క్రీడలు: రిటైర్మెంట్ విషయంలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మపై మేనేజ్మెంట్ ఎలాంటి ఒత్తిడి పెట్టడడం లేదని టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటాక్ స్పష్టం చేశారు. రోహిత్ వన్డేలకు రిటైర్మెంట్ పలుకుతాడనే విషయం ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతోంది. ఇంగ్లాండ్‌తో ఆదివారం జరిగే చివరి వన్డేనే రోహిత్ కు ఆఖిరిదంటూ వార్తలు వస్తున్నాయి. ఇంగ్లాండ్‌తో సిరీస్ తర్వాత ఈ ఫార్మాట్ నుంచి వైదొలగాలని బీసీసీఐ అతడికి పరోక్షంగా అల్టిమేటం ఇచ్చినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ‘ఈ సిరీస్ తర్వాత వన్డేలకు అతడిని ఎంపిక చేసే అవకాశాల్లేవు. అయితే, భవిష్యత్తుపై అతడే నిర్ణయం తీసుకోవాలి. రిటైర్ కావాలని అతడికి ఎవరూ చెప్పరు’ అని బీసీసీఐ వర్గాలు చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే బీసీసీఐ ప్రతినిధులతో రోహిత్ సమావేశమయ్యాడని, బోర్డు నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడని సమాచారం.
ఈ పరిణామాలపై బ్యాటింగ్ కోచ్ కొటాక్ స్పందించారు. ‘రోహిత్ శర్మ లాంటి సీనియర్ ఆటగాడిపై ఇలాంటి ఒత్తిడి ఉంటుందని నేను అనుకోను. అతడు కూడా ఒత్తిడి ఉందని ఫీలయ్యే ఆటగాడు కాదు. నిజమే…ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లో అతడు పరుగులేం చేయలేదు. అంతమాత్రాన అతడి కెరీర్ విషయంలో పెద్ద తేడా ఏం ఉండదు. రోహిత్ ఇబ్బంది పడుతున్నాడని నేను చెప్పను. బహుశా షాట్ల ఎంపిక పనిచేయకపోవచ్చు. లార్డ్స్‌లో జరిగే మూడో వన్డేలో తప్పకుండా అతడి నుంచి భిన్నమైన ఇన్నింగ్స్‌ను మనం చూస్తాం’ అని కోచ్ వివరించారు.
రిటైర్మెంట్పై రోహిత్ కు ఒత్తిడి లేదు: కోచ్ కొటాక్
- Advertisement -


