Homeతెలంగాణప్రభుత్వ విప్‌లకు మంత్రి హోదా.. తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు

ప్రభుత్వ విప్‌లకు మంత్రి హోదా.. తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు

- Advertisement -

తెలంగాణలో శాసనసభా వ్యవహారాలను మరింత సమర్థవంతంగా నిర్వహించే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ప్రముఖ ఎమ్మెల్యేలను ప్రభుత్వ విప్‌లుగా నియమించడమే కాకుండా, వారికి రాష్ట్ర మంత్రి హోదాను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వేముల వీరేశంలు ఉన్నారు.

ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం, ఈ ముగ్గురు నాయకులకు ఃస్టేట్ వారెంట్ ఆఫ్ ప్రిసిడెన్స్ఃలోని ఆర్టికల్-18 కింద రాష్ట్ర మంత్రికి వర్తించే అధికారిక మర్యాదలు, ప్రోటోకాల్ సౌకర్యాలు లభిస్తాయి. ఇకపై వీరికి కేబినెట్ మంత్రులతో సమానమైన గౌరవం, ప్రాధాన్యత దక్కుతాయి. ఈ నిర్ణయం వారి బాధ్యతలకు మరింత బలాన్ని చేకూర్చడంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో వారి పాత్రను బలోపేతం చేయనుంది.

ఈ ముగ్గురు నేతలు మార్చి 18వ తేదీ నుంచే ప్రభుత్వ విప్‌లుగా బాధ్యతలు స్వీకరించినట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, వీరికి కల్పించిన రాష్ట్ర మంత్రి హోదా, సంబంధిత ప్రోటోకాల్ అధికారాలు కేవలం వారు ప్రభుత్వ విప్‌లుగా పదవిలో ఉన్నంత కాలం మాత్రమే వ్యక్తిగతంగా వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. పదవీకాలం ముగిసిన తర్వాత ఈ హోదా వర్తించదని జీవోలో స్పష్టత ఇచ్చింది.

తమ నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు మంత్రి స్థాయి హోదా దక్కడం పట్ల చింతకుంట విజయ రమణారావు, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వేముల వీరేశంల మద్దతుదారులు, స్థానిక కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడటం, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించడంతో పాటు శాసనసభలో ప్రభుత్వ వాణిని బలంగా వినిపిస్తున్నందుకే వారికి ఈ గౌరవం దక్కిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పాలనాపరమైన అనుభవం, అసెంబ్లీలో పనితీరును పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నియామకాలతో సభలో ప్రభుత్వ విప్ బాధ్యతలు మరింత పటిష్ఠంగా అమలవుతాయని, పార్టీ ఎమ్మెల్యేల మధ్య సమన్వయం పెరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు