విశాలాంధ్ర, రాప్తాడు: పరీక్షల్లో మార్కులు తక్కువగా రావడంతో పాటు చదువులో వెనుకబడిపోతున్నాననే మనస్తాపంతో డిగ్రీ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాప్తాడు మండలంలో చోటుచేసుకుంది. రాప్తాడు గ్రామానికి చెందిన దండు నందు (18) అనంతపురంలోని ఎస్ఎస్బీఎన్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. గత ఆరు నెలలుగా సెమిస్టర్ పరీక్షల్లో మార్కులు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ఆమె ఆందోళన చెందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది.సాయంత్రం ఈ విషయాన్ని గమనించిన తల్లి వరలక్ష్మి వెంటనే ఆమెను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందినట్లు రాప్తాడు సీఐ సి. వెంకటేశులు తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.


