Homeకులగణన విధానం లోపభూయిష్టం

కులగణన విధానం లోపభూయిష్టం

- Advertisement -
  • కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం
  • బీహార్, తెలంగాణ నమూనాను అనుసరించాలి
  • ఖడ్గే, రాహుల్, జైరాం డిమాండ్
  • ప్రధాని మోదీకి లేఖ

న్యూఢిల్లీ: కులగణన ప్రక్రియపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుత కులగణనలో ఉపయోగిస్తున్న ఓపెన్-ఎండెడ్ ప్రశ్నావళిని రద్దు చేసి, ముందుగా ధృవీకరించిన కులాల జాబితా ఆధారంగా కొత్త ప్రశ్నావళిని రూపొందించాలని వారు డిమాండ్ చేశారు. ఇందుకు బీహార్, తెలంగాణలో అమలు చేసిన విధానాన్ని జాతీయ స్థాయిలో అనుసరించాలని… అలాగే రాజకీయ పార్టీలు, నిపుణులు, ప్రజలతో విస్తృతంగా సంప్రదింపులు జరపాలని కోరారు. ఈ మేరకు ఖడ్గే, రాహుల్ ప్రధాని మోదీకి సంయుక్త లేఖ రాశారు. ఖడ్గే మంగళవారం ‘ఎక్స్’ వేదికగా ఈ విషయం వెల్లడించారు. ఓపెన్-ఎండెడ్ ప్రశ్నల ద్వారా కులాల సంఖ్యను కచ్చితంగా లెక్కించడం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. ఒకే కులం వేర్వేరు పేర్లు, ఉపకులాల పేర్లతో నమోదైతే గణాంకాలు విభజితమయ్యే అవకాశం ఉందని…దీని వల్ల ముఖ్యంగా ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీలు), అత్యంత వెనుకబడిన వర్గాలు, అణగారిన వర్గాలు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
డ్రాప్డౌన్ జాబితాతో పరిష్కారం
ఈ సమస్యకు సులభమైన పరిష్కారం ఇప్పటికీ ఉందని ఖడ్గే, రాహుల్ సూచించారు. కులాల పేర్లతో ముందుగానే డ్రాప్డౌన్ జాబితా రూపొందించి, అందులో నుంచి సంబంధిత కులాన్ని ఎంపిక చేసే విధానాన్ని తీసుకురావాలని కోరారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వివరాలను నమోదు చేసే సమయంలో ఇదే తరహా విధానాన్ని అనుసరిస్తున్నారని తెలిపారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు సంబంధించిన ప్రభుత్వ జాబితాలు, ఆంత్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వంటి ఇప్పటికే అందుబాటులో ఉన్న జాబితాల ఆధారంగా కులాల జాబితాను రూపొందించవచ్చని సూచించారు. తెలంగాణ, బిహార్‌లో నిర్వహించిన కుల సర్వేల విధానాన్ని కేంద్రం పరిశీలించాలని ఖడ్గే, రాహుల్ కోరారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ కులాల జాబితాను ఉపయోగించి వివరాలు సేకరించిన విషయాన్ని వారు ప్రస్తావించారు. తమ లేఖకు తెలంగాణ కుల సర్వే-2024, బీహార్ కుల సర్వే-2022లో ఉపయోగించిన కులాల జాబితాల ప్రతులను కూడా జత చేసినట్లు తెలిపారు.
ఇది కులగణన కాదు…మోసం: జైరాం రమేశ్
దేశవ్యాప్తంగా చేపట్టనున్న కులగణన విధానంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే కేంద్రం కులగణన విధానాన్ని ఖరారు చేసిందని మండిపడ్డారు. ఆగస్టు 14న జారీ చేసిన నోటిఫికేషన్‌లో మొత్తం 40 ప్రశ్నలు ఉండగా, అందులో ఒక్క ప్రశ్న మాత్రమే కులానికి సంబంధించినదని పేర్కొంటూ… దీనిని సమగ్ర కులగణనగా పరిగణించలేమన్నారు. ప్రతిపాదిత విధానాన్ని రద్దు చేసి, బిహార్, తెలంగాణలో నిర్వహించిన కుల సర్వేల తరహాలో దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… గత మూడేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కులగణన కోసం డిమాండ్ చేస్తోందని తెలిపారు. ఈ అంశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి ఇప్పటికే లేఖలు రాశారని, అయితే వాటికి కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదని జైరాం చెప్పారు. బీహార్ కుల సర్వే ఫలితాలను 2023 అక్టోబర్ 2న, తెలంగాణ కుల సర్వే ఫలితాలను 2025 ఫిబ్రవరి 4న వెల్లడించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో ముందుగానే సిద్ధం చేసి, ధృవీకరించిన కులాల జాబితా ఆధారంగా సర్వే నిర్వహించిన విధానాన్ని జాతీయ స్థాయిలోనూ అనుసరించడం ఆచరణాత్మక పరిష్కారమని పేర్కొన్నారు. ప్రస్తుతం లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కులగణన ప్రక్రియ ప్రారంభమైందని జైరాం రమేశ్ తెలిపారు. దేశవ్యాప్తంగా కులగణన 2027 ఫిబ్రవరిలో నిర్వహించాల్సి ఉందని చెప్పారు. అందువల్ల ఇప్పటికీ మార్పులు చేసేందుకు సమయం ఉందన్నారు. ‘కులగణనను నిజాయితీగా, సమగ్రంగా నిర్వహించాలనే ఉద్దేశం మోదీ ప్రభుత్వానికి లేదు. ఈ ప్రక్రియను అర్థరహితమైన కార్యక్రమంగా మార్చేస్తున్నారు. ఇది కులగణన కాదు.. మోసం, నమ్మకద్రోహం. ఈ అంశాన్ని మరోసారి పక్కన పెట్టే ప్రయత్నం’ అని రమేశ్ ఆరోపించారు. 2027 జనాభా లెక్కల్లో కులాల వారీగా వివరాలను సేకరించనున్నట్లు 2025 ఏప్రిల్ 30న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు