్థల విచక్షణకే సర్వాధికారాలు ఇవ్వడంతో ఈ చట్టం పాలకుల చేతిలో మారణాయుధంగా మారింది. జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాలను పరిశీలిస్తే, ఉపా చట్టం అమలు తీరు అర్థమవుతుంది. ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఈ చట్టం కింద కేసులు నమోదవు తున్నాయి. గత కొన్నేళ్లలో 5వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గమనించాల్సిన విషయం ఏంటంటే దోషులుగా తేలుతున్న వారి శాతం 2.5%3% మాత్రమే! ఇందులో బెయిల్ రావడం అరుదు, క్లిష్టం కూడా. ఏటా నమోదవుతున్న కేసులు వెయ్యికి పైగా ఉంటున్నాయి. విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలు వేల సంఖ్యలో (సంవత్సరాల తరబడి) ఉంటున్నారు. ఈ చట్టం కింద అరెస్ట్ అయిన వారిలో 97 శాతం మంది నిర్దోషులుగా తేలుతున్నారు. కానీ, నేరనిరూపణ అయ్యేసరికి ఐదు నుంచి పదేళ్ల కాలాన్ని జైల్లోనే కోల్పోతున్నారు.ఇదొక రకమైన వేధింపు ప్రక్రియ. అందుకే ఉపా చట్టమంటే ఓ భయం, ఓ ఉల్లంఘన. ఉపా చట్టం పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను పూడ్చిపెడుతోంది. భారత రాజ్యాంగంలోని 3వ భాగం ప్రసాదించిన చాలా హక్కులకు ఈ చట్టం భంగం కలిగిస్తోంది.మొదటిది భావప్రకటన స్వేచ్ఛ (ఆర్‌టికల్ 191ఏ). ప్రభుత్వ విధానాలను విమర్శించే, నిరసన తెలిపే పౌరుల హక్కును ఉపా హరిస్తోంది. పాలకవర్గాల తప్పలను ఎత్తిచూపితే దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. రెండోది జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ (ఆర్‌టికల్ 21). చట్టబద్ధమైన కారణం, సాక్ష్యాధారాలు లేకుండా ఒక వ్యక్తిని ఏళ్ల తరబడి జైల్లో నిర్బంధించడం జీవించే హక్కును కాలరాయడమే. అనుమానంతో పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం రాజ్యాంగ విరుద్ధం. మూడోది సత్వర న్యాయం పొందే హక్కు. రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి త్వరితగతిన న్యాయం పొందే హక్కు ఉంది. ఉపా చట్టంలో దర్యాప్తు ప్రక్రియే ఏళ్ల తరబడి సాగుతూ, నిందితుడి న్యాయమైన హక్కులను కాలరాస్తోంది. ఫాదర్ స్టాన్స్వామి లాంటి వృద్ధ మానవతావాది, సామాజిక కార్యకర్త సరైన వైద్యం అందక, బెయిల్ దొరక్క జైలులోనే ప్రాణాలొదలడం ఈ చట్టం సృష్టించిన మానవతా సంక్షోభానికి సజీవ సాక్ష్యం. భీమా కోరెగావ్ కేసు నుండి ‘ప్రశ్న రావణ్’ కేసు వరకు, ఉపా ప్రయోగం వెనుక ఉన్నది శాంతిభద్రతల రక్షణ కాదు, భిన్నాభిప్రాయాలను అణచివేయడమేననేది స్పష్టమవుతోంది. యూట్యూబర్, సామాజిక కార్యకర్త బచలకురి జోసెఫ్ అలియాస్ ‘ప్రశ్న రావణ్’ కేసు ప్రక్రియ సంచలనంగా మారింది. ఐదు రోజుల వ్యవధిలో నాలుగు వేర్వేరు కేసుల్లో కోర్టుల నుండి బెయిల్ పొందినప్పటికీ, ఐదోసారి కఠినమైన ‘ఉపా’ చట్టం కింద అరెస్ట్ కావడం వెనుక రాజకీయ, సామాజిక వివాదాలు ముడిపడి ఉన్నాయనేది స్పష్టం. ‘ప్రశ్న రావణ్’ తన యూట్యూబ్ ఛానల్ ‘ప్రశ్న’ ద్వారా సామాజిక సమస్యలు, దళితులపై జరుగుతున్న వివక్షలపై డిబేట్లు, వీడియోలు చేస్తూ ఉంటారు. 2026 జూన్ 28న ఏలూరులో జరిగిన ‘దళిత కైస్తవ సమర శంఖారావం’ బహిరంగసభలో రావణ్ ప్రసంగించారు. ఈ ప్రసంగంలో ఏపీ ఉపముఖ్యమంత్రి కె.పవన్ కళ్యాణ్ లక్ష్యంగా విమర్శలు చేశారు. పిఠాపురంలో దళిత విద్యార్థులపై జరిగిన ఒక వివక్ష ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం దీనిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ ప్రసంగంలో వాడిన కొన్ని పదాలు, విమర్శలు పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబ సభ్యులను కించపరిచేలా ఉన్నాయంటూ జనసేన పార్టీ నాయకులు, మద్దతుదారులు ఏపీ వ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదులు చేశారు. జూన్ 30 రాత్రి హైదరాబాద్‌లోని రావణ్ నివాసంలో పిఠాపురం పోలీసులు ఆయనను మొదటిసారి అరెస్ట్ చేయడంతో ఈ ప్రక్రియ మొదలైంది. జూలై 1న కోర్టు స్టేషన్ బెయిల్ మంజూరు చేసింది. కోర్టు నుంచి బయటకు రాగానే సర్పవరం పోలీసులు పాత కేసు (బడి పిల్లల ఇంటర్వ్యూ ద్వారా బాలల హక్కుల ఉల్లంఘన ఆరోపణ) కింద మళ్లీ అరెస్ట్ చేశారు. జూలై 2న కోర్టు ఈ రిమాండ్‌ను తిరస్కరించింది. మూడవ అరెస్ట్ మచిలీపట్నం పోలీసులు పని. తిరుపతి లడ్డూ వివాదం, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై చేసిన పాత పోస్టుల ఆధారంగా అరెస్ట్ చేయగా, జూలై 3న కోర్టు మళ్లీ బెయిల్ ఇచ్చింది. ఇక నాల్గవ అరెస్ట్ పాయకరావుపేట పోలీసుల ఆధ్వర్యంలో జరిగింది. 300కిమీ.దూరంలో ఉన్న అనకాపల్లి జిల్లా పోలీసులు రంగంలోకి దిగి మరో కేసులో అరెస్ట్ చేశారు. జూలై 4 సాయంత్రం వీరు కూడా బెయిల్ ఇచ్చారు. ఐదవ అరెస్ట్ జూలై 4 రాత్రి బెయిల్పై విడుదలైన రావణ్ను పాయకరావుపేట టోల్గేట్ వద్ద గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకుని కఠినమైన ఉపా చట్టాన్ని ప్రయోగించారు. జూలై 5న కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ‘ఉపా’ చట్టం పరిధిలోకి ఎందుకు తెచ్చారు? అతను ఉగ్రవాదా? అనేది ప్రశ్న. గన్నవరం జనసేన నేత గరికపాటి శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఉపా కేసు నమోదు చేశారు. పోలీసుల ఎఫ్‌ఐఆర్ ప్రకారం మావోయిస్టు భావజాల ప్రచారం చేశారన్నది ఆరోపణ. 2025 నవంబర్‌లో రావణ్ తన యూట్యూబ్ ఛానల్లో నిషేధిత సిపిఐ (మావోయిస్టు) సంస్థను, ఆయుధ పోరాటాన్ని కీర్తిస్తూ వీడియోలు అప్లోడ్ చేశారని ఆరోపించారు. మావోయిస్టు అగ్రనేత ‘హిడ్మా’ను గ్లోరిఫై చేస్తూ ప్రసంగాలు చేశారని, సాయుధ విప్లవాన్ని ప్రోత్సహించేలా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. యువతను తీవ్రవాదం వైపు ఆకర్షితులయ్యేలా ప్రచారం చేశారని ఉపా సెక్షన్లు 13, 39తో పాటు భారతీయ న్యాయసంహిత (బీఎన్‌ఎస్) కింద దేశద్రోహం (రాజ్యాంగంపై యుద్ధం ప్రకటించడంబీఎన్‌ఎస్ 147, 148) లాంటి సెక్షన్లను చేర్చారు. నాలుగు సార్లు వేర్వేరు మేజిస్రేట్ట్లు పోలీసులు పెట్టిన కేసులు చెల్లవని బెయిల్ ఇచ్చినప్పటికీ, పోలీసులు పాత వీడియోలను తీసి ‘ఉపా’చట్టాన్ని అgంగా వాడుకున్నారని హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ‘ప్రశ్నించే గొంతును నొక్కడానికే’ ఈ వ్యూహం అమలు చేశారని విమర్శిస్తున్నారు. ఉగ్రవాదంపై పోరాడటానికి దేశానికి కఠినమైన చట్టాలు అవసరమే. కానీ, దేశద్రోహులను పట్టుకోవడానికి ఉద్దేశించిన చట్టాన్ని, పాలకుల లోపాలను ప్రశ్నించే పౌరులపై ప్రయోగించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. సుప్రీంకోర్టు సైతం పలు సందర్భాలలో ‘భేద్ఙాóప్రాయం లేదా అసమ్మతి అనేది ప్రజా స్వామ్యానికి సేఫ్టీ వాల్Ç లాంటిది’ అని స్పష్టం చేసింది. ఇకనైనా న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుని, ఉపా చట్టంలోని లోపాలను, అపరిమిత అధికారాలను పున’ సమీక్షించాలి. పాలకుల రాజకీయ ప్రయోజనాల కోసం చట్టాలను దుర్వినియోగం చేస్తూపోతే, భవిష్యత్తులో పౌరసమాజం ఉనికిని కోల్పోతుంది. ప్రజాస్వామ్యంలో చట్టాల పేరుతో పౌరుల గొంతు నొక్కడం తగదు. పౌర హక్కుల రక్షణే పరమావధిగా సాగనినాడు, ఆ వ్యవస్థను ప్రజాస్వామ్యం అని పిలవలేం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు