Homeవిశ్లేషణకమ్యూనిస్టు ఉద్యమ మూలస్తంభం వీకే

కమ్యూనిస్టు ఉద్యమ మూలస్తంభం వీకే

- Advertisement -

బి.కేశవరెడ్డి

విద్యార్థి నాయకుడిగా, కార్మిక నేతగా, ప్రజా ప్రతి నిధిగా, రైతు బాంధవుడిగా, విద్యార్థి-యువజన సంఘాలకు మార్గదర్శిగా, కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతగా విశిష్ట సేవలందించిన ధన్యజీవి వీకే ఆదినారాయణ రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే. 1917 అక్టోబర్ 8న అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం చీమలువాగుపల్లి గ్రామంలో రంగప్ప`రంగమ్మ దంపతులకు జన్మించిన వీకే ఆదినారాయణ రెడ్డి, విద్యార్థి దశ నుంచే జాతీయోద్యమం, ప్రజా ఉద్యమాల పట్ల ఆకర్షితులయ్యారు. మితభాషి, పుస్తక ప్రియుడైన ఆయన 1936లో తన గ్రామంలో కాంగ్రెస్ సంస్థను ఏర్పాటు చేసి రైతులను సంఘటితం చేశారు. ఐదుకల్లు సదాశివం వంటి ఉద్యమ నాయకులతో ఏర్పడిన పరిచయాలు ఆయనను రాజకీయ చైతన్య మార్గంలో నడిపించాయి. ఆయన ఎప్పుడు గ్రామానికి వచ్చినా వీరి ఇంట్లోనే ఉండేవారు. విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న ఆయన, విద్యార్థి ఫెడరేషన్ చేపట్టిన సమ్మెల్లో ముందుండి పోరాడారు. అనంతపురం సీడెడ్ కళాశాల (ప్రస్తుత ఆర్ట్స్‌ కళాశాల) లో జరిగిన ఘటనల అనంతరం తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపినప్పటికీ వెనుకడుగు వేయలేదు. 1943లో కమ్యూనిస్టు పార్టీలో చేరిన వీకే, ధనిక రైతు కుటుంబంలో జన్మించినప్పటికీ వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం జీవితాన్ని అంకితం చేశారు. చీమలువాగుపల్లి, తరిమెల ప్రాంతాల్లో కూలీ రేట్ల పెంపు కోసం ఉద్యమాలకు నాయకత్వం వహించారు. అదే ఏడాది అనంతపురంలోని కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో పుచ్చలపల్లి సుందరయ్యగారి ఆధ్వర్యంలో తరిమెల నాగిరెడ్డి, నీలం రాజశేఖర్ రెడ్డి, ఐదుకల్లు సదాశివం, విద్వాన్ విశ్వం తదితరుల సమక్షంలో సమావేశం నిర్వహించి నీలం రాజశేఖర్ రెడ్డిని పార్టీ జిల్లా కార్యదర్శిని చేశారు. జిల్లా కమ్యూనిస్టు కమిటీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.1949లో వ్యవసాయ కూలీల సమ్మె జరిగింది. అరÆశేరు కూలీ పెంపు కోసం పోరాటాలు చేశారు. పార్టీపై నిషేధం విధించిన రోజుల్లో రహస్య జీవితం గడుపుతూ పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించారు. బాంబేలో జరిగే రాజకీయ తరగతులకు వెళ్లాల్సిందిగా నీలం రాజశేఖర్ రెడ్డి నుండి సమాచారం అందడంతో నెల రోజులు పి.సి. జోషి, జి.అధికారి, ఎం.కె.కృష్ణన్ వంటి ప్రముఖుల వద్ద సిద్ధాంత శిక్షణ పొందారు. అది ఆయన రాజకీయ జీవితానికి బలమైన పునాది అయింది. రాయలసీమ కరువు సమయంలో బ్రిటీష్ ప్రభుత్వం నిర్వహించిన కరువు శిబిరాల్లో ప్రజలకు అండగా నిలిచారు. ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ ప్రాంతాలకు వెళ్లి వాలంటీర్‌గా సేవలందించారు. ఈ ఏరియా పార్టీ బాధ్యతలు చూసేవారు. 1946 ఎన్నికల ముందు ఆదోని నుండి అనంతపురం వచ్చారు. ఈ ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా తరిమెల నాగిరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నీలం సంజీవరెడ్డి పోటీ చేశారు. కమ్యూనిస్టు అభ్యర్థి తరిమెల నాగిరెడ్డి విజయం కోసం గ్రామాలన్నీ సైకిల్పై తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల తర్వాత వికే ఆదినారాయణ రెడ్డి గారికి పార్వతమ్మ గారితో వివాహం జరిగింది. ఈమెది తరిమెల గ్రామం. ఆమె పెదన్నా ఇంట్లో పెరిగింది. పెళ్లయిన తర్వాత చీమలవాగు పల్లెలో కాపురం పెట్టారు. 1948లో ఆయనపై అరెస్టు వారెంట్ జారీ కావడంతో అజ్ఞాత జీవితం గడపాల్సి వచ్చింది. దాంతో ఆయన తండ్రిని, అన్నను అరెస్టు చేశారు. కుటుంబసభ్యులను పోలీసులు వేధించినా ఆయన కుటుంబం ఉద్యమానికి అండగా నిలిచింది. ఆ సమయంలో వీకే చెల్లెలు పార్వతమ్మ, భార్య పార్వతమ్మ దృఢంగా నిలబడ్డారు. 1946లో శిస్తు సత్యాగ్రహం ప్రారంభమైంది. పార్వతమ్మ ఈ సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించడం వారి కుటుంబ త్యాగానికి నిదర్శనం. 1952 ఎన్నికల తర్వాత పార్టీ నిర్ణయం మేరకు వీకే ఆదినారాయణ రెడ్డి తన నివాసాన్ని 1954లో గుంతకల్కు మార్చారు. 1958 వరకు అక్కడే ఉన్నారు. రైల్వే కార్మికుల సంఘటితం చేయడం, స్థానిక గూండాలు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడేవారు. గుత్తి, గుంతకల్ ప్రాంతాల్లో కమ్యూనిస్టు పార్టీ విస్తరణకు విశేష కృషి చేశారు. 1962లో అనంతపురంలో జరిగిన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర మహాసభల నిర్వహణలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అదే ఏడాది గుత్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజా సమస్యలను శాసనసభలో సమర్థంగా ప్రస్తావించారు. రాయలసీమ సాగునీటి సమస్యల పరిష్కారమే తన జీవిత లక్ష్యంగా భావించిన వీకే, 1964లో పేరూరు వద్ద అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు నిర్మాణం కోసం వేలాది మంది రైతులను సమీకరించి మహాసభ నిర్వహించి ఉద్యమించారు. ఈ పోరాటాల ఫలితంగా అప్పుడు ప్రభుత్వం దిగివచ్చి అప్పర్ పెన్న ప్రాజెక్టు నిర్మించింది. జిల్లాను శాశ్వత కరువు నివారణ జిల్లాగా మార్చేందుకు అప్పటి ఇంజనీర్ శివరామకృష్ణ గారితో ఉన్న పరిచయం వల్ల ఈ జిల్లాను కరువు బారి నుండి కాపాడాలని ఆలోచనతో హంద్రీనీవా ప్రాజెక్టును రూపకల్పన చేశారు. ఈ ప్రాజెక్టు వెంటనే పూర్తి చేసి రాయలసీమ జిల్లాలలో ఉన్న రైతన్నను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ వ్యాప్తంగా ఉద్యమాలు చేసిన చరిత్ర వీకే గారిది. రాయలసీమ అభివృద్ధికి ప్రత్యామ్నాయ విధానాలు రూపొందించిన జ్ఞానీ. నీటిపారుదలతో పాటు పరిశ్రమల అభివృద్ధి, ఖనిజ సంపద ఆధారిత పారిశ్రామికీకరణ కోసం ప్రభుత్వాలపై నిరంతరం ఒత్తిడి తెచ్చేవారు. అధికార పార్టీల దౌర¨న్యాలను ధైర్యంగా ఖండిస్తూ, ప్రజా ప్రయోజనాల కోసం నిర్మాణాత్మక విమర్శలు చేశారు. 1990-92 మధ్య తాడిపత్రిలో జరిగిన ఫ్యాక్షన్ రాజకీయాలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి భారీ బహిరంగ సభ నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ బహిరంగ సభకు సీపీఐ అగ్రనాయకులు నీలం రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుండీ అప్పటి జిల్లా అధ్యక్షులు గాదిలింగప్ప, జనతాదళ్ పార్టీ నాయకులు, సీపీఎం పార్టీ నాయకులు అందరు పాల్గొన్నారు. అలాగే 1994-97 మధ్య పరిటాల రవీంద్ర ఆగడాలను నిరంతరం ఖండిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గళమెత్తారు. రాజకీయంగా ఆయనది వజ్ర సంకల్పం. కమ్యూనిజమే ప్రజల నిజమైన విముక్తి మార్గమని విశ్వసించి, దానిని జీవితాంతం ఆచరించిన వీకే ఆదినారాయణ రెడ్డి వందలాది మంది యువతను కమ్యూనిస్టు ఉద్యమం వైపు నడిపించి నాయకులుగా తీర్చిదిద్దారు. 1997 జూలై 18న ఆయన మరణంతో అనంతపురం జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో ఒక మహోన్నత మూలస్తంభం కూలిపోయింది. ఆయన ఆశయాలు, పోరాట స్ఫూర్తి, ప్రజల పట్ల అంకితభావం నేటికీ ఉద్యమాలకు మార్గదర్శకంగా నిలిచాయి. వీకే ఆదినారాయణ రెడ్డి గారి 29వ వర్ధంతి సందర్భంగా ఆయనకు అరుణారుణ జోహార్లు. ఆయన ఆశయ సాధనకై మరింత అంకితభావంతో పనిచేయడమే ఆయనకు మనం అందించే నివాళి.
(వీకే ఆదినారాయణ రెడ్డి గారి 29వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిద్దాం) ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి,
సెల్ : 9963536417

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు