Homeజాతీయంఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్ ఇక చాలా ఈజీ!

ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్ ఇక చాలా ఈజీ!

- Advertisement -

రైలు ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ఎదురయ్యే చిన్నపాటి ఇబ్బందులకు, విసుగుకు భారతీయ రైల్వే త్వరలో తెరదించనుంది. టికెట్ బుకింగ్ ప్రక్రియను మరింత వేగంగా, సులభంగా మార్చే లక్ష్యంతో సరికొత్త హంగులతో తీర్చిదిద్దిన వెబ్‌సైట్ బీటా వెర్షన్‌ను రైల్వే శాఖ తాజాగా ప్రారంభించింది. వినియోగదారుల నుంచి అభిప్రాయాలు స్వీకరించిన అనంతరం, దీన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కొత్త వెబ్‌సైట్‌లో అనేక కీలకమైన మార్పులు చేశారు. టికెట్ బుకింగ్ సమయంలో పదేపదే ఎదురయ్యే క్యాప్చా ఎంటర్‌ చేసే విధానాన్ని గణనీయంగా తగ్గించారు. అనవసరమైన పాపప్‌లు, ప్రకటనలు లేకుండా యూజర్ ఫ్రెండ్లీ అనుభవాన్ని అందించేలా డిజైన్ చేశారు. ఇప్పటివరకు వేర్వేరు క్లాసులలో సీట్ల లభ్యతను తెలుసుకోవాలంటే పలుమార్లు క్లిక్ చేయాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ఒకే స్క్రీన్‌పై అన్ని క్లాసుల (స్లీపర్, 3ఏసీ, 2ఏసీ మొదలైనవి) సీట్ల లభ్యతను చూసుకునేలా మార్పులు తీసుకువచ్చారు. దీనివల్ల ప్రయాణికులు సులభంగా తమకు అనువైన క్లాస్‌ను ఎంచుకునే వీలు కలుగుతుంది. అంతేకాకుండా బుకింగ్ కోసం అవసరమైన దశల సంఖ్యను తగ్గించి, ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. తరచూ ప్రయాణించే వారి కోసం ప్రయాణికుల వివరాలను (పేరు, వయసు, లింగం వంటివి) సేవ్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించారు. ఇది కుటుంబంతో ప్రయాణించే వారికి, ఒకేసారి ఎక్కువ టికెట్లు బుక్ చేసేవారికి ఎంతో ఉపయోగపడనుంది.

ఈ మార్పుల వెనుక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాలవీయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎన్ఐటీ) విద్యార్థులు జరిపిన సమావేశంలో ఈ సూచనలు అందాయి. వెబ్‌సైట్ డిజైన్, యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడంపై విద్యార్థులు పలు సలహాలు ఇచ్చారు. వారి ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే ఈ కొత్త వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేసినట్లు పీఐబీ ఒక ప్రకటనలో తెలిపింది. 2002లో ప్రారంభమైన ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా ప్రస్తుతం ప్రతిరోజూ సగటున 14.5 లక్షల టికెట్లు బుక్ అవుతున్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే ఈ మార్పుల ఉద్దేశం.

కొత్త వెబ్‌సైట్‌ను ఎలా యాక్సెస్ చేయాలి?
ప్రస్తుతం ట్రయల్ దశలో ఉన్న ఈ కొత్త వెబ్‌సైట్‌ను వినియోగదారులు రెండు విధాలుగా యాక్సెస్ చేయవచ్చు. నేరుగా ఱతీctc.cశీ.ఱఅ అనే లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా లేదా ప్రస్తుత ఐఆర్‌సీటీసీ హోమ్‌పేజీలో కనిపించే ఃబీటా వెర్షన్ః లింక్‌ను ఎంచుకోవడం ద్వారా దీన్ని ప్రయత్నించవచ్చు. ఈ ట్రయల్ దశలో వినియోగదారుల నుంచి వచ్చే సూచనలు, అభిప్రాయాలను స్వీకరించి, అవసరమైన మరిన్ని మెరుగుదలలు చేశాక తుది వెర్షన్‌ను అధికారికంగా విడుదల చేస్తారు. కొత్త ప్యాసింజర్ రిజర్వేషన్ ఇంజిన్‌తో ఈ వెబ్‌సైట్‌ను అనుసంధానం చేసిన తర్వాత, రాబోయే కొద్ది వారాల్లోనే పూర్తిస్థాయిలో ఈ నూతన పోర్టల్ అందుబాటులోకి వస్తుందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు